Mama Uganda: ఆమె వయసు 42 ఏళ్లు.. పిల్లలేమో 44 మంది!

ఈరోజుల్లో ఒకరిద్దరు పిల్లల్ని సాకడానికే ఆపసోపాలు పడుతున్నారు తల్లిదండ్రులు. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఒక్కరితో సరిపెట్టుకునే వారు కొందరైతే.. కెరీర్‌, ఇతర బాధ్యతల రీత్యా తమ సంతానానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు మరికొందరు. ఇలాంటి వారు ఉగాండాకు చెందిన మరియం....

Updated : 11 Apr 2023 21:03 IST

(Photo: Twitter)

ఈరోజుల్లో ఒకరిద్దరు పిల్లల్ని సాకడానికే ఆపసోపాలు పడుతున్నారు తల్లిదండ్రులు. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఒక్కరితో సరిపెట్టుకునే వారు కొందరైతే.. కెరీర్‌, ఇతర బాధ్యతల రీత్యా తమ సంతానానికి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు మరికొందరు. ఇలాంటి వారు ఉగాండాకు చెందిన మరియం నబాటంజీ అనే మహిళ గురించి తెలుసుకోవాల్సిందే! ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. 38 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆమె.. ‘ప్రపంచంలోనే అత్యధిక సంతానోత్పత్తి శక్తి ఉన్న మహిళ’గా పేరుగాంచింది. అయితే వీరిలో ఆరుగురు చనిపోగా.. ప్రస్తుతం 38 మంది చిన్నారుల ఆలనా పాలనా చూసుకుంటోందామె. భర్త వదిలేసినా ఒంటరి తల్లిగానే వీళ్ల బాధ్యతలు నిర్వర్తిస్తోన్న మరియంకు ప్రస్తుతం ౪౨ ఏళ్లు.. అసలు ఇంత చిన్న వయసులోనే అంతమంది పిల్లలకు ఎలా జన్మినచ్చింది? వాళ్లందరినీ ఎలా పోషిస్తోంది? తెలుసుకోవాలంటే ఆమె కథ చదవాల్సిందే!

మరియం నబాటంజీ తల్లి మరియం చిన్నతనంలోనే మరణించింది. తండ్రికి మరో నలుగురు భార్యలుండేవారు. వారి వద్దే మరియం, ఆమె తోబుట్టువులు పెరిగారు. అయితే ఆమెకు పదకొండేళ్ల వయసులో ఆహారంలో మెత్తగా చేసిన గాజు ముక్కలు కలిపి పెట్టింది ఆమె సవతి తల్లి.. దాన్ని తిన్న ఆమె తోబుట్టువులంతా మరణించారు. ఆ సమయానికి బయట ఉండడంతో బతికి బట్టకట్టింది మరియం.

పచ్చి తాగుబోతు!

అయితే అంతకంటే పెద్ద నరకం తనకోసం వేచి చూస్తోందని ఆమె అప్పుడు ఊహించలేకపోయింది. డబ్బుకి ఆశపడి పన్నెండేళ్లకే ఆమెను నలభై సంవత్సరాల ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు మరియం తండ్రి. ఆ వయసులో తనకు పెళ్లైందన్న విషయం కూడా అర్థం కాలేదంటోందామె.

‘కొంతమంది పెద్దవాళ్లు రకరకాల బహుమతులతో మా ఇంటికి వచ్చారు. మా నాన్నకు ఆ బహుమతులతో పాటు కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నన్ను వాళ్లింటికి వెళ్లమన్నప్పుడు మా అత్తయ్యకు తోడుగా వెళ్తున్నానేమో అనుకున్నా.. కానీ అక్కడికి వెళ్లాక తెలిసింది పెళ్లి ఆమెది కాదు.. నాదే అని.. అయినా మా అత్తయ్య ఎప్పుడూ చెప్పేది.. వివాహబంధం ఈ లోకంలోనే గొప్పది. దానికి గౌరవం ఇవ్వాలని..! ఆమె మాటలను గౌరవిస్తూ అక్కడే ఉండిపోయా. నా భర్త పచ్చి తాగుబోతు. ఆయన మాటకు ఎదురు చెప్పడం కాదు.. చెప్పిన పని నిమిషం ఆలస్యంగా చేసినా గొడ్డును బాదినట్లు బాదుతాడు. అప్పటికే ఆయనకు ఎన్నో పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. నా పన్నెండేళ్ల వయసులో వాళ్లందరి తల్లులు పనికోసం వెళ్తే వారిని చూసే బాధ్యత నాపై పడింది. అయినా అన్నీ భరించా..’ అంటూ తన వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చింది మరియం.

ఆ జన్యు లక్షణమే కారణమా?

వరుసగా గర్భం దాల్చుతూ.. 38 ఏళ్ల వయసు వచ్చేసరికి మొత్తంగా 44 మందికి జన్మనిచ్చిన మరియం.. ‘ప్రపంచంలోనే అత్యధిక సంతానోత్పత్తి శక్తి ఉన్న మహిళ’గా పేరు పొందింది. ఈ క్రమంలో నాలుగుసార్లు కవలలు, అయిదు సార్లు ముగ్గురేసి పిల్లలు, మరో అయిదుసార్లు నలుగురేసి పిల్లలు పుట్టారు. ఇలా ఇన్నేళ్ల తన మాతృత్వ ప్రయాణంలో ఒకేఒక్కసారి మాత్రం ఒక్క బిడ్డకు జన్మనిచ్చిందామె. అయితే తాను ఇంత చిన్న వయసులో అంతమంది పిల్లలకు జన్మనివ్వడానికి తనకున్న అరుదైన జన్యు లక్షణమే కారణమంటున్నారు వైద్య నిపుణులు.

 ‘సాధారణంగా స్త్రీలలో నెలకొక అండం చొప్పున విడుదలవుతుంది. కానీ మరియం కున్న ఈ జన్యు లక్షణం కారణంగా నెలనెలా బహుళ సంఖ్యలో అండాలు (Hyper Ovulation) ఉత్పత్తవుతాయి. దాంతో ఎక్కువమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది’.. అంటున్నారు నిపుణులు. అయితే పిల్లలు కలగకుండా మరియం గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలనుకున్నా.. వాటి వల్ల లేనిపోని అనారోగ్యాలు తప్పవని హెచ్చరించారట వైద్యులు. ఇక ఆఖరికి గర్భ సంచిని లోపలివైపు కట్‌ చేయడంతో మరింతమంది పిల్లలు పుట్టకుండా ఆపగలిగారు..’ అంటుంది మరియం. ఇలా ఎక్కువమంది పిల్లల్ని కన్న మరియం.. ‘మదర్‌ ఉగాండా’గానూ పేరుగాంచింది.

ఒంటరి తల్లిగానే..!

మరియం జన్మనిచ్చిన 44 మంది పిల్లల్లో.. వివిధ కారణాల రీత్యా ఆరుగురు చనిపోగా.. ప్రస్తుతం 38 మంది పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో 20 మంది అబ్బాయిలు, 18 మంది అమ్మాయిలున్నారు. ప్రస్తుతం మొదటి సంతానానికి 28 ఏళ్లు కాగా, ఆఖరి సంతానం వయసు ఆరేళ్లు. అయితే కొన్నేళ్ల క్రితమే భర్త ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో ఈ 38 మంది పిల్లల పాలన, పోషణ అంతా మరియం పైనే పడింది. అయినా ధైర్యం కోల్పోలేదామె. సిమెంట్‌ ఇటుకలు, ఐరన్‌ పైకప్పుతో నాలుగు చిన్న చిన్న ఇళ్లు నిర్మించుకొని.. అందులోనే తన పిల్లల్ని సాకుతోందామె. ఈ క్రమంలో ఇల్లు గడవడానికి రాత్రింబవళ్లు కష్టపడుతోంది. హెయిర్‌ డ్రస్సర్‌గా, ఈవెంట్‌ డెకరేటర్‌గా పనిచేయడంతో పాటు తుక్కు సామగ్రిని సేకరించి అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. మరియంకు మూలికా వైద్యం పైనా అవగాహన ఉంది. కాబట్టి ఆయా మూలికలతో ఔషధాలు తయారుచేస్తూ.. మరికొంత డబ్బూ ఆర్జిస్తోందామె.

‘నా సంపాదనలో చాలావరకు నా పిల్లలకు ఆహారం, వైద్య ఖర్చులు, దుస్తులు, స్కూల్‌ ఫీజులకే సరిపోతుంది. అలాగే ఇక్కడి పలు సంస్థల నుంచి నాకు నిధులు, విరాళాల రూపంలో కొంత మొత్తం అందుతుంది. వీటితో నా పిల్లలకు మంచి విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా పిల్లలందరూ ఒక్కొక్కరుగా డిగ్రీ పూర్తి చేసుకుంటుంటే చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తోంది..’ అంటూ మురిసిపోతోన్న మరియం.. ఇక వారాంతాల్లో తన పిల్లలు తనకు అన్ని పనుల్లో సహకరిస్తారని.. ఇలా అందరం కలిసి ఆడుతూ పాడుతూ పనిచేసే ఈ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోనంటోందామె. ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న మరియం పిల్లల్లో కొంతమందికి పెళ్లై.. వాళ్లకు పిల్లలు కూడా పుట్టారు. ఇక ఇటీవలే నాన్నమ్మగా మరో మనవడి బాధ్యతను అందుకుందీ సూపర్‌ మామ్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని