9 వేల అడుగుల ఎత్తులో.. స్కేట్ బోర్డింగ్ చేస్తూ విమానం నుంచి దూకేసింది!

ఎవరేం చెప్పినా, వద్దని వారించినా మన మనసుకు నచ్చింది చేసినప్పుడే అందులో విజయం సాధించగలం.. ఎంచుకునే కెరీర్‌ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అమెరికన్‌-బ్రెజిల్‌ స్కేట్‌బోర్డింగ్‌ క్రీడాకారిణి లెటీషియా బఫొనీ కూడా ఇదే చేసింది. తన కూతురు అబ్బాయిలతో కలిసి ఆడడం జీర్ణించుకోలేకపోయిన....

Published : 24 Mar 2023 20:28 IST

(Photos: Instagram)

ఎవరేం చెప్పినా, వద్దని వారించినా మన మనసుకు నచ్చింది చేసినప్పుడే అందులో విజయం సాధించగలం.. ఎంచుకునే కెరీర్‌ విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అమెరికన్‌-బ్రెజిల్‌ స్కేట్‌బోర్డింగ్‌ క్రీడాకారిణి లెటీషియా బఫొనీ కూడా ఇదే చేసింది. తన కూతురు అబ్బాయిలతో కలిసి ఆడడం జీర్ణించుకోలేకపోయిన ఆమె తండ్రి.. ఈ క్రీడపై తనకున్న మక్కువను ఆదిలోనే తుంచేయాలనుకున్నాడు. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆట పైనే దృష్టి పెట్టిందామె. ఫలితంగా.. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల క్రీడాకారిణిగా ఎదిగింది. స్కేట్‌బోర్డింగ్‌లో సరికొత్త సాహసాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. పలు ప్రపంచ రికార్డులూ తన పేరిట లిఖించుకుంటోందీ స్కేట్‌బోర్డింగ్‌ క్వీన్‌. ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుందామె. ఎగురుతున్న విమానం వెనుక వైపు ఉన్న స్కేట్‌బోర్డ్ గ్రైండ్ నుంచి స్కేట్‌బోర్డింగ్‌ చేస్తూ దూకేసిన ఆమె.. ఈ స్టంట్‌తో గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ రికార్డుల రారాణి గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

అబ్బాయిలా ఉండాలనుకునేదాన్ని!

నేను పుట్టి పెరిగిందంతా బ్రెజిల్‌లోని సావో పౌలోలో! నాకు చిన్నతనం నుంచి ఆటలంటే మక్కువ. ఈ ఇష్టంతోనే వీధుల్లో అబ్బాయిలతో పాటు ఆడుకునేదాన్ని. ఈ క్రమంలోనే స్కేట్‌బోర్డింగ్‌ క్రీడపై ఆసక్తి పెరిగింది. అయితే మా వీధిలో ఈ ఆట ఆడేవాళ్లంతా అబ్బాయిలే కావడంతో వాళ్లతోనే ఆడుకునేదాన్ని. ఈ క్రీడపై నాకున్న మక్కువను గుర్తించిన మా బామ్మ నా 11 ఏళ్ల వయసులో నాకు స్కేట్‌బోర్డ్‌ కొని బహుమతిగా ఇచ్చింది. ఇలా అబ్బాయిలతో ఎక్కువగా ఆడే క్రమంలో నేనూ అబ్బాయిలా రడీ అయ్యేందుకు, కనిపించేందుకు తాపత్రయపడేదాన్ని. కానీ నాన్నకు ఇది నచ్చలేదు. దాంతో ఓ రోజు కోపంతో బోర్డు విరగ్గొట్టారు. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నా. ‘ఇలా అబ్బాయిల ఆట ఆడే బదులు అమ్మాయిలతో పాటు ఫుట్‌బాల్‌ ఆడు.. నేను కాదనను’ అన్నారు. కానీ నేను మాత్రం స్కేట్‌బోర్డింగ్‌ చేస్తానని తేల్చిచెప్పేశా. కొత్త బోర్డు కొనే వీల్లేక.. ఫ్రెండ్స్‌ దగ్గర్నుంచి విడిభాగాలు సేకరించి, వాటిని అతికించి బోర్డు తయారుచేసుకొని మరీ నా తొలి స్కేట్‌ కాంపిటీషన్‌లో పాల్గొన్నా. అందులో నా ప్రతిభ చూసిన నాన్న.. ఆపై తన మనసు మార్చుకున్నాడు. ఈ క్రీడలో నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. రోజూ స్కేట్‌పార్క్స్‌ (స్కేట్‌బోర్డింగ్‌ సాధన చేసే ప్రదేశం)కు తీసుకెళ్తూ.. ఈ ఆటలో నా నైపుణ్యాలను తీర్చిదిద్దుకునేందుకు తగిన శిక్షణ కూడా ఇప్పించారు.

