Updated : 06/10/2022 21:04 IST

వక్షోజాల్ని ఇలా పరీక్షించుకోవాలి!

హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, నెలసరి, అసౌకర్యమైన దుస్తులు ధరించడం.. ఇలా కారణమేదైనా రొమ్ముల్లో నొప్పి చాలామందికి అనుభవమే. కానీ ఈ నొప్పుల్ని నిర్లక్ష్యం చేయడం, రొమ్ముల్లో గడ్డల్లాంటివి తగిలినా పట్టించుకోకపోవడం.. వంటివి చేస్తే మాత్రం ఒక్కోసారి అవి ప్రమాదకర రొమ్ము క్యాన్సర్‌కి కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా విస్తరిస్తోన్న క్యాన్సర్లలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మొదటిస్థానంలో ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని ఆదిలోనే గుర్తించడానికి నిర్ణీత వ్యవధుల్లో ఇంట్లోనే ఎవరికి వారే స్వయంగా తమ వక్షోజాలను పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా వాటిల్లో ఏవైనా గడ్డల్లాగా తాకినా, రొమ్ముల ఆకృతిలో తేడా ఉన్నా, వాపు-ఎరుపెక్కడం వంటి మార్పులు గమనించినా.. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం వల్ల తొలి దశలోనే సమస్యను గుర్తించి ప్రాణాలు నిలుపుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ‘రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం’ సందర్భంగా స్వయంగా వక్షోజాల్ని ఎలా పరీక్షించుకోవాలి? ఎన్ని రోజులకోసారి పరీక్ష చేసుకోవాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం..

రొమ్ము క్యాన్సర్‌.. వయసుతో సంబంధం లేకుండా మహిళల పాలిట శాపంగా పరిణమిస్తోందీ వ్యాధి. అందుకే నిర్ణీత వ్యవధిలో ఇంట్లోనే ఎవరికి వారే స్వయంగా రొమ్ముల్ని పరీక్షించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా తొలి దశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

అన్ని గడ్డలూ క్యాన్సర్ కారకాలు కావు!

వక్షోజాల్లో ఏర్పడే గడ్డల్ని రొమ్ము క్యాన్సర్‌ ప్రారంభ సంకేతాల్లో ఒకటిగా పరిగణించవచ్చంటున్నారు నిపుణులు. అయితే అందులోనూ 80-85 శాతం గడ్డలు క్యాన్సర్‌ రహితమైనవేనట! క్యాన్సర్‌కు కారణమయ్యే గడ్డలు అసాధారణ ఆకృతుల్లో ఉండి.. నొప్పి కలిగించకుండా ఉంటాయట..! అలాగని నొప్పి కలిగించే గడ్డల్ని నిర్లక్ష్యం చేయడం కూడా తగదు. ఎందుకంటే అతికొద్ది మందిలో మాత్రమే నొప్పితో కూడిన గడ్డలు క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

ఎలా పరీక్షించుకోవాలంటే..!

ఇంట్లోనే రొమ్ముల్ని పరీక్షించుకోవడానికి రెండు రకాల పద్ధతుల్ని పాటించాల్సి ఉంటుంది. ఒకటి వక్షోజాల ఆకృతి, పరిమాణం వంటివి పరిశీలించడం; రెండోది వాటిని తాకుతూ సమస్యను పసిగట్టడం.

వక్షోజాలను పరిశీలించడం

✬ ఇందులో భాగంగా నడుం వరకు దుస్తులేవీ ధరించకుండా చేతుల్ని వెనక్కి పెట్టి అద్దం ముందు నిల్చోవాలి. ఇప్పుడు రొమ్ముల పరిమాణం, ఆకృతి, వాటిపై ఏమైనా ముడతలు, గుంతలు పడుతున్నాయా?, చనుమొనల నుంచి ఏవైనా స్రావాలు వెలువడుతున్నాయా?, రొమ్ములు-చనుమొనల భాగాల్లో ఎరుపెక్కడం, వాపు రావడం.. మొదలైన విషయాలన్నీ ఎవరికి వారే పరిశీలించుకోవాలి.

✬ ఇప్పుడు రెండు చేతుల్ని పైకెత్తి పై విషయాలన్నీ మరోసారి పరీక్షించుకోవాలి.

✬ ఆ తర్వాత రెండు చేతుల్ని నడుంపై ఉంచి.. భుజాలను కాస్త ముందుకు నెట్టి పైన సూచించినట్లుగా రొమ్ముల్ని ఇంకోసారి పరిశీలించాలి.

✬ ఇప్పుడు భుజాలను పైకెత్తి వక్షోజాల్ని చెక్‌ చేసుకోవాలి. ఈ క్రమంలో ముందుగా ఏదో ఒక భుజాన్ని పైకెత్తాలి.. ఉదాహరణకు ఎడమ భుజాన్ని పైకి లేపి.. ఎడమ రొమ్ము పరిమాణం, ఆకృతిలో ఏవైనా తేడాలున్నాయేమో గమనించాలి.. అలాగే నొప్పి, అసౌకర్యంగా అనిపిస్తోందేమో గమనించుకోవాలి. ఆపై కుడి భుజం పైకెత్తి మళ్లీ ఇదే పద్ధతిని పునరావృతం చేయాలి.

