మూర్ఛని జయించి.. కిరీటాన్ని దక్కించుకుంది..!

59వ ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీలు ఇటీవలే మణిపూర్‌లో అట్టహాసంగా ముగిశాయి. ఇందులో రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా కిరీటాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మరో ఇద్దరు సుందరీమణులూ....

Published : 22 Apr 2023 12:32 IST

(Photos: Instagram)

59వ ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీలు ఇటీవలే మణిపూర్‌లో అట్టహాసంగా ముగిశాయి. ఇందులో రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా కిరీటాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మరో ఇద్దరు సుందరీమణులూ రన్నరప్‌గా నిలిచారు. వారిలో మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన స్ట్రెలా లువాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్నప్పుడే మూర్ఛ వ్యాధి బారిన పడిన ఆమె అందగత్తె కావాలని కలలు కంది. వాటిని సాకారం చేసుకోవడానికి శక్తివంచన లేకుండా శ్రమించింది. ఇటీవలే జరిగిన అందాల పోటీల్లో రెండవ రన్నరప్‌గా నిలిచింది. స్ట్రెలా.. నటిగా, యాంకర్గా, రైటర్‌గా కూడా రాణిస్తోంది. ఈ క్రమంలో ఆమె గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

వారి నుంచి అవహేళనలు ఎదురయ్యాయి..

స్ట్రెలా తల్లిదండ్రులు రతన్‌, ఆశలత. వీరికి ఎనిమిది మంది సంతానం. వారిలో స్ట్రెలా ఆరో అమ్మాయి. వీరిది మణిపూర్‌లోని ఓ మారుమూల ప్రాంతం. స్ట్రెలా బాల్యం ఎనిమిదేళ్ల వరకు సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు అనుకోని సమస్య వచ్చింది. దీని గురించి మాట్లాడుతూ ‘నాకు ఎనిమిదేళ్ల వయసులో మూర్ఛ వ్యాధి వచ్చింది. ఒత్తిడి, ఆందోళన వల్ల ఈ సమస్య వచ్చింది. ఆ సమయంలో స్నేహితులు, టీచర్ల నుంచి మద్దతు లభించక పోగా.. వారి నుంచి అవహేళనలు ఎదురయ్యాయి. దాంతో దాదాపు రెండు సంవత్సరాల పాటు పాఠశాలకు దూరమయ్యాను. ఆ సమయంలో నేను ఒంటరిదాన్ననే భావన కలిగేది. దానివల్ల నాలో ఆందోళన మరింత పెరిగేది. అప్పుడు నా తల్లిదండ్రులు ఎంతో తోడ్పాటు అందించారు. అమ్మ ఎక్కువ సమయం నన్ను కనిపెట్టుకునే ఉండేది. దాంతో నాలో క్రమంగా ధైర్యం పెరిగింది. ఆ తర్వాత నా మనసులోని భావాలను పేపర్‌పై రాయడం మొదలుపెట్టా.. అది నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఆ తర్వాత యోగా, డ్యాన్స్‌ తరగతులకు వెళ్లాను. డాక్టర్ల దగ్గర పలు థెరపీలు తీసుకున్నాను. ఈ జాగ్రత్తలు పాటించడంతో రెండు సంవత్సరాల్లో ఈ సమస్య నుంచి బయటపడగలిగాను’ అని చెప్పుకొచ్చిందీ సుందరి.

చదువులోనూ మేటి..

సాధారణంగా ఆరోగ్య సమస్యలుంటే చదువు కొనసాగించడం కష్టం. ఈ క్రమంలో స్ట్రెలా రెండేళ్ల పాటు స్కూల్‌కు దూరమైంది. కానీ, చదవాలనే దృఢ సంకల్పం ఉంటే దేన్నైనా సాధించవచ్చని తను నిరూపించింది. స్ట్రెలా ‘ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ స్టడీస్‌’ పూర్తి చేసింది. మరోవైపు మోడల్గా, టెలివిజన్‌ యాంకర్‌గా రాణిస్తోంది. స్ట్రెలాకు మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా అంటే చాలా ఇష్టం. ఆమెను స్ఫూర్తిగా తీసుకునే అందాల పోటీల్లో పాల్గొనాలని కలలు కంది. వాటిని సాకారం చేసుకోవడానికి యాంకరింగ్‌, మోడలింగ్‌ రంగాల్లో ప్రవేశించింది.

కలను సాకారం చేసుకున్న వేళ..!

అందాల పోటీల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది స్ట్రెలా. అలా 2016లో మొదటిసారి ‘మిస్‌ మణిపూర్’ పోటీలలో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకుంది. కానీ, సాంకేతిక కారణాల వల్ల ఆమె అర్హత సాధించలేకపోయింది. హార్డ్‌వర్క్, స్వీయనమ్మకం ఉంటే దేన్నైనా సాధించవచ్చని బలంగా నమ్మే స్ట్రెలా.. తిరిగి మరోసారి ప్రయత్నించింది. అలా 2017లో ఏకంగా ‘మిస్‌ మణిపూర్‌’ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ కోసం రెండుసార్లు ఆడిషన్స్‌కు వెళ్లినా ఎంపిక కాలేకపోయింది. కానీ తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అలా ఈ సంవత్సరం మరోసారి ‘మిస్‌ మణిపూర్‌’ టైటిల్‌ గెలుచుకొని ‘ఫెమినా మిస్‌ ఇండియా’ పోటీల్లో అడుగుపెట్టింది. ఈ పోటీల్లో రెండవ రన్నరప్‌గా నిలవడంతో పాటు ‘మిస్‌ గ్లామరస్‌ లుక్, ‘మిస్‌ స్టైల్‌ ఐకాన్‌’ టైటిళ్లను కూడా సొంతం చేసుకుంది.

ఆ ప్రాంతం నుంచి...

ఈశాన్య రాష్ట్రాల నుంచి అందగత్తెలుగా ఎంపికైన వారు చాలా తక్కువమంది ఉన్నారు. ఈ సందర్భంగా స్ట్రెలా మాట్లాడుతూ ‘మేమందరం అందగత్తెలం అని నిరూపించుకోవడానికి ఇక్కడ కూర్చోలేదు. మేము కన్న కలలను నిజం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. మణిపూర్‌లోని చిన్న ప్రాంతం నుంచి వచ్చిన నేను ఇంత పెద్ద పోటీలలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు.. చాలామంది అమ్మాయిలకు ఇలాంటి కల ఉంటుంది. ఆ కలను సొంతం చేసుకునే ధైర్యం ఈ పోటీలు ఇస్తాయి’ అని చెప్పుకొచ్చింది. అలాగే కిరీటం పొందిన తర్వాత మాట్లాడుతూ ‘నన్ను విజేతగా ప్రకటించగానే కొద్దిసేపు నమ్మలేకపోయా.. కానీ చాలా ఆనందంగా ఉంది. భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా ఉబికివచ్చాయి.’ అని చెప్పుకొచ్చింది.

సామాజిక సేవలోనూ..

మూర్ఛ వ్యాధితో బాధపడిన సమయంలో తనకెదురైన అవహేళన ఇతర చిన్నారులకు ఎదురుకాకూడదని ఆశించింది స్ట్రెలా. ఈ క్రమంలో లింగ సమానత్వం, పిల్లలకు అనుకూలమైన విద్యావ్యవస్థ వంటి అంశాలపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తోంది. ఇందులో భాగంగానే లింగ సమానత్వంపై తీసిన ‘Who Said Boys Can't Wear Make Up’ అనే చిత్రంలో కూడా పాలుపంచుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని