పాలిచ్చే తల్లులూ.. కాస్త కంఫర్టబుల్‌గా, కాస్త స్టైలిష్‌గా..!

ఇలా పాలిచ్చే తల్లుల్లో చాలామంది తమకు నచ్చినా నచ్చకపోయినా చీరలు ధరించడం మనం చూస్తూనే ఉంటాం. పైగా బయటికి వచ్చినప్పుడు ఈ దుస్తుల్లో కొంతమంది అసౌకర్యానికి గురవుతుంటారు కూడా! ఇంకొంతమందేమో స్టైలిష్‌గా కనిపించాలన్న ఉద్దేశంతో మోడ్రన్‌ దుస్తులు ఎంచుకొని తిప్పలు పడుతుంటారు. మీరు కూడా ఇంతేనా? పిల్లలకు పాలిచ్చే క్రమంలోనూ ఫ్యాషనబుల్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం అందుకు బోలెడన్ని ఆప్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Updated : 05 Aug 2021 14:53 IST

ఇటీవలే తల్లైన సువిధకు చీర కట్టుకోవడం అస్సలు రాదు.. పైగా అందులో చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటుంది. అయినా బయటికి వెళ్లినప్పుడు తన బుజ్జాయికి పాలివ్వడం కోసం కష్టమైనా సరే చీరే ధరిస్తుంది.

వసుధకు మూడు నెలల పాప ఉంది. బయటికి వెళ్లినప్పుడు తన చిన్నారికి పాలివ్వడానికి చాలా అసౌకర్యంగా ఫీలవుతుంటుందామె. కారణం.. చుడీదార్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌.. ఇలా ఆమె ధరించే దుస్తులే!

ఇలా పాలిచ్చే తల్లుల్లో చాలామంది తమకు నచ్చినా నచ్చకపోయినా చీరలు ధరించడం మనం చూస్తూనే ఉంటాం. పైగా బయటికి వచ్చినప్పుడు ఈ దుస్తుల్లో కొంతమంది అసౌకర్యానికి గురవుతుంటారు కూడా! ఇంకొంతమందేమో స్టైలిష్‌గా కనిపించాలన్న ఉద్దేశంతో మోడ్రన్‌ దుస్తులు ఎంచుకొని తిప్పలు పడుతుంటారు. మీరు కూడా ఇంతేనా? పిల్లలకు పాలిచ్చే క్రమంలోనూ ఫ్యాషనబుల్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం అందుకు బోలెడన్ని ఆప్షన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్‌ బ్రా మొదలు ట్యాంక్‌ టాప్స్‌ దాకా, క్యాజువల్స్‌ దగ్గర్నుంచి ఫార్మల్స్‌ దాకా.. ఇటు స్టైలిష్‌గా, అటు కంఫర్టబుల్‌గా ఉండే అవుట్‌ఫిట్స్‌/లో దుస్తులు న్యూ మామ్స్‌ మనసు దోచేస్తున్నాయి. మరి, అలాంటి కొన్ని ఫ్యాషనబుల్‌ నర్సింగ్‌ వేర్‌ గురించి తెలుసుకుందాం రండి..

ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా పిల్లలకు పాలిచ్చే క్రమంలో సౌకర్యవంతంగా ఉండే అవుట్‌ఫిట్స్‌ ధరించేందుకే ప్రాధాన్యమిస్తుంటారు కొత్తగా తల్లైన మహిళలు. అయితే అప్పుడప్పుడూ ఫ్యాషన్‌ పేరుతో మనం ధరించే కొన్ని రకాల దుస్తులు పాలిచ్చేటప్పుడు మాత్రం అసౌకర్యానికి గురిచేస్తాయి. అలాంటి వారు అటు స్టైలిష్‌గా మెరిసిపోయేందుకు, ఇటు కంఫర్టబుల్‌గా కనిపించేందుకు ప్రస్తుతం మార్కెట్లో విభిన్న నర్సింగ్‌ అవుట్‌ఫిట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

నర్సింగ్‌ బ్రా గురించి తెలుసా?

మనం ఎలాంటి దుస్తులు ఎంచుకున్నా లో దుస్తులు ధరించడం కామన్‌. అయితే ఈ క్రమంలో సాధారణ బ్రాలను ఎంచుకుంటే పాలివ్వడానికి కాస్త అసౌకర్యంగానే ఉంటుంది. కాబట్టి ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నర్సింగ్‌ బ్రాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి రొమ్ము భాగాల్లో ప్రత్యేకంగా జిప్స్‌, బటన్స్‌, హుక్స్‌, క్లిప్స్‌.. వంటివి అమరి ఉంటాయి. దీంతో మీరు ఏవైపు పాలివ్వాలనుకుంటున్నారో.. ఆ వైపు బటన్‌ ఓపెన్‌ చేసి కంఫర్టబుల్‌గా పాలివ్వచ్చు.. మరోవైపు రొమ్ము భాగం కనిపిస్తుందన్న భయమే అక్కర్లేదు. అయితే ఇలాంటి నర్సింగ్‌ బ్రాల గురించి కొంతమందికి తెలిసినప్పటికీ వాటిపై ధరించే అవుట్‌ఫిట్స్‌ మరీ బిగుతుగా ఉండేలా ధరించి అసౌకర్యానికి లోనయ్యే వారూ లేకపోలేదు. అందుకే నర్సింగ్‌ బ్రాలతో కంఫర్టబుల్‌గా ఉండాలంటే పై నుంచి వేసుకునే దుస్తులు వదులుగా ఉండేలా జాగ్రత్తపడాలి. అప్పుడే చిన్నారికి మరింత సౌకర్యవంతంగా పాలివ్వడం వీలవుతుంది. అలాగే మీరూ అసౌకర్యానికి గురికాకుండా ఉంటుంది.

ట్యాంక్‌ టాప్‌తో కంఫర్టబుల్‌గా!

టాప్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌, కుర్తీస్‌.. ఇలా ఏది ఎంచుకున్నా వాటికి జతగా ధరించే లో దుస్తుల విషయంలో మరో ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అదే ట్యాంక్‌ టాప్‌. అయితే కొంతమంది కేవలం వీటిని మాత్రమే ధరిస్తుంటారు. ఇలా అయితే బయటికి వెళ్లినప్పుడు అసౌకర్యంగా ఉంటుందనుకునే వారు వీటిపై నుంచి వదులుగా ఉండేలా మీకు నచ్చిన దుస్తుల్ని ధరించచ్చు. లేదంటే వీటి లోపల నర్సింగ్‌ బ్రా వేసుకున్నా సరిపోతుంది. అయితే ట్యాంక్‌ టాప్‌లోనూ వి-నెక్‌, చంకల కింద కాస్త వెడల్పాటి ఓపెన్‌ ఉన్నట్లుగా ఉండే తరహావి ఎంచుకుంటే పాలివ్వడానికి కంఫర్టబుల్‌గా ఉంటుందంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. ఇలా ఉన్న ట్యాంక్‌ టాప్‌తో మీ నడుమును, ఎద భాగాన్ని బయటికి కనిపించకుండా దాచేయచ్చు.

‘ర్యాప్‌’ చేసేయండి!

పాలు తాగే పసి పిల్లలు ఉన్న తల్లుల్లో చాలామంది అలా షికారుకు వెళ్లడానికి వెనకాడుతుంటారు. కారణం నలుగురిలో తన చిన్నారికి పాలివ్వడానికి మొహమాటపడడమే.. అలాగే ఈ క్రమంలో వారు ధరించే దుస్తులు సైతం ఇందుకు మరో కారణంగా చెప్పచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో కంఫర్టబుల్‌గా మీ చిన్నారికి పాలిస్తూనే, స్టైలిష్‌గా మెరిసిపోవాలంటే ‘ర్యాప్‌’ తరహా డ్రస్సులు చక్కటి ఎంపిక. షర్ట్‌లా వేసుకునే ఈ తరహా అవుట్‌ఫిట్‌ను ఒక లేయర్‌పై నుంచి మరో లేయర్‌ను దీనికి అనుసంధానమై ఉన్న బెల్టుతో ర్యాప్‌ చేసి కట్టిపడేయచ్చు. ఇక ఇలాంటి అవుట్‌ఫిట్‌కు ఇందాక చెప్పుకున్నట్లుగా ట్యాంక్‌ టాప్‌ లేదా నర్సింగ్‌ బ్రా జతచేస్తే కంఫర్టబుల్‌గానూ ఉంటుంది. అంతేకాదు.. పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా కుర్తీస్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌.. వంటి వాటికి ముందు భాగంలో బటన్స్‌ ఉండేలా రూపొందిస్తున్నారు డిజైనర్లు.

లేయర్డ్‌ టాప్‌తో లవ్లీగా..!

జీన్స్‌పైకి టీషర్ట్స్‌, క్రాప్‌టాప్స్‌, షర్ట్స్‌.. వంటివి ధరించడం కామనే! అయితే టీషర్ట్స్‌, క్రాప్‌టాప్స్‌ పిల్లలకు పాలిచ్చే క్రమంలో అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. అందుకే లేయర్డ్‌ నర్సింగ్‌ టాప్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణ టాప్‌లా ఉండే వీటికి.. ఎదభాగం కింది వరకు ఒక లేయర్‌.. నడుం వరకు మరో లేయర్‌ ఉంటాయి. కింది లేయర్‌ను పై లేయర్‌ కప్పేలా డిజైన్‌ చేశారు. కాస్త వదులుగా ఉండే ఈ టాప్‌ లేయర్‌ని పైకెత్తి మీ చిన్నారికి మీరు ఎక్కడంటే అక్కడ కంఫర్టబుల్‌గా పాలివ్వచ్చు. ఇటు ఫ్యాషనబుల్‌గానూ మెరిసిపోవచ్చు. ఒకవైపు పాలిస్తుంటే మరో రొమ్ము బయటికి కనిపించకుండా ఉండేలా దీన్ని డిజైన్‌ చేశారు డిజైనర్లు. కేవలం ఇవే కాదు.. పాలిచ్చే తల్లులు జీన్స్‌కి జతగా ధరించేందుకు వదులుగా ఉండే పీసెంట్‌ టాప్స్‌, టాప్స్‌కి చంకల కింద జిప్‌/బటన్స్‌ ఉన్నవి, మెడ వద్ద ఇరువైపులా జిప్‌ ఉన్నవి.. ఇలా విభిన్న రకాలైన నర్సింగ్‌ టాప్స్‌ మగువల మనసు దోచేస్తున్నాయి. అయితే వీటిలో ఏ టాప్‌ ఎంచుకున్నా లోపల నర్సింగ్‌ బ్రా వేసుకుంటే మరింత సౌకర్యంగా అనిపిస్తుంది.

‘నర్సింగ్‌ కవర్‌’తో కవర్‌ చేసుకోవచ్చు!

ఏ దుస్తులు వేసుకున్నా నలుగురిలో బిడ్డకు పాలివ్వాలంటే అసౌకర్యంగా ఉంటుందనుకునే వారు తాము ధరించిన దుస్తులకు మ్యాచయ్యేలా లేదంటే కాంట్రాస్ట్‌గా ఉండే నర్సింగ్‌ కవర్‌ని వేసుకోవచ్చు. బాగా వదులుగా, చూడ్డానికి అచ్చం కేప్‌లా ఉండే దీనికి ముందు భాగంలో బటన్స్‌ ఉంటాయి. కొన్ని నేరుగా తలపై నుంచి ధరించేలా ఉంటాయి. బిడ్డను పొత్తిళ్లలో హత్తుకొని ఈ కేప్‌ని కవర్‌ చేస్తూ కంఫర్టబుల్‌గా పాలివ్వచ్చు. ఇలా ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతూనే.. అటు బహిరంగ ప్రదేశాల్లో సౌకర్యంగా బిడ్డకు పాలివ్వచ్చు. ఒకవేళ నర్సింగ్‌ కవర్‌ అందుబాటులో లేకపోతే.. సాధారణంగా మనం ధరించే స్కార్ఫ్‌, షాల్‌.. వంటివి కూడా ఎంచుకోవచ్చు.

ఇవి గుర్తుంచుకోండి!

* ఇలా మీరు ఏ నర్సింగ్‌ ఫ్యాషన్‌ని ఎంచుకున్నా సరే.. నర్సింగ్‌ ప్యాడ్స్‌ని ధరించడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఒకవేళ రొమ్ముల్లో నుంచి పాలు లీకైనా వాటిని ఇవి పీల్చేసుకుంటాయి. తద్వారా ఎలాంటి అసౌకర్యమూ ఉండదు.

* ఫ్యాషన్‌ పేరుతో మరీ ఎక్కువ లేయర్లు, ఫ్రిల్స్‌, రఫుల్స్‌.. తరహాలో ఉన్న దుస్తులు ధరించినా పాలివ్వడానికి అస్సలు కంఫర్టబుల్‌గా ఉండదు. కాబట్టి నర్సింగ్ మామ్స్‌ ఇలాంటి ఫ్యాషన్లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

సో.. ఇవండీ పాలిచ్చే తల్లులు ఇటు స్టైలిష్‌గా, అటు సౌకర్యవంతంగా మెరిసిపోవాలంటే ధరించాల్సిన కొన్ని నర్సింగ్‌ ఫ్యాషన్స్‌! మరి, ఇవి కాకుండా మీకు తెలిసిన ఇతర నర్సింగ్‌ వేర్‌, న్యూ మామ్స్‌ డ్రస్సింగ్‌ టిప్స్‌ ఏవైనా ఉంటే ‘వసుంధర.నెట్‌’ వేదికగా పంచుకోండి.. నలుగురికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్