కష్టానికి ప్రోత్సాహం తోడైంది.. కల ఫలించింది!

‘అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు తమను తాము నిరూపించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో ఒకటి, రెండుసార్లు విఫలమైతే.. ఇక చదివింది చాలు.. అని చెప్పే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. అయితే మా అమ్మానాన్న అడుగడుగునా నాకు అండగా నిలిచారు.

Updated : 14 Sep 2021 20:27 IST

(Image for Representation)

‘అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు తమను తాము నిరూపించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షల్లో ఒకటి, రెండుసార్లు విఫలమైతే.. ఇక చదివింది చాలు.. అని చెప్పే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. అయితే మా అమ్మానాన్న అడుగడుగునా నాకు అండగా నిలిచారు. వారి లాగే ఇతరులు కూడా తమ బిడ్డల కలలను సాకారం చేసుకునే అవకాశం ఇవ్వాలి. అది అబ్బాయైనా...అమ్మాయైనా!’ అంటోంది తాజాగా విడుదలైన సీఏ ఫైనల్‌ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన నందిని అగర్వాల్‌.

అమ్మాయిలు అదరగొట్టేశారు!

దేశవ్యాప్తంగా జులైలో జరిగిన సీఏ ఫైనల్‌, ఫౌండేషన్‌ పరీక్షా ఫలితాలను ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’(ICAI) తాజాగా విడుదల చేసింది. సాధారణంగా ఈ పరీక్షల్లో ఎప్పుడూ అబ్బాయిలే ఆలిండియా టాప్‌ ర్యాంకులు సాధిస్తారు. కానీ ఈసారి ట్రెండ్‌ మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అమ్మాయిలు ఆలిండియా టాప్‌ ర్యాంకులు దక్కించుకున్నారు. సీఏ ఫైనల్‌ (కొత్త సిలబస్‌) విభాగంలో నందిని అగర్వాల్‌ (మధ్య ప్రదేశ్‌), సాక్షి ఐరాన్‌ (ఇండోర్‌), సాక్షి రాజేంద్రకుమార్‌ (బెంగళూరు) ఆలిండియా టాప్‌-3 ర్యాంకులు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా సీఏ ఫైనల్‌ (పాత సిలబస్‌) విభాగంలో రూత్‌ క్లేర్‌ డిసిల్వా (మంగళూరు), మాళవిక ఆర్‌ కృష్ణన్‌ (పాలక్కడ్‌) ఆలిండియా టాప్‌-2 ర్యాంకులు దక్కించుకోవడం విశేషం.

అన్నాచెల్లెళ్లకు ఆలిండియా ర్యాంకులు!

మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాకు చెందిన నరేష్‌ చంద్ర గుప్తా- డింపుల్‌ గుప్తా ఇప్పుడు అమితానందంలో మునిగితేలుతున్నారు. ఎందుకంటే వారి ఇద్దరు బిడ్డలు సీఏ ఫైనల్‌ (కొత్త సిలబస్‌) పరీక్షా ఫలితాల్లో ఆలిండియా ర్యాంకులు సాధించారు. వారి కూతురు 19 ఏళ్ల నందిని అగర్వాల్‌ 614/800 మార్కులతో ఆలిండియా టాపర్‌గా నిలిస్తే, 21 ఏళ్ల సచిన్‌ అగర్వాల్‌ 18వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ అన్నాచెల్లెళ్లని ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇదే మా సక్సెస్‌ సీక్రెట్‌!

సీఏ ఫైనల్‌ ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలవడానికి దోహదం చేసిన అంశాల గురించి నందినిని అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ‘అన్నయ్యకు, నాకు రెండేళ్ల ఏజ్‌ గ్యాప్‌ ఉంది. అయితే స్కూల్‌లో చదువుతున్నప్పుడు నేను రెండు తరగతులు జంప్‌ చేసి అన్నయ్య క్లాస్‌లో జాయినయ్యాను. అప్పటి నుంచి కలిసే చదువుకుంటున్నాం. మొదట మొరెనాలోని విక్టర్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తిచేశాం. ఇంటర్‌ కూడా ఒకే కాలేజీలో చదివాం. ఐపీసీసీ (ఇంటిగ్రేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాంపిటెన్సీ కోర్స్‌), సీఏ ఫైనల్‌ పరీక్షలకు కూడా కలిసే ప్రిపేరయ్యాం. ఇక 2018లో మేం సీఏ కోర్సులో చేరాం. పరీక్షలకు సంబంధించి మా స్ట్రాటజీ చాలా సింపుల్‌. ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. తప్పొప్పులపై ఆత్మవిమర్శ చేసుకుంటాం. మాక్‌ టెస్టుల్లో నా పేపర్‌ను అన్నయ్య, తన పేపర్‌ను నేను దిద్దుకునేవాళ్లం. మాక్‌ టెస్టుల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా నేను నెర్వస్‌గా ఫీలయ్యేదాన్ని. ప్రాక్టీస్‌ పరీక్షల్లోనే ఇలా ఉంటే ఫైనల్‌ పరీక్షల్లో విజయం సాధించడం కష్టమనుకునేదాన్ని. ఇలా చాలాసార్లు నాపై నేను నమ్మకం కోల్పోయాను. అప్పుడు అన్నయ్యే అండగా నిలిచాడు. ‘మాక్‌ టెస్టుల ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మళ్లీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తపడు’ అంటూ నాలో సానుకూల దృక్పథం నింపాడు. మేమిద్దరం ఐసీఏఐ స్టడీ మెటీరియల్‌నే ఎక్కువగా ఫాలో అయ్యాం’ అని చెబుతోందీ విన్నర్‌.

నా సోదరే నా మెంటార్‌!

సచిన్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘చెల్లి, నేను చాలాసార్లు గొడవపడినా చదువు దగ్గరకు వచ్చే సరికి మాత్రం తిరిగి కలిసిపోతాం. నిజం చెప్పాలంటే... నందిని నాకు మెంటార్‌. నాకు ఆలిండియా స్థాయిలో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. కానీ చెల్లికి వస్తుందని మాత్రం తెలుసు. ఎందుకంటే తను చాలా తెలివైనది. అంతకుమించి బాగా కష్టపడుతుంది. ఆలిండియా టాప్‌ ర్యాంక్‌కు నందిని అన్ని విధాలా అర్హురాలు’ అని తన చెల్లి విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

అమ్మాయిలపై నమ్మకముంచాలి!

నందిని తండ్రి నరేష్‌ చంద్ర ట్యాక్స్‌ ప్రాక్టీషనర్‌గా పని చేస్తున్నారు. తల్లి డింపుల్‌ గృహిణి. ఈ క్రమంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తన విజయానికి ఒక కారణమంటోంది నందిని. ‘చాలామంది తల్లిదండ్రులు కొడుకుల్ని నమ్మినట్లుగా కూతుళ్లను నమ్మరు అందుకే సీఏ లాంటి కష్టసాధ్యమైన పోటీ పరీక్షల్లో అమ్మాయిల హవా కనిపించదు. ఇంట్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి. వారి శక్తి సామర్థ్యాలు నిరూపించుకునేలా వారిని ప్రోత్సహించాలి. ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలిని. కెరీర్‌కు సంబంధించి నా పేరెంట్స్‌ అన్ని విధాలుగా నాకు సహకరిస్తున్నారు’ అని అంటోందీ ఆలిండియా టాపర్‌.

రోజూ 9 గంటలు చదివాను!

ఇక సీఏ ఫైనల్‌ (పాత సిలబస్‌) పరీక్షా ఫలితాల్లో 59 శాతం మార్కులతో ఆలిండియా టాప్‌ ర్యాంకు సొంతం చేసుకుంది మంగళూరుకు చెందిన రూత్‌ క్లేర్‌ డిసిల్వా. ‘స్కూల్‌ డేస్‌ నుంచే అకౌంటెన్సీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. సీఏలో చేరాలన్న లక్ష్యంతో దూరవిద్యలో బీకాం (ఆనర్స్‌) పూర్తి చేశాను. 2014లో నా సీఏ ప్రయాణం మొదలైంది. ఈ ఆరేళ్లు ఎప్పుడూ నిరాశకు గురికాలేదు. రోజూ కనీసం 8-9గంటలు చదివేదాన్ని. థియరీ సబ్జెక్టులకు సంబంధించి నేను సొంతంగానే నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకున్నా. అదేవిధంగా యూట్యూబ్‌ క్లాసులు వినేదాన్ని. ముఖ్యంగా సీఏలో ఆలిండియా టాప్‌ ర్యాంకులు సాధించిన అన్నదమ్ములు అజయ్‌, అతుల్‌ అగర్వాల్‌ల యూట్యూబ్‌ ఛానెల్‌ను బాగా ఫాలో అయ్యాను. ఇక ఆడిట్‌ సబ్జెక్టు కోసం సీఏ వికాస్‌ ఓస్వాల్‌, డైరెక్ట్‌ ట్యాక్స్‌ కోసం సీఏ భావర్‌ బోరానా, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్ కోసం యోగేందర్‌ బంగర్‌ పుస్తకాలు చదివా. కరోనా సమయంలో కొంచెం ఆందోళనకు గురైనా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యాను. సీఏ ఫలితాల్లో గత కొన్నేళ్లుగా అబ్బాయిలదే హవా. కానీ ఈ ఏడాది మాత్రం అమ్మాయిలే ఆలిండియా టాప్‌ ర్యాంకులు సాధించారు. కాలం మారుతున్నట్లే తల్లిదండ్రులు కూడా తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నారు. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది డిసిల్వా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్