Body Shapes: ప్రతిదీ ప్రత్యేకమే!

సన్నగా ఉంటే కాస్త లావవ్వాలని, బొద్దుగా ఉంటే నాజూగ్గా మారాలని, పొట్ట పెరిగితే అసౌకర్యంగా ఉంటుందని.. ఇలా తమ శరీరాకృతికి సంబంధించి ఏదో ఒక విషయంలో బాధపడుతుంటారు కొంతమంది. ఈ క్రమంలో ఇతరులతో పోల్చుకుంటూ, సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలకు తలొగ్గుతూ తమను తామే అసహ్యించుకుంటారు. ఆత్మన్యూనతకు గురవుతారు. నిజానికి ఎవరి.....

Published : 12 Mar 2022 17:20 IST

సన్నగా ఉంటే కాస్త లావవ్వాలని, బొద్దుగా ఉంటే నాజూగ్గా మారాలని, పొట్ట పెరిగితే అసౌకర్యంగా ఉంటుందని.. ఇలా తమ శరీరాకృతికి సంబంధించి ఏదో ఒక విషయంలో బాధపడుతుంటారు కొంతమంది. ఈ క్రమంలో ఇతరులతో పోల్చుకుంటూ, సమాజం నుంచి ఎదురయ్యే విమర్శలకు తలొగ్గుతూ తమను తామే అసహ్యించుకుంటారు. ఆత్మన్యూనతకు గురవుతారు. నిజానికి ఎవరి శరీరాకృతి వారికి ప్రత్యేకమైందని, అదే నలుగురిలో తమను ‘ఒక్క’రిగా చూపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఎలాంటి శరీరాకృతి ఉన్నా తమను తాము అంగీకరించి.. చక్కటి ఆహార్యాన్ని పాటిస్తే స్వీయ ప్రేమను పెంపొందించుకోవచ్చు.. ఇతరులకు ఆదర్శంగానూ నిలవచ్చు. మరి, మహిళల్లో కామన్‌గా ఉండే కొన్ని శరీరాకృతులు, వాటిని ప్రత్యేకంగా చూపే డ్రస్సింగ్‌ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

బనానా బాడీ

చాలామంది అమ్మాయిలు/ మహిళలు తమ శరీరాకృతి వంపులు తిరిగి ఉండాలని, అలా ఉంటేనే అందంగా ఉన్నట్లు లెక్క అనుకుంటారు. అయితే కొంతమంది శరీరాకృతి నఖశిఖ పర్యంతం ఒకేలా ఉంటుంది. దీన్నే ‘సమాంతర/దీర్ఘచతురస్రాకార శరీరాకృతి లేదా బనానా బాడీ’గా పిలుస్తారు. ఇలాంటి శరీరాకృతిని ‘సూపర్‌మోడల్‌ బాడీ’గా పరిగణిస్తారు. అంటే.. వీళ్లు మోడల్స్‌కి ఏమీ తక్కువ కాదన్నమాట! అందుకే ‘నా శరీరాకృతి పీలగా, ఒకే రీతిలో ఉంద’ని ఫీలవ్వకుండా.. ఆఫ్‌-షోల్డర్‌ టాప్స్‌, ట్యూబ్‌ డ్రస్సులు, బెల్టు తరహా దుస్తులు వేసుకుంటే చక్కటి లుక్ ని సొంతం చేసుకోవచ్చు.

పియర్‌ బాడీ

చేతులు, నడుం వరకు సన్నగా.. పొట్ట విశాలంగా, పిరుదులు లావుగా.. ఇలా చూడ్డానికి పియర్‌ పండును పోలి ఉంటుందీ శరీరాకృతి. ఈ క్రమంలో చాలామంది లావుగా ఉన్నామంటూ తమ పిరుదుల్ని కవర్‌ చేసుకోవడానికి బిగుతైన దుస్తుల్ని ధరిస్తుంటారు. దీనివల్ల శరీరాకృతి మరింత ఎబ్బెట్టుగా కనిపించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నఖశిఖపర్యంతం శరీరాకృతిని బ్యాలన్స్‌ చేసేలా డ్రస్సింగ్‌ ఉంటే ఆకర్షణీయంగా కనిపించచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం భుజాలు వెడల్పుగా కనిపించేలా స్కూప్‌ నెక్‌, బోట్‌ నెక్‌, కఫ్తాన్‌, రఫుల్డ్‌ కేప్‌ తరహా డ్రస్సుల్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే పుషప్‌ బ్రా, ప్యాడెడ్‌ బ్రా.. వంటివి ఛాతీని విశాలంగా కనిపించేలా చేస్తాయి. ఇక కింది భాగంలో శరీరాకృతిని బహిర్గతం చేసేలా బిగుతైన దుస్తులు అస్సలు ధరించకూడదని గుర్తుపెట్టుకోండి!

