చిరుధాన్యాలు దిద్దిన జీవితం..

బ్యాంకువాళ్లు ఇచ్చిన లోన్‌ కాగితాలని ఎక్కడా తడబడకుండా చకాచకా పూర్తిచేసింది బీబీజాన్‌. తనపక్కన చదువురాక ఆ కాగితాలు నింపడానికి ఇబ్బంది పడుతున్న తోటి ఆడవాళ్లకీ సాయం చేసింది.

Published : 10 Jan 2023 00:06 IST

బ్యాంకువాళ్లు ఇచ్చిన లోన్‌ కాగితాలని ఎక్కడా తడబడకుండా చకాచకా పూర్తిచేసింది బీబీజాన్‌. తనపక్కన చదువురాక ఆ కాగితాలు నింపడానికి ఇబ్బంది పడుతున్న తోటి ఆడవాళ్లకీ సాయం చేసింది. రెండేళ్ల క్రితం వరకూ బ్యాంకు రుణాలపై ఏమాత్రం అవగాహన లేని ఈ గ్రామీణ మహిళ ఇప్పుడు వెయ్యిమంది రైతులకు అండగా నిలిచిన ఓ అగ్రిప్రెన్యూర్‌ అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది...

ధార్వాడ్‌ జిల్లాలోని.. కుందగోళ్‌ తాలూకాలోని తీర్థగ్రామం 38 ఏళ్ల బీబీ జాన్‌ స్వస్థలం. నాలుగేళ్ల క్రితం స్వయం సహాయక బృందంలో సభ్యురాలిగా చేరే అవకాశం ఉందని తెలిసి దరఖాస్తు చేసుకుందా మనుకుంది. అత్తమామలు, భర్త ఒప్పుకోలేదు. ‘ఇలాంటివి మన ఇంటావంటా లేవు. గడప దాటకూడద’న్నారు. ఎంతో శ్రమపడి వాళ్లని ఒప్పించింది. త్వరలోనే ఆ బృందానికి నాయకురాలిగా మారింది. పద్నాలుగు మంది సభ్యులున్న ఆ స్వయం సహాయక బృందాన్ని నడిపిస్తూ... చిరుధాన్యాలని ప్రాసెస్‌ చేసే ఒక యూనిట్‌ని నడిపిస్తోంది. ఇందుకు కావాల్సిన చిరుధాన్యాలని వెయ్యిమంది రైతుల నుంచి సేకరిస్తూ వారికీ ఉపాధి కల్పిస్తోంది. ‘నేను బీఏ చదివా. మా ఊర్లో చాలామంది ఆడవాళ్లు హైస్కూల్‌ కూడా దాటని వాళ్లే. వీళ్లలో చాలామంది వ్యవసాయ కూలీలుగా ఉండేవారు. సాగు లాభ సాటిగా లేకపోవడంతో... వస్త్ర పరిశ్రమల్లో రోజు కూలీలుగా కుదిరారు. వ్యవసాయ పనులకు దూరమైన అలాంటి వాళ్లందర్నీ ఏకం చేసి.. సహజ సమృద్ధ అనే స్వచ్ఛంద సంస్థ.. సహజ వనరుల్ని వాడుకుని ఉపాధి పొందేలా, సొంతంగా తమకాళ్లపై తాము నిలబడేలా శిక్షణ ఇచ్చింది. ఆ సంస్థే పెట్టుబడి పెట్టి చిరు ధాన్యాలని ప్రాసెస్‌ చేసే యూనిట్‌ ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. విద్యుత్‌ వినియోగం తక్కువ. మొదట మూడొందల మంది రైతుల నుంచి చిరుధాన్యాలని కొని ప్రాసెస్‌ చేసి వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేసేవాళ్లం. తర్వాత మాతో కలిసి పనిచేయాలనుకొనే రైతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. విత్తనాల కోసం మరొకరిపై ఆధారపడకుండా సొంతంగా ఒక సీడ్‌ బ్యాంకుని ఏర్పాటు చేసి రైతులకు సాయంగా ఉంటున్నాం. మా నాన్న ఆడపిల్లలకు చదువు ముఖ్యమని భావించారు. అందుకే బీఏ వరకూ చదివించారు. కానీ పెళ్లైన తర్వాత నా చదువు ఎక్కడా అక్కరకు రాలేదు. గ్రూపులో చేరిన తర్వాత మళ్లీ బుక్‌ కీపింగ్‌, లెక్కలు వంటి వన్నీ సొంతంగా నేర్చుకున్నా. మొదట్లో వద్దన్న మావారు ఇప్పుడు నా సామర్థ్యం చూసి మెచ్చుకుంటున్నారు. నాలానే ఎంతో మంది అమ్మాయిలు ఇంటికే పరిమితం అయ్యారు. వాళ్లూ బయటకు రావాలి. సొంతగా ఉపాధి బాట పట్టించాలనేది నా లక్ష్యం’ అంటోంది బీబీ జాన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని