ఏడు దశాబ్దాల ‘అందాల’ వేడుక.. ఎంతలా మారిపోయిందో?!
ఇలాంటి వారు ఆసక్తి ఉన్నా అందాల పోటీల్లో పాల్గొనడానికి అనర్హులా? అంటే.. కానే కాదంటోంది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్. ఇటీవలే తమ నిబంధనల పుస్తకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన ఆ సంస్థ.. వచ్చే ఏడాది నుంచి నిర్వహించే పోటీల్లో పెళ్లైన....
చర్మ ఛాయ తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లా?
నాజూగ్గా, ఎత్తుకు తగ్గ బరువున్న వాళ్లే అందగత్తెలా?
పెళ్లై, పిల్లలు పుడితే మహిళల అందం తగ్గిపోతుందా?
ఇలాంటి వారు ఆసక్తి ఉన్నా అందాల పోటీల్లో పాల్గొనడానికి అనర్హులా? అంటే.. కానే కాదంటోంది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్. ఇటీవలే తమ నిబంధనల పుస్తకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన ఆ సంస్థ.. వచ్చే ఏడాది నుంచి నిర్వహించే పోటీల్లో పెళ్లైన మహిళలకు, తల్లులకు చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించి.. ఓ చరిత్రాత్మక ఘట్టానికి తెరతీసింది. సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ అందాల పోటీల్లో రాబోయే ఈ కీలక మార్పు.. విశ్వవ్యాప్తంగా ఎంతోమంది వివాహితులు, తల్లుల కలల సౌధానికి పునాది వేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే అటు సెలబ్రిటీల దగ్గర్నుంచి ఇటు సామాన్యుల దాకా ఈ మార్పును స్వాగతిస్తున్నారు. అయితే కేవలం ఇప్పుడే కాదు.. ఈ 70 ఏళ్ల మిస్ యూనివర్స్ పోటీల చరిత్రలో మహిళా శక్తికి పట్టం కట్టే ఇలాంటి మార్పులెన్నో చోటుచేసుకున్నాయి. వాటిని ఒక్కసారి గుర్తుచేసుకోవడం సందర్భోచితం.
‘మిస్ వరల్డ్’, ‘మిస్ యూనివర్స్’, ‘మిస్ ఎర్త్’, ‘మిస్ ఇంటర్నేషనల్’.. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ నాలుగు పోటీల్లో పాల్గొనే పోటీ దారులపై ఎన్నెన్నో నిబంధనలుంటాయి. నాజూగ్గా - ఫెయిర్‌గా ఉండాలని, ఎత్తుకు తగ్గ బరువుండాలని, పెళ్లి కాకూడదని, పిల్లలుండకూడదని.. ఇలాంటి లేనిపోని ప్రమాణాలు ఎంతోమంది మహిళల కలలకు అడ్డుపడుతున్నాయి. అయితే ఇటీవలే మిస్ యూనివర్స్ సంస్థ తమ నిబంధనల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి (2023) జరగబోయే పోటీల్లో వివాహితులకు, తల్లులకూ స్థానం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది.
‘మిస్ అమెరికా’తో తెగతెంపులు చేసుకొని..!
‘మిస్ యూనివర్స్’ పోటీలకు మొట్టమొదటిసారిగా బీజం పడింది 1952లో. ‘క్యాటలినా’ పేరుతో ఈత దుస్తులు రూపొందించే పసిఫిక్ నిట్టింగ్ మిల్స్ దీన్ని ప్రారంభించారు. అయితే అంతకుముందు సంవత్సరం (1951) వరకు ‘మిస్ అమెరికా పోటీల’కు స్పాన్సర్‌గా వ్యవహరించిన ఈ బ్రాండ్.. ఆ ఏడాది ఈ పోటీలో కిరీటం నెగ్గిన ‘యొలాండా బెట్బీజ్’తో తన ఈత దుస్తుల్ని ప్రచారం చేసుకోవాలనుకుంది. కానీ ఇందుకు ఆమె నిరాకరించడంతో.. మిల్స్ ‘మిస్ అమెరికా’ పోటీ నుంచి బయటికొచ్చేసి.. 1952లో సొంతంగా ‘మిస్ యూనివర్స్’ పోటీల్ని ప్రారంభించారు. ఇక అప్పట్నుంచి ఇప్పటివరకు ఏటా నిర్వహిస్తోన్న ఈ పోటీ.. వచ్చే ఏడాది 70 వసంతాలు పూర్తిచేసుకోనుంది.
తొలి విజేత.. ఆమే!
1952లో తొలిసారి నిర్వహించిన ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో ఫిన్లాండ్‌కు చెందిన అర్మీ కుసేలా విజేతగా నిలిచింది. అయితే సాధారణంగా.. ఏ ఏడాది పోటీల్లో నెగ్గితే ఆ ఏడాదే సంవత్సర కాలం పాటు విజేతలు ‘మిస్ యూనివర్స్’గా కొనసాగుతారు. కానీ 1952-57 వరకు ఆ ఏడాది నెగ్గిన విజేతల్ని ఆ తదుపరి సంవత్సరం ‘మిస్ యూనివర్స్’గా ప్రకటించేవారు. అంటే.. 1952లో కిరీటం గెలిచిన అర్మీ.. 1953లో మిస్ యూనివర్స్‌గా చలామణీ అయ్యారన్నమాట! అయితే ఈ పద్ధతిని 1958 నుంచి మార్చారు. ఇక అప్పట్నుంచి ఇప్పటిదాకా.. ఏ ఏడాది పోటీలో నెగ్గితే ఆ ఏడాదే వాళ్లు సంవత్సరం పాటు ‘మిస్ యూనివర్స్’గా కొనసాగే పద్ధతి కొనసాగుతూ వస్తోంది.
