గాజు వ్యర్థాలు... అందమైన కళారూపాలు!

భూమిపై పెరిగిపోతోన్న వ్యర్థాల్లో... ప్లాస్టిక్కే కాదు... గాజు శాతమూ ఎక్కువే. పైగా ఇవి మట్టిలో కలవడానికీ వేల ఏళ్లు పడుతుందట. ఈ విషయమే నోయిడాకు చెందిన మాధురీ బాలోడీని ఆలోచింపచేసింది. దీంతో పెద్ద ఎత్తున పోగవుతోన్న ఈ సీసాలను సేకరించి... అప్‌సైక్లింగ్‌ ఆర్ట్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేస్తున్నారు.

Published : 14 Jun 2024 03:57 IST

భూమిపై పెరిగిపోతోన్న వ్యర్థాల్లో... ప్లాస్టిక్కే కాదు... గాజు శాతమూ ఎక్కువే. పైగా ఇవి మట్టిలో కలవడానికీ వేల ఏళ్లు పడుతుందట. ఈ విషయమే నోయిడాకు చెందిన మాధురీ బాలోడీని ఆలోచింపచేసింది. దీంతో పెద్ద ఎత్తున పోగవుతోన్న ఈ సీసాలను సేకరించి... అప్‌సైక్లింగ్‌ ఆర్ట్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేస్తున్నారు. వాటిని దేశవిదేశాలకు ఎగుమతి చేస్తూ ఆదాయం అందుకుంటున్నారు. మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మాధురి బాలోడీది నోయిడా. అక్కడే పుట్టిపెరిగారామె. స్కూలు, కాలేజీ రోజుల్లో తను సాధారణ విద్యార్థే అయినా...భవిష్యత్తుని వ్యాపార రంగంలో నిర్మించుకోవాలన్న తపనే తనని ఐఐఎమ్‌ బిజినెస్‌ స్కూల్లో పాఠాలు వినేలా చేశాయి అంటారామె. ‘మనదేశంలోనే ఏటా మూడు మిలియన్‌ టన్నుల గాజు వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిల్లో 40 శాతం మాత్రమే రీసైక్లింగ్‌ అవుతున్నాయి. మిగిలినవి వ్యర్థాలుగా మారిపోతున్నాయి. ఈ విషయం తెలిశాక... గాజుని పునర్వినియోగించే మార్గాలను వెతికా. ఇందుకోసం అప్పటికే మీడియా రంగంలో పనిచేస్తున్న నేను ఉద్యోగాన్నీ వదిలేశా’ అని చెబుతారు మాధురి. స్నేహితుడు అమిత్‌ సింగ్‌తో కలిసి 2012లో ‘కవి ద పొయెట్రీ ఆర్ట్‌ ప్రాజెక్ట్‌’ని ఆరంభించారు. కాస్త సృజన, అభిరుచి ఉండాలే కానీ, ఏ వస్తువునైనా అద్భుతమైన కళాఖండంగా మార్చేయొచ్చు. ఇందుకోసం చెత్త సేకరించే వ్యక్తులూ, డీలర్లను సంప్రదించారు.

బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, కేరళ వంటి అనేక రాష్ట్రాల నుంచి వీటిని సేకరిస్తున్నారు. ఆపై వాటిని శుభ్రం చేసి చూడముచ్చటైన ఆర్ట్‌పీస్‌లుగా, కిచెన్‌ ఐటెమ్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. వాటిల్లో ల్యాంప్‌లు, క్రాఫ్ట్‌ క్లాక్‌లు, వాల్‌ ఆర్ట్‌ బ్యాగులు, ప్లాంటర్లు వంటివెన్నో ఉన్నాయి. అంతేనా, 140 టన్నుల వ్యర్థాలను వినియోగ వస్తువులుగా మార్చినందుకు ‘లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించుకున్నారు. ఈ  ప్రొడక్ట్స్‌ని కస్టమైజ్డ్‌ గిఫ్ట్‌లుగా, కార్పొరేట్‌ కానుకలుగానూ అందిస్తున్నారు. టాటా, బాంబే సాఫైర్, ఫెర్నార్డ్‌ రిచర్డ్, డీఎల్‌ఎఫ్, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, టాటా, అమెజాన్, గ్రాండ్‌ హయత్‌ వంటి వెయ్యికిపైగా ప్రముఖ సంస్థలెన్నో కవి ప్రాజెక్టుకి క్లయింట్లగా ఉన్నాయి. ‘మార్పు కోసం ఆలోచిస్తే సరిపోదు... ముందు మనమే మారాలి’ అనే మాధురి ప్రస్తుతం దేశంలోని యూఎన్‌డీపీ సస్టైనబుల్‌ స్టార్టప్స్‌కి మెంటార్‌గానూ వ్యవహరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్