MSME Awards: వ్యాపారంలో రాణిస్తున్న ‘వండర్‌ విమెన్’!

వ్యాపారమంటే మాటలు కాదు.. లాభనష్టాలు, విమర్శలు-సవాళ్లు ఎదుర్కొంటూ.. ఒడిదొడుకుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. మార్కెట్లో పోటీని తట్టుకొని తమవైన బిజినెస్‌ వ్యూహాలతో వ్యాపారాన్ని లాభాల బాట....

Updated : 11 Jul 2023 16:18 IST

(Photos: LinkedIn)

వ్యాపారమంటే మాటలు కాదు.. లాభనష్టాలు, విమర్శలు-సవాళ్లు ఎదుర్కొంటూ.. ఒడిదొడుకుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. మార్కెట్లో పోటీని తట్టుకొని తమవైన బిజినెస్‌ వ్యూహాలతో వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాలి.. పరోక్షంగా దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించాలి. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రతిభావంతుల్ని గుర్తించి.. ఏటా అవార్డులు ప్రదానం చేస్తుంటుంది ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల సంస్థ ట్యాలీ. ఇటీవలే ‘అంతర్జాతీయ ఎంఎస్‌ఎంఈ దినోత్సవా’న్ని పురస్కరించుకొని.. ఈ ఏడాది పురస్కార విజేతల్ని ప్రకటించిందీ సంస్థ. నాలుగు జోన్లు, ఐదు కేటగిరీల్లో మొత్తం 100 మంది ఈ పురస్కారం కోసం ఎంపిక కాగా.. అందులో 25కి పైగా మహిళా వ్యాపారవేత్తలున్నారు. వీరిలో కొంతమంది ‘వండర్ విమెన్’ గురించి, వారి వ్యాపార ప్రయాణం గురించి తెలుసుకుందాం రండి..

వ్యాపారానికి సాంకేతికతను జోడిస్తూ..!

వ్యాపారం చిన్నదైనా, పెద్దదైనా.. అది అభివృద్ధి చెందాలంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పాత్ర కీలకంగా మారింది. అయితే పెద్ద సంస్థలకు సాంకేతిక వనరుల పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు.. కానీ చిన్న చిన్న వ్యాపారాలు ఇందుకు భిన్నం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు సాంకేతిక ప్రయోజనాల్ని అందిస్తూ వాటి అభివృద్ధికి పాటుపడుతోంది కోల్‌కతాకు చెందిన అబంతీ సేన్‌. ఈ ఆలోచనతోనే 2016లో ‘బిజ్‌మ్యాన్‌ వెబ్‌’ పేరిట ఓ ఐటీ సేవలు, కన్సల్టింగ్‌ సేవల సంస్థను ప్రారంభించిందామె. చిన్న చిన్న వ్యాపారాలకు వారి అవసరాలకు తగినట్లుగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించడం, CRM (వినియోగదారుల సేవలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌), ERP (సంస్థ రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌).. ఇంటెలిజెంట్‌ డిజిటల్‌ టెక్నాలజీ తయారీ.. తదితర సేవలందిస్తోందీ సంస్థ. అంతేకాదు.. ఆయా వ్యాపారాలకు సవాళ్లుగా మారిన సమస్యల్ని గుర్తించి.. వాటికి పరిష్కారంగా ఈ-కామర్స్‌, వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ .. వంటివి అభివృద్ధి చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఆరేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10కి పైగా దేశాల్లో, దాదాపు 100కు పైగా ఎంఎస్‌ఎంఈ సంస్థలకు సాంకేతిక సేవల్ని అందించిన అబంతి.. విశ్వసనీయత, పరిపూర్ణత, వినియోగదారుల సంతృప్తి.. వంటివి ప్రధాన విలువలుగా భావించి సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామంటున్నారు.

ముంబయిలోని NMIMS విశ్వవిద్యాలయంలో చదువు పూర్తిచేసుకున్న అబంతికి.. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, సప్లై చెయిన్‌, ప్రాసెస్‌ రీ-ఇంజినీరింగ్‌, డేటా.. వంటి అంశాల్లో పట్టుంది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ప్రపంచవ్యాప్తంగా పలు వేదికలపై జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆమె.. 2021లో ‘ఇండియన్‌ అఛీవర్స్‌ అవార్డు’ అందుకుంది.


