close
Published : 30/11/2021 21:03 IST

నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!

ఎయిడ్స్.. నివారణ మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి..

నమస్కారం.
నా పేరు విజయ. మాది తూర్పు గోదావరి జిల్లా దగ్గర ఓ పల్లెటూరు. మా అమ్మానాన్నలకు ముగ్గురం అమ్మాయిలం. నేనే అందరికంటే చిన్నదాన్ని. అప్పట్లో ఆడపిల్లలకు చాలా త్వరగా పెళ్లిళ్లు చేసేసేవారు. మాది పల్లెటూరు కాబట్టి ఆడపిల్లల చదువులు కూడా అంతంతమాత్రంగానే ఉండేవి. దాంతో నా పద్నాలుగేళ్ల వయసప్పుడే మా అక్కలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు అమ్మానాన్న. ఆ తర్వాత ఇంకేముంది.. రాజ్యమంతా నాదే! దాదాపు ఏడాది పాటు యువరాణిలా ఫీలయ్యా. అమ్మానాన్నల ప్రేమను నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తూ, అక్కలను కలిసినప్పుడు వారిని సరదాగా ఆటపట్టిస్తూ ఎంతో సంతోషించేదాన్ని. ఆ తర్వాత నాకు కూడా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు మా అమ్మానాన్న. మొదట్లో ఏడెనిమిది సంబంధాలు వచ్చినా.. జాతకాలు కుదరకపోవడం, అబ్బాయి తీరు- తెన్నులు నచ్చకపోవడం.. ఇలా రకరకాల కారణాల వల్ల అవి తప్పిపోయాయి.

దాంతో పెళ్లిచూపులంటే సరదాగా ఆడుకునే ఓ ఆటలా అనిపించింది నాకు. అందుకే ఆ తర్వాత కూడా పెళ్లి చూపులనగానే బుట్టబొమ్మలా అలంకరించుకొని పెద్దల ముందు కూర్చొన్నా. అప్పుడే తొలిసారి నేను విజయ్‌ని చూశా. వాళ్లది రాజమండ్రి. అతను ఓ లారీ డ్రైవర్. సొంతంగా లారీ ఉందని, భవిష్యత్తులో వాటితో ఏదైనా వ్యాపారం చేయాలని ఉందని మా అమ్మానాన్నలతో చెప్తుంటే విన్నా. విజయ్ అటు అమ్మానాన్నలతో మాట్లాడుతూనే.. తన కళ్లతో నాతో కూడా మాట్లాడినట్లు అనిపించింది. ఎందుకో అతను కూడా నాకు బాగా నచ్చేశాడు. ఇద్దరి విషయంలోనూ జాతకాలు, పొంతనలు.. అన్నీ కుదరడంతో సంబంధం కుదిర్చి మూడు నెలల్లో అంగరంగ వైభవంగా నా పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కొత్త జీవితంపై కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టా. అయితే అక్కడి పరిస్థితులు మాత్రం నా వూహలకు భిన్నంగా ఉన్నాయి.

*****

ఎందుకంటే మా అత్తయ్యకు వాళ్ల బంధువుల అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని ఉండేదట! కానీ విజయ్‌కు ఇష్టం లేకపోవడంతో అయిష్టంగానే మా ఇంటికి పెళ్లిచూపులకు వచ్చారట. నేను తనకు నచ్చడంతో వారిని ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నారు విజయ్. అందుకే నేను అత్తారింటికి వెళ్లినా మా అత్తామామలు నాతో ముభావంగానే ఉండేవారు. వారి విషయాల్లో అంతగా జోక్యం చేసుకోనిచ్చేవారు కాదు. నేను కూడా అంతగా పట్టించుకునేదాన్ని కాదు. ఆయనే లోకంగా గడిపేసేదాన్ని. ఇలా మా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. ఈలోగా నేను గర్భం ధరించా. ఆయనకు కూడా వేరే రాష్ట్రాల్లో ఆర్డర్స్ డెలివరీ ఇవ్వాల్సి రావడం.. మొదలయ్యాక నేను పుట్టింటికి వెళ్లిపోయా. ఆ తర్వాత కూడా నెలకు రెండు, మూడుసార్లు మా పుట్టింటికి వచ్చి నన్ను చూసి వెళ్లేవారు విజయ్. ఈలోగా ఆడపిల్ల పుడితే నాకు విడాకులు ఇచ్చేయమంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు మా అత్తమామలు. వాళ్లకు సర్దిచెప్పేందుకు ఆయన కూడా ఎంతగానో ప్రయత్నించారు.

