ఇలా చేస్తే మీ స్టవ్ తళతళలాడాల్సిందే!
మనం వంట చేసేటప్పుడు స్టవ్‌పై నూనె చిట్లడం, ఇతర ఆహార పదార్థాలు పడడం మామూలే. అయితే మరి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డుగా తయారవుతుంది. అలాగని రోజూ స్టవ్ కడగాలన్నా సమయం సరిపోకపోవడంతో చాలామంది మహిళలు వారానికోసారి లేదంటే మూడునాలుగు రోజులకోసారి క్లీన్ చేస్తూ ఉంటారు.
మనం వంట చేసేటప్పుడు స్టవ్‌పై నూనె చిట్లడం, ఇతర ఆహార పదార్థాలు పడడం మామూలే. అయితే మరి దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సరి.. లేదంటే జిడ్డుగా తయారవుతుంది. అలాగని రోజూ స్టవ్ కడగాలన్నా సమయం సరిపోకపోవడంతో చాలామంది మహిళలు వారానికోసారి లేదంటే మూడునాలుగు రోజులకోసారి క్లీన్ చేస్తూ ఉంటారు. దీంతో స్టవ్ జిడ్డుగా మారుతుంది. మరి, ఇలా స్టవ్‌పై పేరుకున్న జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు సులభంగా పోవాలంటే ఏంచేయాలి.. అని ఆలోచిస్తున్నారా? అందుకు మన ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకొని.. స్టవ్‌ని తళతళలాడించేద్దామా..
ఈ మిశ్రమంతో..
మీ ఇంట్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా ఉన్నాయా..? ఇంకేం స్టవ్‌పై పేరుకున్న జిడ్డును సులభంగానే వదలగొట్టచ్చు. ఇందుకోసం స్టవ్ ఉపరితలంపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లాలి. ఆపై హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి కాసేపు వదిలేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్‌ని శుభ్రం చేస్తే సరి.. ఎంత మొండి మరకలైనా ఇట్టే వదలిపోతాయి. కావాలంటే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి..
నూనెతో కడిగేయండి..
వెజిటబుల్ లేదా ఆలివ్ నూనెతో కూడా స్టవ్‌ని శుభ్రం చేయచ్చు. అదేంటి.. అసలే స్టవ్‌పై ఆయిల్ పడి జిడ్డుగా మారిందంటే.. మళ్లీ నూనెతో కడగమంటారేంటి..? ఇలా చేస్తే ఇంకా జిడ్డుగా మారుతుంది కదా.. అంటారా? అలా ఏం జరగదు. ఇందుకోసం.. ముందుగా స్టవ్‌పై వెజిటబుల్ లేదా ఆలివ్ నూనె కొద్దిగా చల్లాలి. కాసేపయ్యాక మెత్తటి వస్త్రంతో రుద్దాలి. ఇలా చేయడం వల్ల స్టవ్‌పై దుమ్ము, ధూళి చేరి మొండిగా తయారైన మరకలు సులభంగా వదిలిపోతాయి. ఆ తర్వాత డిష్‌వాషర్ లేదా క్లీనర్‌తో శుభ్రం చేస్తే స్టవ్ మెరిసిపోతుంది.
మరిగే నీటితో..
ఇంట్లో స్టవ్ శుభ్రం చేయడానికి ఇతర పదార్థాలేవీ లేవు అంటారా..? అయినా స్టవ్‌ని సులభంగా క్లీన్ చేయచ్చు. అందుకోసం నీటిని బాగా మరిగించి స్టవ్ కుక్‌టాప్‌పై పోయాలి. ఇలా పోసిన నీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత కాస్త డిష్‌వాషర్ లేదా ఏదైనా సోప్ వేసి స్క్రబ్బర్‌తో తోమితే సరి.. స్టవ్‌పై పేరుకుపోయిన జిడ్డు ఇట్టే వదిలిపోతుంది. స్టవ్ కూడా తళతళా మెరిసిపోతుంది.
వైట్ వెనిగర్‌తో..
ప్రస్తుతం చాలామంది ఇళ్లలో గ్లాస్ టాప్ స్టవ్‌లు వాడడం కామనైపోయింది. ఇలాంటి వారు స్టవ్‌పై పేరుకున్న జిడ్డును సులభంగా వదిలించుకోవడానికి వైట్ వెనిగర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక వంతు వైట్ వెనిగర్‌కి రెండు వంతుల నీటిని జతచేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ కుక్‌టాప్‌పై స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడవాలి. అంతే.. స్టవ్ మళ్లీ కొత్తదానిలా మెరిసిపోతుంది. ముఖ్యంగా వెనిగర్‌లోని ఆమ్లత్వం స్టవ్‌పై పేరుకున్న జిడ్డును త్వరగా వదిలించేస్తుంది. ఇలా ఈ మిశ్రమాన్ని మీరు రోజూ స్టవ్ శుభ్రం చేయడానికి ఉపయోగించుకోవచ్చు.
బేకింగ్ సోడా, నిమ్మకాయతో..
గ్లాస్ టాప్ స్టవ్ ఉన్న వారు స్టవ్ కుక్‌టాప్‌పై పడిన మరకలు, పేరుకున్న జిడ్డును బేకింగ్ సోడా, నిమ్మకాయ సహాయంతోనూ సులభంగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం గుప్పెడు బేకింగ్ సోడాను ముందుగా స్టవ్ కుక్‌టాప్‌పై చల్లాలి. ఆపై నిమ్మచెక్కతో రుద్దాలి. ఇప్పుడు ఓ తడిగుడ్డ సహాయంతో స్టవ్‌ని శుభ్రంగా తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల స్టవ్ తళతళలాడుతుంది.
మరికొన్ని..
❀ ఉప్పు, బేకింగ్ సోడా.. ఈ రెండింటినీ చెంచా చొప్పున తీసుకొని బాగా కలపాలి. దీనికి కొద్దికొద్దిగా నీటిని చేర్చుతూ పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీనిలో ఒక చిన్న గుడ్డముక్క ముంచి దాంతో స్టవ్ మొత్తాన్నీ రుద్దాలి. మిగిలిన మిశ్రమాన్ని కూడా దీనిపై పూసి.. కాసేపటి తర్వాత శుభ్రం చేస్తే స్టవ్‌కి అంటుకున్న జిడ్డు ఇట్టే తొలగిపోతుంది.
❀ ఒవెన్ క్లీనర్‌తోనూ స్టవ్‌ను శుభ్రం చేయచ్చు. ఇందుకోసం స్టవ్ బర్నర్స్, స్టాండ్స్‌ని తొలగించి ఆ ప్రదేశాన్ని న్యూస్ పేపర్లతో కవర్ చేయాలి. ఇప్పుడు ఒవెన్ క్లీనర్‌ని స్ప్రే చేసి కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మెత్తటి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.