‘నేషనల్ కాస్ట్యూమ్’ అప్పట్నుంచే..!
1960లో నిర్వహించిన ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో ఇంటర్వ్యూ రౌండ్‌ని తొలిసారి పరిచయం చేసింది మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్. అదే ఏడాది నుంచి పోటీ దారులకు తమ ‘జాతీయ వస్త్రధారణ’ (నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్)ను ప్రదర్శించే అవకాశం కల్పించింది. ఇక మొదట్లో తుది పోటీలో నిలిచిన ఇద్దరు మాత్రమే స్టేజీపై ఉండి.. మిగతా పోటీదారులంతా అక్కడ్నుంచి నిష్క్రమించేవారు. కానీ ఆ తర్వాత కాలంలో పోటీ దారులందరి ముందే విజేతను, రన్నరప్‌ను ప్రకటించడం మొదలుపెట్టిందీ సంస్థ. అంతేకాదు.. తొలుత విజేతను మాత్రమే ప్రకటించి వారికి కిరీటం అలంకరించేవారు. కానీ తర్వాత కాలంలో విజేతతో పాటు తొలి రన్నరప్, రెండో రన్నరప్, ‘బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్’, ‘బెస్ట్ ఫొటోజెనిక్’, ‘బెస్ట్ స్విమ్ సూట్’, ‘బెస్ట్ స్టైల్’.. వంటి పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికీ ఆయా టైటిల్స్‌ని అందించడం మొదలుపెట్టిందీ సంస్థ.
ఒక్కో నిబంధన సడలిస్తూ..!
‘మిస్ యూనివర్స్’ పోటీల్ని ప్రారంభించిన తొలినాళ్లలో.. దీనికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు పలు నిబంధనలుండేవి. 18-27 ఏళ్ల మధ్య వయస్కులే కావాలని, చర్మ ఛాయ తెల్లగా ఉండాలని, అవివాహితులు, సంతానం కలగని/పిల్లలు లేని మహిళలే ఈ పోటీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్న రూల్స్ ఉండేవి. కానీ వీటిలో కాలక్రమేణా మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పాలి.
♛ ఇందుకు 1977లో ‘మిస్ ట్రినిడాడ్-టొబాగో’ జానెల్లే కమిషంగ్ ‘మిస్ యూనివర్స్’గా అవతరించడమే! ఇక్కడ విశేషమేంటంటే.. ఈ కిరీటం నెగ్గిన తొలి నల్లజాతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. ఆ ఏడాది ‘మిస్ ఫొటోజెనిక్ అవార్డు’ కూడా ఆమెకే సొంతమవడం మరో విశేషం.
♛ తనే కాదు.. 2018లో స్పెయిన్‌కు చెందిన ఏంజెలా పోన్స్ ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్ మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో ఆమె గెలవకపోయినా ఫైనల్ రౌండ్‌కు చేరి అందరి దృష్టినీ ఆకర్షించింది.
♛ 2021లో ‘మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్’ కిరీటం నెగ్గిన బీట్రైస్ లుగీ గోమెజ్ స్వలింగ సంపర్కురాలు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక కిరీటం నెగ్గిన తొలి లెస్బియన్‌గా నిలిచిన ఆమె.. అదే ఏడాది తన దేశం తరఫున ‘మిస్ యూనివర్స్’ పోటీల్లోనూ పాల్గొంది.
♛ ఇలా ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. వివిధ దేశాల సుందరాంగినులు అందాల కిరీటాలు అందుకోవడం, తమ దేశాలకు గర్వకారణంగా నిలవడం మనం చూస్తూనే వచ్చాం. తద్వారా అందమంటే బాహ్య సౌందర్యమే కాదు.. అంతః సౌందర్యమూ ముఖ్యమేనని చాటుతూ వచ్చాయీ అందాల పోటీలు. నేటికీ ఇవే ప్రమాణాల్ని కొనసాగిస్తున్నాయి కూడా!
♛ ఇక వచ్చే ఏడాది నుంచి వివాహం అయిన మహిళలు, పిల్లలు పుట్టిన వారూ ఈ పోటీల్లో పాల్గొనేలా నిబంధనల్ని సడలించి మరో చరిత్రకు తెరలేపింది మిస్ యూనివర్స్ సంస్థ. తద్వారా మరెంతోమంది ఔత్సాహికుల కలలకు రెక్కలు తొడిగినట్లయింది.
♛ 70 ఏళ్ల మిస్ యూనివర్స్ చరిత్రలో భాగంగా ఇప్పటివరకు మన దేశానికి మూడుసార్లు కిరీటం దక్కింది. గతేడాది పంజాబ్ సుందరి హర్నాజ్ సంధు ఈ కిరీటం నెగ్గి.. 21 ఏళ్ల భారతీయుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే! గతంలో లారా దత్తా (2000), సుస్మితా సేన్ (1994).. ఈ అందాల కిరీటం సొంతం చేసుకున్నారు.
ఇక 1955 నుంచి ఈ పోటీల్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించగా.. ప్రస్తుతం ఈ పోటీలకు 500 మిలియన్లకు పైగా వీక్షకులున్నట్లు అంచనా! తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వీక్షకులున్న పోటీల్లో ఒకటిగా నిలిచింది ‘మిస్ యూనివర్స్ అందాల పోటీ’.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.