చిన్నప్పట్నుంచే మధుమేహం.. అయినా పరుగు ఆపలేదు!
ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా బెంబేలెత్తిపోతాం.. నలుగురికీ తెలిస్తే ఏమనుకుంటారోనని అభద్రతా భావానికి లోనవుతాం.. వీటికి తోడు సమస్య తగ్గుతుందో, లేదోనన్న అనుమానమే మనల్ని మరింతగా కుంగదీస్తుంటుంది. కానీ పుణేకు చెందిన నుపుర్ లల్వానీ మాత్రం....
(Photos: Instagram)
ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా బెంబేలెత్తిపోతాం.. నలుగురికీ తెలిస్తే ఏమనుకుంటారోనని అభద్రతా భావానికి లోనవుతాం.. వీటికి తోడు సమస్య తగ్గుతుందో, లేదోనన్న అనుమానమే మనల్ని మరింతగా కుంగదీస్తుంటుంది. కానీ పుణేకు చెందిన నుపుర్ లల్వానీ మాత్రం ఇందుకు భిన్నం. అసలు ఆరోగ్య సమస్యంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకోలేని పిన్న వయసులోనే టైప్-1 మధుమేహం బారిన పడిందామె. తన అనారోగ్యానికి తోడు సమాజం నుంచీ పలు ఒత్తిళ్లు ఎదుర్కొంది. అయినా ఇవన్నీ దాటుకొని మారథాన్ రన్నర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి తనలాంటి వ్యాధిగ్రస్తుల్లో సమస్య పట్ల అవగాహన పెంచుతోంది. వారిలో స్ఫూర్తి నింపుతోంది. ‘ఆత్మవిశ్వాసం, తపన ఉంటే.. జీవితంలోని ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా అధిగమించచ్చు..’ అని నిరూపిస్తోన్న నుపుర్ డయాబెటిస్ జర్నీ ఈ సమస్యతో బాధపడుతోన్న ఎంతోమందికి ఆదర్శం!
నుపుర్ లల్వానీ పుణేలో పుట్టి పెరిగింది. చిన్న వయసు నుంచే ఆమెకు ఆటలంటే చాలా ఇష్టం. ఈ మక్కువతోనే స్కూల్లో ఉన్నప్పుడు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. అయితే బాల్యంలో ఎంతో చురుగ్గా ఉండాల్సిన ఆమె.. కొన్ని సందర్భాల్లో విపరీతంగా నీరసించిపోయేది. దీనికి తోడు కాలం/వాతావరణంతో సంబంధం లేకుండా దాహం వేయడం, చికాకు.. వంటివి ఆమెను వేధించేవి.
8 ఏళ్ల వయసులోనే..!
అప్పుడు నుపుర్ వయసు 8 ఏళ్లు.. సరిగ్గా మూడో తరగతి వార్షిక పరీక్షలకు కొన్ని రోజుల ముందు నుంచే తనలో ఈ లక్షణాలు కనిపించాయి. దీంతో ఇంత చిన్న వయసులోనే ఈ లక్షణాలేంటని నుపుర్‌ను ఆమె తల్లి ఓ రోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్షలన్నీ పూర్తయ్యాక వాళ్లకు ఓ చేదు నిజం తెలిసింది. అదేంటంటే.. నుపుర్‌కు టైప్-1 మధుమేహం ఉందని!
నిజానికి అదంటే ఏంటో కూడా అర్థం చేసుకునే వయసు కాదు నుపుర్‌ది. మరోవైపు ‘ఈ వ్యాధితో దీర్ఘకాలం పాటు నా కూతురు పోరాడాల్సిందేనా?! ఈ సమాజంలో తను ఎలా మనగలుగుతుందో..’ అని ఆమె తల్లిదండ్రులు టెన్షన్ పడిపోయారు. ఇక అప్పట్నుంచి ఆమెను మరింత జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. స్కూలుకెళ్లినా, పరీక్షలు రాసినా, ఈత నేర్చుకోవడానికెళ్లినా.. ఆమె తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఆమె వెంట ఉండేవారు. నిరంతరం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునేలా ఆమెను ప్రోత్సహించేవారు.
ప్రత్యేకంగా ఉండాలనుకోలేదు!
అయితే పేరెంట్స్ తనపై చూపించే ఈ అతి జాగ్రత్త నుపుర్‌కు నచ్చలేదు. అందుకే తనకు సమస్యేమీ లేనట్లుగా అందరు పిల్లల్లో కలిసిపోయినట్లుగా ఉండాలనుకుందామె. అంతేకాదు.. పెద్దయ్యాక మధుమేహ సమస్య గురించి సమాజంలో నెలకొన్న అపోహల్ని దూరం చేయాలనుకుంది.. ఈ సమస్యతో బాధపడే వారు తమ ఆరోగ్య పరిస్థితి గురించి బహిరంగంగా మాట్లాడేలా వాళ్లను ప్రోత్సహించాలనుకుంది నుపుర్. ఈ ఆలోచనతోనే కొన్నేళ్ల క్రితం ‘బ్లూ సర్కిల్ డయాబెటిస్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిందామె. మధుమేహం (టైప్-1, టైప్-2) పై అవగాహన కల్పించడమే దీని ముఖ్యోద్దేశం.
ఈ క్రమంలో ఈ సమస్యపై సమాజంలో ఉన్న అపోహల్ని తొలగిస్తూనే.. ఎంతోమంది మధుమేహులు ఈ వేదికగా తమ ఆరోగ్య పరిస్థితుల్ని, చికిత్సలు, వాళ్లు పాటిస్తోన్న చిట్కాల్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా పంచుకునేలా వాళ్లను ప్రోత్సహిస్తోంది నుపుర్. అంతేకాదు.. తన ఎన్జీవో టీమ్‌లోనూ మధుమేహంతో బాధపడే వాళ్లనే సభ్యులుగా పెట్టుకుంది నుపుర్. ఇక ఈ వేదికగా.. తీసుకోవాల్సిన పోషకాహారం, మధుమేహులకు వరంగా పరిణమిస్తోన్న టెక్నాలజీనీ నిపుణుల సలహాలు, సూచనలతో అందరికీ చేరువ చేస్తోందీ పుణే అమ్మాయి.
మారథానర్‌గానూ గుర్తింపు..!
ఆతిథ్య రంగాన్నే కెరీర్‌గా ఎంచుకొని.. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తొలి ఉద్యోగం చేసిన ఆమె.. తన స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాక ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. అంతేకాదు.. మధుమేహులూ తాము అనుకున్నది సాధించగలరు అని నిరూపించడానికే తాను మారథానర్‌గా మారానంటోంది నుపుర్. ‘చిన్నప్పట్నుంచే నాకు ఆటలంటే ఇష్టం. మరోవైపు మా నాన్న మారథాన్ ఛాంపియన్. దాంతో ఆయన స్ఫూర్తితోనే నేనూ మారథాన్‌లలో పాల్గొనడం మొదలుపెట్టా. ఏ సాధన, శిక్షణ లేకుండానే తొలుత హాఫ్ మారథాన్ (21 కిలోమీటర్ల పరుగు)లో పాల్గొన్నా. ఇక అప్పట్నుంచి మధుమేహంపై అవగాహన కల్పించేందుకు దేశ విదేశాల్లో ఏర్పాటు చేసే మారథాన్, అల్ట్రా మారథాన్‌లలో పాల్గొంటున్నా.. ఈ క్రమంలో ఎంతోమంది టైప్-1 డయాబెటిస్ ఫ్రెండ్స్‌ని కలుసుకొని వాళ్ల డయాబెటిస్ జర్నీ గురించి తెలుసుకుంటున్నా. అందుకే మారథాన్లంటే నాకు ఓ ఫ్యామిలీ పిక్‌నిక్‌లా అనిపిస్తుంటుంది. ఇలా పరుగే కాదు.. ట్రెక్కింగ్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్.. వంటి క్రీడల్ని కూడా బాగా ఆస్వాదిస్తా. అయితే ఎక్కడికెళ్లినా గ్లూకోజ్ మాత్రలు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు, ఇన్సులిన్ పంప్స్‌ని వెంటే ఉంచుకుంటా..’ అంటోంది నుపుర్.
‘మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా మనల్ని ఎదగకుండా ఆపలేదు. అయితే అందుకు మనం చేయాల్సిందల్లా సమాజానికి భయపడి మనల్ని మనం నియంత్రించుకోకుండా ధైర్యంగా ముందడుగు వేయడమే!’ అంటోన్న నుపుర్.. మంచి రచయిత్రి కూడా! పలు పత్రికలకు మధుమేహానికి సంబంధించిన వ్యాసాలు కూడా రాస్తుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.