అవర్‌గ్లాస్‌ బాడీ

ఈ తరహా శరీరాకృతిలో ఛాతీ, పిరుదులు దాదాపు సమాన వెడల్పుల్లో ఉంటూ.. నడుం కాస్త సన్నగా ఉండడం గమనించచ్చు. ఇక కొంతమందిలో ఛాతీ/ మరికొంతమందిలో పిరుదుల భాగం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి వెడల్పుగా ఉంటుంది. ఇలాంటి వారు బయట దొరికే రెడీమేడ్‌ దుస్తులకు బదులుగా.. వారి శరీరాకృతికి తగ్గ కొలతల ప్రకారం దుస్తులు కుట్టించుకుంటే సరిగ్గా నప్పుతాయంటున్నారు నిపుణులు. ఒకవేళ రెడీమేడ్‌ దుస్తులైనా.. వదులైనవి ఎంచుకొని నిపుణుల సలహా మేరకు ఫిట్టింగ్‌ చేయించుకుంటే శరీరాకృతిని బ్యాలన్స్‌ చేసుకోవచ్చు.

గుండ్రంగా ఉందా?

గుండ్రటి శరీరాకృతి కలిగిన వారిలో తల, కాళ్లు మినహాయించి.. మధ్య భాగమంతా బొద్దుగా కనిపించడం చూస్తుంటాం. ఇలాంటి వారు లావుగా ఉన్నామని, తమకు ఏ డ్రస్సూ నప్పదని అనుకుంటారు. అయితే ఇలాంటి వాళ్లు కాళ్లకు బిగుతుగా ఉండే దుస్తులు ఎంచుకుంటే లుక్‌ ఇనుమడించదు. అందుకే బెల్టు దుస్తులు, నడుం నుంచి కిందికి వదులుగా ఉండే స్వింగ్‌ డ్రస్‌, ఎ-లైన్‌ తరహా దుస్తులు, ఫుల్‌ స్కర్ట్స్‌.. వంటివి ఎంచుకుంటే శరీరమంతా ఒకే ఆకృతిలో ఉంటుంది.. తద్వారా లుక్‌ బాగుంటుంది.

స్పోర్ట్స్‌ బాడీ!

క్రీడాకారిణులు, వ్యాయామాలతో కండలు పెంచిన వారి శరీరం పురుషులను పోలి ఉండడం చూస్తుంటాం. అయితే ఇలాంటి వారి శరీరంలో భుజాలు, నడుం-పిరుదుల వద్ద కాస్త వెడల్పుగా ఉండడం గమనించచ్చు. వీరు బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే శరీరాకృతి వెడల్పుగా కనిపించి.. లుక్‌ దెబ్బతింటుంది. అంతేకాదు.. కండలు కూడా బయటికి కనిపిస్తే అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. కాబట్టి రఫుల్డ్‌ తరహా దుస్తులు, వదులుగా ఉండే హాల్టర్‌ టాప్స్‌, లాంగ్‌ స్కర్ట్స్‌.. వంటివి ప్రయత్నించచ్చు. అలాగే వీరు స్ట్రాప్‌లెస్‌ తరహా దుస్తులకు దూరంగా ఉండడం మంచిది.

మరీ సన్నగా ఉంటే..!

మరీ లావుగా ఉన్నా, అలాగని మరీ సన్నగా ఉన్నా.. అసౌకర్యానికి గురవుతుంటారు చాలామంది. ముఖ్యంగా మరీ సన్నగా ఉన్న వారి శరీరంలో చేతులు, ఛాతీ, పొట్ట, పిరుదులు, కాళ్లు.. ఇలా అన్నీ ఒకే ఆకృతిలో పీలగా కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు మరీ బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి వీరు కాస్త వదులుగా ఉండే, సమాంతర గీతలుండే దుస్తులు ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే లేయర్డ్‌ తరహా దుస్తుల్లో కాస్త బొద్దుగా కనిపించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు నడుముకి బెల్టు, కాళ్లకు హీల్స్‌.. వంటివి ఉపయోగించకపోవడమే మంచిది.

దీన్ని బట్టి చూస్తే ఏ శరీరాకృతైనా దేనికదే విభిన్నం, ప్రత్యేకం అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఎలా ఉన్నా అంగీకరిస్తూ.. డ్రస్సింగ్‌ విషయంలో నిపుణుల సలహాలు పాటిస్తే అందంగా మెరిసిపోవచ్చు.. ఫ్యాషన్‌ క్వీన్‌లా కనిపించేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్