లాస్‌ ఏంజెల్స్‌.. నా డ్రీమ్‌ సిటీ!

అప్పటిదాకా స్థానికంగా పలు స్కేట్‌బోర్డింగ్‌ పోటీల్లో పాల్గొన్న నేను.. నా 14 ఏళ్ల వయసులో తొలిసారి లాస్‌ ఏంజెల్స్‌లో పోటీల కోసం వెళ్లాను. అక్కడి అత్యుత్తమ స్కేట్‌పార్క్స్‌, ఈ క్రీడకు లభించే ఆదరణ చూశాక.. ఈ నగరంలోనే స్థిరపడాలనిపించింది. కొత్త ప్రదేశం, కొత్త మనుషుల మధ్య కొత్త భాష నేర్చుకోవడం, సర్దుకుపోవడం కాస్త కష్టంగానే అనిపించింది. ఈ సమయంలో స్కేట్‌ ఫొటోషూట్స్‌ చేసే అనా పౌలా అనే బ్రెజిల్‌ ఫొటోగ్రాఫర్‌ నాకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇక నేను పోటీలు నెగ్గే కొద్దీ నాకు స్పాన్సర్‌షిప్‌ పెరిగినా.. స్కేట్‌బోర్డ్‌ బ్రాండ్స్‌ మాత్రం మహిళల్ని స్పాన్సర్ చేయడానికి నిరాకరించేవి. ఈ క్రమంలో నేనే సొంతంగా ఓ స్కేట్‌బోర్డ్‌ కంపెనీని నెలకొల్పాలని అన్నీ సిద్ధం చేసుకున్నా. అప్పుడే అత్యుత్తమ స్కేట్‌బోర్డింగ్‌ క్రీడాకారులకు స్పాన్సర్‌షిప్‌ అందించే ఓ పెద్ద కంపెనీ నన్నూ స్పాన్సర్‌ చేయడానికి ఒప్పుకుంది. అలా ఆ తర్వాత నా దశ తిరిగిపోయింది.

ఎన్నిసార్లు ఎముకలు విరిగాయో?!

నాకు చిన్నతనం నుంచి సాహసాలు చేయడమంటే ఇష్టం. స్కేట్‌ బోర్డింగ్‌ ఎంచుకోవడానికి అదీ ఓ కారణమే! అయితే ఈ క్రీడలో భాగంగా మెట్లు, వంపులు తిరిగిన ఆటస్థలాలు.. వంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో విభిన్న స్టంట్స్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా, శరీర బ్యాలన్స్‌ అదుపు తప్పినా ప్రమాదాల బారిన పడడం ఖాయం. అలా నా కెరీర్‌లో నాకు ఎన్ని గాయాలయ్యాయో, ఎన్నిసార్లు దెబ్బలు తగిలి ఎముకలు విరిగాయో లెక్కే లేదు. 2014లో ఓ పోటీలో భాగంగా రెండో స్థానం నుంచి మొదటి స్థానాన్ని పొందడం కోసం నేను చేసిన ఫీట్‌ నాకు మరో గాయాన్ని మిగిల్చింది. అయితే ఇలా ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా ‘ఇక ఈ స్కేట్‌బోర్డింగ్‌ నా వల్ల కాదు.. ఇకపై ఈ ఆటలో నేను కొనసాగలేను..’ అనిపించిన క్షణం నా కెరీర్‌లో ఒక్కటీ లేదు. ఎందుకంటే ఈ ఆటను నేను అంతగా ఆరాధించాను మరి!


మరో గిన్నిస్‌ రికార్డు!