*****

అయితే నాకు పండంటి బాబు పుట్టడంతో వారి ఆటలేవీ సాగలేదు. బిడ్డ పుట్టిన ఐదు నెలల తర్వాత మళ్లీ నన్ను ఇంటికి తీసుకెళ్లారు విజయ్. అప్పుడు కూడా బాబు సంరక్షణ లేదా నా బాగోగులు కూడా వాళ్లు పట్టించుకున్నది లేదు. దీనికి తోడు విజయ్ ప్రవర్తనలో కూడా నిదానంగా మార్పు రావడం మొదలైంది. వారానికి రెండు మూడు సార్లు ఇంటికి వచ్చి వెళ్లే విజయ్.. ఆ తర్వాత వారానికోసారి ఇంటికి రావడమే గగనంగా మారిపోయింది. ఎప్పుడు అడిగినా.. 'మీ కోసమే కష్టపడుతున్నా.. అర్థం చేసుకోండి..' అనేవారు. ఆయన ప్రవర్తనపై మనసులో ఏదో మూల అనుమానం ఉన్నా ఆయనపై ఉన్న నమ్మకం దానిపై దృష్టి పెట్టనిచ్చేది కాదు. ఈలోగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఒక్కసారిగా షాకయ్యా. ఎందుకంటే నాకు హెచ్ఐవీ సోకిందని రిపోర్ట్‌లో వచ్చింది. షాక్ నుంచి తేరుకుని కాస్త ఆలోచించా. విషయం ఇంట్లో చెప్పకుండా ఆయనను కూడా ఆసుపత్రికి తీసుకొచ్చి హెచ్ఐవీ టెస్ట్ చేయించా. విజయ్‌కు కూడా పాజిటివ్ అని రావడంతో నా ప్రశ్నకు సమాధానం దొరికినట్త్లెంది. వెంటనే ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చి తనని నిలదీశా. మొదట తనకేం తెలియదని గదమాయించినా నా రిపోర్ట్ కూడా చూపించడంతో కన్నీటిపర్యంతమయ్యాడు. హైవేపై లారీ నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఓసారి రోడ్డు పక్కన ఉన్న దాబా వద్ద మద్యం తీసుకున్నానని, ఆ తర్వాత తానేం చేశానో తనకే గుర్తు లేదని అన్నారు. మొత్తానికి తప్పు ఎవరు చేసినా ఇప్పుడు ఇద్దరం దానికి శిక్ష అనుభవిస్తున్నాం. అయితే వైద్యులు మాకు ఎయిడ్స్ గురించి పూర్తి వివరాలు చెప్పి చికిత్స తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పడంతో మా మనసులు కాస్త కుదుటపడ్డాయి.

ఈ సంఘటన తర్వాత మళ్లీ మామూలు మనిషి అయిన విజయ్ నన్ను, బాబుని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ తర్వాత మా బిడ్డ భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు వేసేవాళ్లం. ఆర్థికంగా ఇబ్బంది రాకుండా ఇన్స్యూరెన్స్‌ పాలసీలు కట్టడం ప్రారంభించారు. అలా బాబు సంరక్షణ, కుటుంబ బాధ్యతల నడుమ మూడేళ్ల సమయం గడిచిపోయింది. అన్నీ మనం అనుకున్నట్లే జరిగితే ఇది జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి? నా భర్త హైవేపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో నా జీవితమంతా ఒక్కసారి చీకటిమయం అయిపోయింది. మాకు ఎయిడ్స్ ఉన్న విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను, నా బాబును అత్తింటి వారు చేరదీయకపోగా బయటకు గెంటేశారు. దాంతో నా తల్లిదండ్రుల వద్దకే వచ్చేశాను.

*****

అయినా సరే.. చుట్టుపక్కల వాళ్ల మాటల ఈటెలు నా మనసును గాయపరుస్తూనే ఉండేవి. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకుందామని అనిపించేది. కానీ నాలా ఏ తప్పూ చేయకుండా ఈ వ్యాధి బారినపడే వారు చాలామంది ఉంటారని వైద్యులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వారి కోసం ఏదైనా చేయాలని అనిపించింది. అసలు ఈ వ్యాధి గురించి మొదట అందరికీ అవగాహన కల్పించాలని ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆసుపత్రికి పరుగులు తీశా. నా ఆలోచన చెప్పి, వారి సహాయం కోరాను. ఈ వ్యాధి గురించి నాకు మరింత సమగ్రంగా అవగాహన కలిగేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దాంతో మొదట ఇంటింటికీ తిరిగి దీని గురించి చెప్పాలని భావించా. కానీ కొందరు ఛీత్కరించుకోవడం, ఇంకొందరు ముఖం మీదే తలుపులు వేయడం.. వంటివి చేయడంతో బాధనిపించి ఆగిపోయా.

*****

ఇలా సాధారణంగా మాటల రూపంలో కాకుండా బొమ్మల రూపంలో చెబితే త్వరగా అర్థమవుతుంది కదానిపించింది. వెంటనే వైద్యుల సహాయంతో వ్యాధికి సంబంధించిన కొన్ని వివరాలను బొమ్మల రూపంలో ముద్రించి తీసుకొచ్చా. వాటిని ఇంటి గోడలపై అతికించా. అలాగే ప్రతి రెండు వీధులకీ ప్రత్యేకించి ఓ మహిళా సమావేశాన్ని ఏర్పాటుచేసి దీని గురించి చెప్పడం ప్రారంభించా. మొదట్లో చీదరించుకున్నవారే ఆ తర్వాత నేను చెప్పిన వివరాలు తెలుసుకొని తమ తప్పు తెలుసుకున్నారు. ఇప్పుడు మా వూరిలో నేను గ్రామస్థాయిలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగించే ఆశా కార్యకర్తగా పని చేస్తున్నా. ఈ కథంతా జరిగి దాదాపు పదిహేనేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ ఈ సమాజంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల కొందరు అమానుషంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. హెచ్ఐవీ సోకినంత మాత్రాన వాళ్లు కచ్చితంగా తప్పు చేశారని అర్థం కాదు. ఎంతో కష్టపడి చదువుకున్న చదువు కాస్త్తెనా ఆలోచించే పరిజ్ఞానం ప్రస్తుత తరం వారికి ఇవ్వకపోవడం బాధాకరం.

*****

నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు. హెచ్ఐవీ సోకినంత మాత్రాన తప్పు చేశారని కూడా అర్థం కాదు. ఈ విషయాలు గుర్తుంచుకొని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కూడా అక్కున చేర్చుకోండి. వారికి కూడా గౌరవ, మర్యాదలు ఇవ్వండి. మీరు కూడా ఈ వ్యాధి పట్ల నలుగురిలో అవగాహన కలిగించడానికి ప్రయత్నించండి. అంతేకానీ బాధితులను అందరిలోనూ నవ్వులపాలు చేస్తూ వారిని అవమానించకండి..

ఇట్లు,
విజయ


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి