మాదీ.. ‘హలో బ్రదర్’ సినిమా స్టోరీనే..!

వివిధ కారణాల వల్ల పుట్టగానే విడిపోయిన తోబుట్టువులు తిరిగి పెద్దయ్యాక కలవడం.. వంటి సందర్భాలు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే సోషల్‌ మీడియా పుణ్యమా అని నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల జార్జియాలో జరిగిన సంఘటన కూడా ఈ కోవలోకే వస్తుంది.

Updated : 06 Jul 2024 22:01 IST

(Photos: Facebook)

వివిధ కారణాల వల్ల పుట్టగానే విడిపోయిన తోబుట్టువులు తిరిగి పెద్దయ్యాక కలవడం.. వంటి సందర్భాలు సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే సోషల్‌ మీడియా పుణ్యమా అని నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల జార్జియాలో జరిగిన సంఘటన కూడా ఈ కోవలోకే వస్తుంది. జార్జియాకు చెందిన ఇద్దరమ్మాయిలు టిక్‌టాక్‌లో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కొంతకాలానికే వారిద్దరి మధ్య ఏదో బంధం ఉండి ఉంటుందని భావించారు. ఇద్దరూ డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోవడంతో వారు కేవలం అక్కచెల్లెళ్లు మాత్రమే కాదు.. కవలలు అని తేలింది. మరి, ఆ అమ్మాయిలెవరు? వారి కథేంటి.. తెలుసుకుందామా...

ఆ కామెంట్‌తో...

జార్జియాకు చెందిన ఎలీన్ (19) డిగ్రీ చదువుతోంది. అందరిలాగే తను కూడా టిక్‌టాక్‌లో చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలో పలు రకాల వీడియోలు చేసి అందులో పోస్ట్‌ చేస్తుంటుంది. అయితే ఓ రోజు ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి అనూహ్యంగా ‘నువ్వు ఈ రోజు క్లినిక్‌లో ఏం చేస్తున్నావు’ అనే కామెంట్‌ వచ్చింది. ఆ రోజు ఆమె ఇంట్లోనే ఉండడంతో ఎవరో తనను ఆట పట్టిస్తున్నారనుకుంది. అదే సమయంలో ఆ వ్యక్తి అనా (19) ఖాతాను ట్యాగ్‌ చేశాడు. ఎలీన్ అనా ఖాతా తెరిచి చూసింది. ఆమె అచ్చం తనలాగే ఉండడంతో ఎలీన్‌ ఆశ్చర్యపోయింది. దాంతో వెంటనే ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టింది. అనా కూడా యాక్సెప్ట్‌ చేసింది. అలా వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. వారిద్దరూ ఆన్‌లైన్‌లో రెండేళ్ల పాటు మాట్లాడుకున్నారు.

అలా అనుమానం వచ్చింది..!

అనా, ఎలీన్‌లు తాము ఒకేవిధంగా ఉన్నామని వారి తల్లిదండ్రులతోనూ పంచుకున్నారు. దానికి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఒకరి తల్లిదండ్రులతో మరొకరు ఆన్‌లైన్‌లోనే మాట్లాడుకునేవారు. రెండేళ్లలోనే వారి స్నేహ బంధం బలంగా మారింది. ఈ క్రమంలో వాళ్ల ఆలోచనలు కూడా ఒకేవిధంగా ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందేమోనని అనుకున్నారు. అందుకు అసలు విషయం వారి తల్లిదండ్రులనే అడగాలని భావించారు.

మొదటగా ఎలీన్‌ తన తల్లిని ‘అమ్మా.. నేను కడుపులో ఉన్నప్పుడు దిగిన ఒక్క ఫొటో కూడా ఇంట్లో లేదు.. నిజంగా నేను నీకే జన్మించానా?’ అని అడిగింది. దాంతో ఎలీన్‌ తల్లి ‘నాకు పెళ్లైన తర్వాత గర్భధారణ అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పారు. దాంతో దత్తత తీసుకోవాలని అనుకుని అనాథ శరణాలయానికి వెళ్తే వెయిటింగ్‌ లిస్ట్‌ ఎక్కువగా ఉంది. అప్పుడు ఒక మధ్యవర్తి ద్వారా కొంత మొత్తానికి నిన్ను దత్తత తీసుకున్నాను’ అని చెప్పడంతో ఆమెకు అసలు విషయం అర్థమైంది. అంతకుముందు రెండు వారాల క్రితమే అనా కూడా తన తల్లిదండ్రులకు ఆమె దత్తపుత్రిక అని తేలడంతో వారి అనుమానం మరింత బలపడింది. దాంతో అప్పటివరకు ఆన్‌లైన్‌లోనే మాట్లాడుకున్నవారు మొదటిసారి కలవాలని నిశ్చయించుకున్నారు.

ఆ ఒక్కటి తప్ప.. అన్నీ సేమ్ టు సేమ్..!

19 ఏళ్ల వయసులో అనా, ఎలీన్‌ మొదటిసారి కలుసుకున్నారు. ఒకరి ముఖం మరొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి ముఖాన్ని అద్దంలో చూసుకున్న భావన కలిగిందట. అసలు విషయం తెలుసుకుందామని డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించుకున్నారు. రిపోర్ట్‌లో వారు కేవలం అక్కచెల్లెళ్లు మాత్రమే కాదు.. కవలలు అని తేలింది. దాంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ తర్వాత వారికి మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

కేవలం ఇద్దరి మొహాలే కాకుండా.. ‘హలో బ్రదర్‌’ చిత్రంలో లాగా ఇద్దరికీ చాలా పోలికలున్నాయి. ఇద్దరి మొహాలపై ఒకే ప్రాంతంలో పుట్టు మచ్చలున్నాయట. అలాగే ఇద్దరికీ ఒకేసారి జ్వరం వస్తుందట. కొన్ని సమస్యలూ ఒకేసారి వస్తుంటాయట. తమ ఆలోచనా విధానాలు కూడా ఒక్కటే అంటున్నారు ఈ అమ్మాయిలు. ఇలా వారిద్దరిలో ఎన్నో సారూప్యతలున్నాయి. ఇక అనా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. వీరి మధ్య ఉన్న తేడా ఇదొక్కటే కావడం గమనార్హం! ఈ క్రమంలో అక్కచెల్లెళ్లుగా ఇప్పటివరకు కోల్పోయిన జీవితాన్ని ఇప్పటినుంచైనా కలిసి ఆస్వాదించాలనుకుంటున్నామని చెబుతున్నారు ఈ కవలలు.

ఆ ఆలోచన లేదు..

ఈ అక్కచెల్లెళ్లు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాత తమ కన్న తల్లిదండ్రుల గురించి కూడా తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయితే వారికి సరైన సమాచారం లభించలేదట. అయితే తమను పెంచిన తల్లిదండ్రులకు మాత్రం ఎవరూ సాటి రారంటున్నారు ఈ అమ్మాయిలు.

ఈ సందర్భంగా ఎలీన్‌ మాట్లాడుతూ ‘నన్ను పెంచిన తల్లిదండ్రులు నాకు ఏ విషయంలోనూ లోటు చేయలేదు. నేను మంచి స్కూల్లో చదివాను. ప్రతి విషయంలోనూ నా పేరెంట్స్ అండగా ఉన్నారు. అసలు నేను దత్తపుత్రికగా పెరిగానన్న భావన ఎప్పుడూ కలగలేదు. అనా కూడా ఆమె తల్లిదండ్రుల దగ్గర దాదాపు ఇలానే పెరిగానని చెప్పింది. ‘మేమిద్దరం అదృష్టవంతురాళ్లమనే చెప్పాలి. మాకు మంచి తల్లిదండ్రులున్నారు. వారిని విడిచిపెట్టే ఆలోచనే లేదు. ఇప్పటినుంచి అందరం కలిసి సంతోషంగా ఉంటాం’ అని చెప్పుకొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్