తాకుతూ పరీక్షించుకోవడం!

✬ ముందుగా చెవుల కింది భాగంలో చేతి మూడువేళ్లను ఉంచి గుండ్రంగా తిప్పుతూ (సర్క్యులర్‌ మోషన్‌) మెడ వరకు రావాలి. ఈ క్రమంలో ముందుగా కాస్త నెమ్మదిగా, ఆపై మధ్యస్తంగా, తర్వాత బలంగా ప్రెషర్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

✬ ఇప్పుడు మెడ ఎముకను (కాలర్‌ బోన్‌) బలంగా ఒత్తుతూ ఆ భాగంలో ఏదైనా అసౌకర్యంగా ఉందేమో గమనించాలి.

✬ ఆపై ఎడమ చేతిని పైకి లేపి మెడ వెనక్కి పెట్టాలి. ఇప్పుడు కుడిచేతి వేళ్ల సహాయంతో ఎడమ రొమ్ము దగ్గర్నుంచి ఒత్తుతూ ఎడమ చంక దాకా రావాలి. ఆపై ఈ భాగంలోనే మరోసారి బలంగా ఒత్తుతూ గుండ్రంగా తిప్పుతూ పరిశీలించాలి. ఇలా చేయడం వల్ల గడ్డలేమైనా ఉంటే గుర్తించచ్చు. ఇదే పద్ధతిని కుడి రొమ్ముకు కూడా ఫాలో అవ్వాలి.

✬ ఇప్పుడు మంచం మీద వెల్లకిలా పడుకొని ఒక చేతిని తల కింద పెట్టుకోవాలి. అవసరమైతే భుజాల కింద దిండు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరో చేతి వేళ్ల సహాయంతో రొమ్ముపై ఒక భాగంలో కాస్త నెమ్మదిగా, మధ్యస్తంగా, బలంగా ఒత్తుతూ గుండ్రంగా తిప్పాలి. ఆపై చేతి వేళ్లను కాస్త పక్కకు జరిపి అక్కడా ఇదే పద్ధతిని పాటించాలి. రొమ్ము చుట్టూ ఇలాగే చేయాల్సి ఉంటుంది. ఆఖరుగా చనుమొనల వద్ద కూడా కాస్త ఒత్తుతూ గడ్డలాంటిదేమైనా ఉందేమో పరిశీలించుకోవాలి. ఇలా ఒక రొమ్మును పరీక్షించుకున్న అనంతరం మరో వక్షోజాన్ని కూడా ఇలాగే పరీక్షించుకోవాలి.


ఎప్పుడు చేసుకోవాలి?

ఇంట్లోనే స్వయంగా ఎవరికి వారే రొమ్ముల్ని పరీక్షించుకున్నా.. అదీ నిర్ణీత సమయంలోనే చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నెలసరి మొదలైన ఐదారు రోజులకు స్వీయ పరీక్ష చేసుకోవడానికి అనువైన సమయమట! ఎందుకంటే రుతుచక్రం సమయంలో హార్మోన్ల స్థాయులు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. తద్వారా రొమ్ము కణజాలంలో మార్పులొస్తాయి. ఎప్పుడైతే నెలసరి మొదలవుతుందో అప్పుడు రొమ్ములో వచ్చిన వాపు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. పిరియడ్‌ ముగిసే సమయానికి అంటే ఐదారు రోజుల వరకు రొమ్ములు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. ఈ సమయంలో పరీక్షించుకుంటే వక్షోజాల్లో ఉండే గడ్డల్ని సులభంగా పసిగట్టచ్చంటున్నారు నిపుణులు.

ఇక మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు నెలలో ఎప్పుడైనా స్వీయ రొమ్ము పరీక్ష చేసుకోవచ్చు. అది కూడా ప్రతి నెలా ఒకే తేదీలో పరీక్ష చేసుకోవాలి. ఉదాహరణకు.. అక్టోబర్ 17న పరీక్షించుకుంటే.. తిరిగి నవంబర్ 17న మళ్లీ పరీక్ష చేసుకోవాలన్నమాట! ఇలా నెలనెలా ఒక నిర్ణీత తేదీని ఫాలో అవ్వాలి.


ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి?

ఇలా మీరు ఇంట్లోనే రొమ్ముల్ని పరీక్షించుకున్నప్పుడు వక్షోజాల్లో గడ్డలున్నట్లుగా గమనించడం; అసాధారణ వాపు; ఎరుపెక్కడం; ఆ ప్రదేశంలో చర్మంపై ముడతలు పడడం.. చర్మం మందంగా, గరుకుగా మారడం; చనుమొనల నుంచి స్రావాలు వెలువడడం, రక్తస్రావం కావడం.. వంటి లక్షణాలు గమనిస్తే సిగ్గు, బిడియం అంటూ అలక్ష్యం చేయకుండా.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం. తద్వారా వైద్యులు అసలు సమస్యేంటో పరీక్షించి చూస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని