గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం.. ఎక్కడైనా స్టంట్స్‌ చేసేయగలదు!

మణిరత్నం ‘రావణ్‌’ సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్‌ 300 అడుగుల ఎత్తైన కొండ శిఖరం నుంచి లోయలోకి దూకే సీన్‌ చూస్తూ ఒక్క క్షణం రాయిలా మారిపోతాం. ఆమెకేమవుతుందోనని కన్నార్పకుండా సీన్‌లోనే లీనమవుతాం..మొన్నామధ్య విడుదలైన Gehraiyaan చిత్రంలోనూ హీరో.. అనన్యను ఒక్కసారిగా సముద్రంలోకి తోసేయడంతో ఆమె నీటిలో.....fin

Published : 18 Aug 2022 20:23 IST

(Photos: Instagram)

మణిరత్నం ‘రావణ్‌’ సినిమా గుర్తుందా? అందులో హీరోయిన్‌ 300 అడుగుల ఎత్తైన కొండ శిఖరం నుంచి లోయలోకి దూకే సీన్‌ చూస్తూ ఒక్క క్షణం రాయిలా మారిపోతాం. ఆమెకేమవుతుందోనని కన్నార్పకుండా సీన్‌లోనే లీనమవుతాం..

మొన్నామధ్య విడుదలైన Gehraiyaan చిత్రంలోనూ హీరో.. అనన్యను ఒక్కసారిగా సముద్రంలోకి తోసేయడంతో ఆమె నీటిలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవడం మనం మర్చిపోగలమా?

ఇవే కాదు.. గాజు కిటికీల్ని బద్దలుకొడుతూ కొన్ని అంతస్థుల పైనుంచి దూకే సీన్‌, అటు బైక్‌పై చేసే డేర్‌డెవిల్‌ విన్యాసాలు, మంటల్లోంచి దూసుకొచ్చే గగుర్పొడిచే సన్నివేశాలు, సముద్ర గర్భంలో చేసే ఫైట్‌ సీక్వెన్స్‌లు.. ఇలా హీరోలే కాదు.. హీరోయిన్లూ చేసే ప్రమాదకరమైన స్టంట్స్‌ని మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం. మరి, ఇలాంటి యాక్షన్‌ ఫీట్స్‌ చేయడానికి స్టంట్‌ మ్యాన్ ఉంటారన్న విషయం తెలిసిందే..  మరి 'స్టంట్ ఉమన్’ సంగతో..? అందుకు సమాధానమే సనోబర్‌ పర్దివల్లా.

దేశంలోనే ‘తొలి స్టంట్‌ ఉమన్‌’గా పేరు తెచ్చుకున్న ఆమె.. గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం.. ఇలా పంచభూతాల సాక్షిగా ఎక్కడైనా, ఎంత కఠినమైన స్టంట్‌ అయినా అలవోకగా చేసేయగలదు. అందుకే హీరోయిన్ల కోసం స్టంట్‌ డబుల్‌ కావాల్సి వస్తే.. అందరి కళ్లూ సనోబర్‌నే వెతుకుతాయి. మరి, పురుషాధిపత్యం ఉన్న ఈ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్న ఈ స్టంట్‌ క్వీన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

ముంబయిలో పుట్టి పెరిగింది సనోబర్‌ పర్దివల్లా. ఆమెకు సాహసాలు, విన్యాసాలు చేయడమంటే చిన్న వయసు నుంచే ఇష్టం. పైగా ధైర్యశాలి కూడా! ఈ క్రమంలో సినిమాల్లో వచ్చే స్టంట్‌ సీన్స్‌ని బాగా ఆస్వాదించేది. మరోవైపు పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే కరాటేలో బ్లాక్‌ బెల్టు, జిమ్నాస్టిక్స్‌, ఈతలో పూర్తి నైపుణ్యాలు సంపాదించింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు.. స్థిరపడితే ఇలాంటి సాహసోపేతమైన రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది సనోబర్.

12వ ఏట తొలి అవకాశం!

తన పట్టుదలకు కృషి కూడా తోడవడంతో పాఠశాల విద్య పూర్తికాకముందే సనోబర్‌ తొలి అవకాశాన్ని అందుకుంది. అప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు. ఐశ్వర్యారాయ్‌కి స్టంట్‌ డబుల్‌/స్టంట్‌ ఉమన్‌గా ఓ యాడ్‌ షూట్‌లో మొదటిసారి పాల్గొందీ ముంబయి అమ్మాయి. అందులో ఆమె ప్రతిభ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. తొలి టేక్‌లోనే ఆమె చేసే స్టంట్స్‌ చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దాంతో ఆమె స్టంట్‌ నైపుణ్యాలు ఆ నోటా, ఈ నోటా పాకి ఎంతోమంది ప్రముఖ దర్శకనిర్మాతల్ని చేరాయి. ఇక అప్పట్నుంచి సనోబర్‌కి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 2003లో ఊర్మిళ నటించిన ‘భూత్‌’ సినిమాతో మొదలైన ఆమె స్టంట్‌ ప్రయాణం.. ఇటీవలే విడుదలైన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ వరకూ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

నైపుణ్యాలే ఆయుధాలుగా!

తన 20 ఏళ్ల స్టంట్‌ కెరీర్‌లో సుమారు 200 సినిమాల్లో హీరోయిన్లకు స్టంట్‌ డబుల్‌గా వ్యవహరించింది సనోబర్‌. ధూమ్‌ (ఈషా డియోల్‌ ఫైర్‌ స్టంట్‌), ధూమ్‌-2 (ఐశ్వర్యారాయ్‌), రావణ్‌ (ఐశ్వర్యారాయ్‌), కహానీ, కహానీ-2 (విద్యాబాలన్‌), గూండే (ప్రియాంక చోప్రా), బాజీరావ్‌ మస్తానీ (దీపికా పదుకొణె), సుల్తాన్‌ (అనుష్కా శర్మ), ఆత్రంగి రే (సారా అలీ ఖాన్), గెహ్రాయియాన్ (అనన్యా పాండే), షంషేరా (వాణీ కపూర్‌), లాల్‌ సింగ్‌ చడ్డా (కరీనా కపూర్‌).. ఇలా ఎన్నో హిట్‌ చిత్రాల్లో అగ్ర కథానాయికలకు స్టంట్‌ డబుల్‌గా పనిచేసి.. కెమెరా వెనుక స్టంట్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది సనోబర్‌. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ఆరితేరిన ఆమెకు.. రైఫిల్‌, పిస్టల్‌, షార్ప్‌ షూటింగ్‌, కత్తిసాము, విప్‌ చైన్‌ (మార్షల్‌ ఆర్ట్స్‌లో ఉపయోగించే ఆయుధం), సామురాయ్‌ (ఇదొక రకమైన కత్తి).. వంటి ఆయుధాల్ని ఉపయోగించడంలో తిరుగులేదని చెప్పచ్చు. ఈ నైపుణ్యాలే తనను కార్‌/బైక్‌ స్టంట్స్‌, కేబుల్‌ స్టంట్స్‌, ఫైర్‌ స్టంట్స్‌, సముద్ర గర్భంలో చేసే విన్యాసాలు.. ఇలా ఎక్కడైనా, ఎంత కఠినమైన యాక్షన్‌ సీన్‌ అయినా అలవోకగా చేసేందుకు ప్రేరేపిస్తున్నాయంటోందీ స్టంట్‌ క్వీన్.

భయపడను.. ఆస్వాదిస్తా..!

సినిమాల్లో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్‌ చూసి మనమైతే భయపడతామేమో గానీ.. తాను మాత్రం ఎంతో ఎంజాయ్‌ చేస్తూ, అలుపు లేకుండా స్టంట్స్‌ చేస్తానంటోంది సనోబర్. ‘సన్నివేశానికి తగినట్లుగా విన్యాసాలు చేయడమంటే అంత సులభం కాదు. ఇందుకు నిరంతరం కఠినమైన పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవాలి. ఇందుకోసం వ్యాయామాలు చేయాలి. అలసట రాకుండా చక్కటి పోషకాహారం తీసుకోవాలి. ఒక్కోసారి స్టంట్స్‌ చేసేటప్పుడు మధ్యలో అనూహ్య పరిస్థితులు ఎదురుకావచ్చు. ఓసారి అలాగే జరిగింది. రావణ్‌ చిత్రీకరణ సమయంలో ఓ సన్నివేశంలో భాగంగా 150 అడుగుల ఎత్తైన కొండ శిఖరం నుంచి కేబుల్స్‌ సహాయంతో నీటిలోకి దూకాల్సి ఉంది. 75 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఒక కేబుల్‌ కట్‌ అయిపోయింది. దీంతో తిరిగి సెట్‌ చేసేందుకు అరగంట సమయం పట్టింది. ఓవైపు ఎత్తైన జలపాతం, కింద నీళ్లు, చుట్టూ లోయలు.. తలచుకుంటేనే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. కానీ నేను మాత్రం అస్సలు భయపడలేదు. పైగా ఆ అరగంట సమయం చుట్టూ ప్రకృతి అందాల్ని ఎంజాయ్‌ చేశా. ఒత్తిడిని అధిగమించడానికి కాసేపు ధ్యానం కూడా చేశాననుకోండి.. ఇదనే కాదు.. భయపడితే ఎందులోనూ రాణించలేం..’ అంటూ తనకెదురైన ఓ అనుభవాన్ని పంచుకుందీ స్టంట్‌ రారాణి.

‘స్టంట్‌మ్యాన్‌’ అని పిలిచేవారు!

పురుషాధిపత్యం ఉన్న ఏ రంగంలో మహిళ రాణించాలన్నా అది సవాలుతో కూడుకున్నదే! అపార నైపుణ్యాలు, ప్రతిభ ఉన్నా.. సనోబర్‌కూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి, తన ఉనికిని చాటుకోవడానికి పలు సవాళ్లు ఎదురయ్యాయట! ‘నేను స్టంట్‌ డబుల్‌గా చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు అసలు స్టంట్‌ ఉమన్‌ అనే కాన్సెప్టే లేదు. సన్నివేశానికి తగినట్లుగా యాక్షన్‌ సీక్వెన్స్‌లు, విన్యాసాలు చేయాలంటే పురుషులే (స్టంట్‌ మ్యాన్‌) ఉండే వారు. నేనొచ్చాక కూడా కొంతమంది అలవాటుగా ‘ఆ స్టంట్‌మ్యాన్‌ని పిలవండి..’ అనే వారు. కానీ వెంటనే నేను ‘స్టంట్‌మ్యాన్‌ కాదు.. స్టంట్‌ ఉమన్‌’ అని వాళ్ల మాటల్ని సరిచేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. స్టంట్‌ మ్యాన్‌, ఉమన్‌ అనే పదాలు పోయి.. ఈ విన్యాసాలు ఎవరు చేసినా ఇప్పుడు ‘స్టంట్‌ డబుల్’గా పరిగణిస్తున్నారు. నిజానికి ఈ మార్పు ఎంతోమంది మహిళల్ని ఈ రంగంలోకి వచ్చేలా ప్రేరేపిస్తుందని చెప్పచ్చు..’ అంటూ తన మనసులోని మాటల్ని ఓ సందర్భంలో పంచుకుంది సనోబర్.

మన కోసం మనం..!

తన స్టంట్‌ నైపుణ్యాలు, ప్రతిభకు గుర్తింపుగా రెండుసార్లు ‘జీవన సాఫల్య పురస్కారం’ అందుకున్న సనోబర్‌.. పలుమార్లు ప్రతిష్టాత్మక ‘తారస్‌ వరల్డ్‌ స్టంట్‌ అవార్డ్స్‌’కూ నామినేట్‌ అయింది. ‘వృత్తికి ఎంతటి ప్రాధాన్యమిస్తామో.. మన కోసం మనం కూడా అంతే ప్రాముఖ్యమివ్వాలి.. ఏ పనైనా శక్తికి మించి చేయాల్సి వచ్చినప్పుడు నిర్మొహమాటంగా నో చెప్పడమే ఉత్తమం..’ అంటోన్న ఈ స్టంట్‌ క్వీన్‌కు పారా గ్లైడింగ్‌, స్కై డైవింగ్‌లోనూ ప్రావీణ్యముంది. ప్రస్తుతం తన స్టంట్‌ కెరీర్‌తో పాటు ఎక్సర్‌సైజ్‌ ఫిజియాలజిస్ట్‌గా, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గానూ తనను తాను నిరూపించుకుంటోందామె. ‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌’లో న్యూట్రిషన్‌ కోర్సు చేసిన సనోబర్‌.. పోషకాహార నిపుణురాలిగానూ ఎంతోమంది సెలబ్రిటీలకు ఆరోగ్య పాఠాలు చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని