Internship: ఈ పొరపాట్లు దొర్లకుండా చూసుకోండి!

ఇంటర్న్‌షిప్‌.. ఉద్యోగ కెరియర్‌కు ఇది తొలి మెట్టు లాంటిది. చదువుకునే క్రమంలో లేదంటే చదువు పూర్తయ్యాక.. ఒక సంస్థలో కొద్ది రోజుల పాటు విధులు నిర్వర్తించడమే ఈ ప్రోగ్రామ్‌ ముఖ్యోద్దేశం. అయితే కొన్ని సంస్థలే అత్యుత్తమ కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లి నైపుణ్యాలున్న....

Published : 15 Sep 2022 19:47 IST

ఇంటర్న్‌షిప్‌.. ఉద్యోగ కెరియర్‌కు ఇది తొలి మెట్టు లాంటిది. చదువుకునే క్రమంలో లేదంటే చదువు పూర్తయ్యాక.. ఒక సంస్థలో కొద్ది రోజుల పాటు విధులు నిర్వర్తించడమే ఈ ప్రోగ్రామ్‌ ముఖ్యోద్దేశం. అయితే కొన్ని సంస్థలే అత్యుత్తమ కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లి నైపుణ్యాలున్న విద్యార్థుల్ని ఎంపిక చేసి ఇంటర్న్‌షిప్‌ సౌలభ్యం కల్పిస్తుంటాయి. మరోవైపు విద్యార్థులు కూడా తమ ఆసక్తులు, విద్యార్హతల్ని దృష్టిలో పెట్టుకొని ఆయా ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదేమైనా ఇంటర్‌్ొషిప్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులు.. పని చేసే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడడం ముఖ్యమంటున్నారు కార్పొరేట్‌ నిపుణులు. అప్పుడే అది మీ కెరియర్‌కు బంగారు బాటలు వేయడంతో పాటు.. మీరూ వ్యక్తిగతంగా బోలెడన్ని నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా పొరపాట్లు? ఇంటర్న్‌షిప్‌ చేసే క్రమంలో గుర్తుంచుకోవాల్సిన ఇతర అంశాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

బరువు కాదు.. బాధ్యత అనుకోండి!

ఉద్యోగమంటేనే ఒత్తిడి, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. జాబ్‌లో చేరిన మొదట్లో లేదంటే పని నేర్చుకునే క్రమంలో ఎవరికైనా ప్రతి టాస్క్‌ కష్టంగానే అనిపిస్తుంది. ఇంటర్న్‌షిప్‌లోనూ చాలామంది ఇలాగే ఫీలవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఏదైనా మనం చూసే దృష్టి కోణం పైనే ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అంటే.. మనం ఎంచుకునే పనిని బరువుగా కాకుండా.. బాధ్యతగా భావిస్తే.. క్లిష్టం అనుకున్నది కూడా తేలికవుతుందంటున్నారు. కాబట్టి కొత్త, ఒత్తిడి, భయం, బిడియం.. ఈ భావోద్వేగాల్ని పక్కన పెట్టి.. పని నేర్చుకోవడాన్ని ఆస్వాదించమంటున్నారు. ఇలా ఆదిలోనే మానసికంగా సన్నద్ధమైతే.. మీరు ఎలాంటి పని వాతావరణంలోనైనా.. ఎంత క్రమశిక్షణతో ఉన్న బాస్‌ కిందైనా అలవోకగా పనిచేయగలుగుతారు. అంతేకాదు.. ఇలా ఆసక్తితో పని నేర్చుకుంటే బోలెడన్ని నైపుణ్యాలు కూడా సొంతం చేసుకోవచ్చు.

‘ఫీడ్‌బ్యాక్‌’.. తీసుకోవట్లేదా?!

ఇంటర్న్‌షిప్‌ అనేది ఉద్యోగంలోకి వెళ్లే ముందు మీకో ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసి.. ఈ కాలాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ‘ఇంటర్న్‌షిప్పే కదా.. అసలు ఉద్యోగం కాదు కదా!’ అన్న అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో ఎవరితోనూ తమకు సంబంధం లేదన్నట్లుగా తమ పనేదో పూర్తి చేసుకొని బయటపడుతుంటారు. మరీ ఇంత రిజర్వ్‌డ్‌గా ఉండడం ఈ దశలో పనికి రాదంటున్నారు నిపుణులు. ఇంటర్న్‌షిప్‌ అయినా అసలు ఉద్యోగంలాగే భావించి.. సహోద్యోగులతో చెలిమి పెంచుకోవడం, పనికి సంబంధించిన మెలకువల్ని వారి దగ్గర్నుంచి నేర్చుకోవడం, మీ సృజనాత్మక ఆలోచనల్ని వారితో పంచుకోవడం, మీరెలా పనిచేస్తున్నారో మీ బాస్‌ దగ్గర్నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలు ఏమేమున్నాయో అడిగి తెలుసుకోవడం.. ఇవన్నీ ముఖ్యమే! ఇలా అందరితో కలివిడిగా మెలగడం వల్ల మీలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపడతాయి.. అలాగే అసలు ఉద్యోగంలో చేరాక సహోద్యోగులు-బాస్‌తో ప్రొఫెషనల్‌గా మెలిగే విషయంలోనూ ఈ నైపుణ్యాలు మీకు ఉపయోగపడతాయి.

ఆ పద్ధతులకు తగ్గట్లుగా..

సాధారణంగా విద్యార్థి మైండ్‌సెట్‌ ఎలా ఉంటుంది? ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటూ.. ఎంజాయ్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. కానీ ఇంటర్న్‌షిప్‌లో ఇది పనికిరాదంటున్నారు నిపుణులు. చాలావరకు కార్పొరేట్‌ కంపెనీల్లో ఒక రకమైన నిర్దిష్టమైన వాతావరణాన్నే మనం చూస్తుంటాం. అంటే దుస్తుల దగ్గర్నుంచి.. సమయపాలన దాకా ప్రతి విషయంలోనూ ఓ పద్ధతి/సంప్రదాయాన్ని అనుసరిస్తుంటాయి చాలా కంపెనీలు. మరికొన్ని కంపెనీల్లో అరుదుగా క్యాజువల్‌ డ్రస్సింగ్‌ని అనుమతిస్తుంటారు. కాబట్టి ఇంటర్న్‌షిప్‌ చేసే విద్యార్థులు ఆయా సంస్థల నియమాలకు అనుగుణంగా నడుకోవడం ముఖ్యం. డ్రస్‌కోడ్‌ దగ్గర్నుంచి చక్కటి సమయపాలన పాటించడం దాకా.. ప్రతి విషయంలో సంస్థతో కలిసి నడవడం వల్ల మీపై మంచి ఇంటర్న్‌గా ముద్ర పడుతుంది. ఇది మీరు ఉద్యోగం వెతుక్కునే క్రమంలో, కెరియర్‌ అభివృద్ధిలోనూ కీలకంగా మారుతుంది.

డెస్క్‌కే పరిమితం కానక్కర్లేదు!

ఇంటర్న్‌షిప్‌లో పని నేర్చుకునే క్రమంలో విద్యార్థులు ప్రతి సవాలునూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. కొన్ని సదస్సులు జరగచ్చు.. ప్రాజెక్ట్‌ పని మీద ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు.. ఆయా పనులు/ప్రాజెక్ట్‌ల గురించి ఇతర సంస్థలతో చర్చించాల్సి రావచ్చు.. ఇలాంటప్పుడు ఆయా పనులు చేయడానికి సీనియర్లున్నారు కదా అని అనుకోకుండా.. వీటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇలా క్షేత్రస్థాయిలోకి వెళ్లడం వల్ల మీకు మరిన్ని నైపుణ్యాలు అలవడతాయి. అలాగే పనిలో మీరు చూపుతున్న ఉత్సాహం మీ కెరియర్‌కు ప్లస్‌ అవుతుందని గుర్తుపెట్టుకోండి.

ఓ ఇంటర్న్‌గా మీరు వేసే ప్రతి అడుగూ మీరు పనిచేస్తోన్న సంస్థలు నోట్‌ చేసుకుంటాయి. దాన్ని బట్టే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసినట్లుగా సర్టిఫికెట్‌ ఇస్తాయి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా.. చక్కటి పనితీరు కనబరిస్తే.. అటు సంస్థను సంతృప్తిపరచచ్చు.. మీరూ విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసుకొని.. అత్యుత్తమ సంస్థలో మీ కలల కొలువులో చేరచ్చు..!

ఆల్‌ ది బెస్ట్!!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్