⚛ నా 14వ ఏట మొదటిసారి ‘X గేమ్స్‌’లో పాల్గొని ఎనిమిదో స్థానంలో నిలిచిన నేను.. ఈ పదిహేనేళ్ల నా స్కేట్‌బోర్డింగ్‌ కెరీర్‌లో ఆరుసార్లు ‘X గేమ్స్‌’ ఛాంపియన్‌గా అవతరించా. ఇక సమ్మర్‌ ‘X గేమ్స్‌’లో 12 పతకాలు అందుకున్న నేను.. ఈ పోటీలో అత్యధిక పతకాలు అందుకున్న క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించా. గిన్నిస్‌ ప్రపంచ రికార్డునూ సొంతం చేసుకున్నా.

⚛ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన నేను.. ‘మహిళల స్ట్రీట్‌ స్కేట్‌బోర్డింగ్‌’ విభాగంలో 2010-13 వరకు వరుసగా నాలుగుసార్లు మొదటి ర్యాంక్‌లో కొనసాగాను.

⚛ 2018లో ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘అంతర్జాతీయ క్రీడల్లో అత్యంత శక్తిమంతమైన మహిళ’ల జాబితాలో నాకు చోటు దక్కింది.

⚛ స్కేట్‌ బోర్డింగ్‌ ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలు సాధించినందుకు గాను 2017లో తొలిసారి నాకు గిన్నిస్‌ రికార్డు దక్కింది. ఇక తాజాగా.. మరోసారి ప్రపంచ రికార్డు నమోదు చేయడం సంతోషంగా అనిపిస్తోంది. ప్రతిసారీ స్కేట్‌బోర్డింగ్‌ స్టంట్స్‌ విషయంలో కొత్తగా ఆలోచించే నేను.. ఈసారి విమానం నుంచి స్టంట్‌ చేయాలనుకున్నా. ఈ క్రమంలోనే భూమి నుంచి సుమారు 9,022 అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానం వెనుక వైపు ఉన్న స్కేట్‌బోర్డ్ గ్రైండ్ నుంచి స్కేట్‌బోర్డింగ్‌ చేస్తూ కిందికి దూకినందుకు మరోసారి గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కా. ఇలా విమానం నుంచి స్టంట్స్‌ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఏ విషయంలోనైనా సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ముందు ప్రయత్నించడం నాకు అలవాటు. తాజా ఫీట్‌లోనూ దీన్నే పునరావృతం చేశా.

ట్యాటూ-ట్యాటూకో అర్థం!

ఇక ఆట గురించి కాసేపు పక్కన పెడితే.. వ్యక్తిగతంగా నాకు ట్యాటూలంటే చాలా ఇష్టం. అందుకే నా శరీరంపై చాలా చోట్ల పచ్చబొట్టు పొడిపించుకున్నా. ఏదో ఫ్యాషన్‌ కోసం కాదు.. నేను వేయించుకునే ప్రతి ట్యాటూకూ ఓ అర్థం, పరమార్థం ఉంటుంది. ఈ క్రమంలోనే.. నేను పుట్టిన తేదీ ‘ఏప్రిల్‌ 13’, ‘విమానం బొమ్మ’ (విమాన ప్రయాణాలపై నాకున్న మక్కువకు గుర్తుగా), ‘స్కేట్‌బోర్డ్‌ను మోస్తున్న పక్షి’ (మా నాన్న నా కలల్ని ప్రోత్సహించినందుకు గుర్తుగా).. వంటి ట్యాటూలు నా శరీరంపై అక్కడక్కడా వేయించుకున్నా. ఇక నా వేళ్ల మీద ఉన్న ‘HOPE’ ట్యాటూ నాలోని పాజిటివిటీకి, నా కుడిచేతిపై రాయించుకున్న ‘TROUBLE’ ట్యాటూ.. నా సాహసాలకు ప్రతీకగా నిలుస్తుంటాయి. ఇక నా క్రీడ నాకు ప్రపంచవ్యాప్తంగానే కాదు.. సోషల్‌ మీడియాలోనూ ఎంతోమంది అభిమానుల్ని అందించింది. ప్రస్తుతం నాకు ఇన్‌స్టాలో 4.2 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఓ సెలబ్రిటీగా కంటే ఓ ఫ్రెండ్‌గా వారందరితో మాట్లాడడానికి ఇష్టపడతా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్