‘లేఖ’ల ఉనికి చాటుతున్నారు!

ఈ రోజుల్లో సందేశమైనా, సమాధానమైనా.. ఆన్‌లైన్‌లో క్షణాల్లో చేరిపోతుంది. దీంతో ఈ డిజిటల్‌ యుగంలో లేఖలు దాదాపుగా కనుమరుగైపోయాయని చెప్పచ్చు. ఇలాంటి తరుణంలో ఇటు లేఖల ఉనికిని చాటుతూ, అటు ఎంతోమందికి డిజిటల్‌ డీటాక్స్‌నీ అందిస్తున్నారు హర్నేమత్‌ కౌర్, శివానీ మెహ్తా అనే ఇద్దరు స్నేహితులు. చిన్నతనం నుంచే లేఖలు రాయడంపై ఆసక్తి చూపే వీరిద్దరూ.. పెరిగి పెద్దయ్యే క్రమంలోనూ ఇదే ట్రెండ్‌ని కొనసాగించారు. ఇక 2013లో అహ్మదాబాద్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌’లో చదువుకునే రోజుల్లోనూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు లేఖల ద్వారానే టచ్‌లో ఉండేవారు. ఈ ఆసక్తే వారితో 2016లో ‘ఢాక్‌రూమ్‌’ అనే కార్నివాల్‌ను  ప్రారంభించేందుకు దోహదం చేసింది. పిల్లల్ని, పెద్దల్ని సృజనాత్మకంగా లేఖలు రాసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించే వేదిక ఇది. ఇందులో భాగంగా పోటీలు, ఈవెంట్లు, వర్క్‌షాప్స్‌, పోస్టల్‌ శాఖ వారితో డెమోలు వంటివి నిర్వహిస్తూ.. అందరినీ లేఖలు రాసేలా ప్రోత్సహిస్తున్నారు. వీటితో పాటు క్యాలిగ్రఫీ, ఆరిగామీ, గ్రాఫాలజీ, పోస్ట్ కార్డులను సృజనాత్మకంగా తయారు చేయడం.. వంటి అంశాల్లోనూ ఔత్సాహికుల్ని ప్రోత్సహిస్తున్నారీ ఇద్దరు మిత్రులు. ఈ లేఖలు డిజిటల్‌ డీటాక్స్‌ని అందిస్తూ.. ఏ మాధ్యమం ఇవ్వని అనుభూతుల్ని మన సొంతం చేస్తాయంటున్నారు శివానీ-కౌర్‌. ‘ప్రపంచంలోనే అతి పెద్ద లెటర్‌ రైటింగ్‌ కార్నివాల్‌’గా పేరుపొందిన ఈ వేదిక ద్వారా ఇప్పటివరకు.. పలువురు వివిధ ఈవెంట్లలో రాసిన లేఖలు 5 లక్షలకు పైమాటే!


చాక్లెట్లకు కేరాఫ్‌ అడ్రస్!

తన అసలు పేరు కంటే చాక్లెటియర్‌ స్మృతీ భాటియాగానే గుర్తింపు పొందింది నోయిడాకు చెందిన స్మృతి. చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన ఆమె.. చాక్లెట్ల తయారీపై తనకున్న మక్కువను వ్యాపార సూత్రంగా మలచుకుంది. ఈ క్రమంలోనే 2010లో ‘స్మృతీస్‌ చాకోహౌస్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించిందామె. వినియోగదారుల కోరిక మేరకు కస్టమైజ్‌డ్‌ చాక్లెట్స్‌ తయారుచేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. పాలు, పాల పదార్థాలు పడని వారి కోసం వీగన్‌, గ్లూటెన్‌ రహిత పదార్థాలతో ప్రత్యేక చాక్లెట్స్‌ తయారుచేస్తూ ఆరోగ్యాన్ని పంచుతోందామె. విభిన్న థీమ్స్‌, ఫ్లేవర్స్‌లో చాక్లెట్స్‌ తయారుచేస్తూ, వాటికి చేతి నైపుణ్యాలను జోడిస్తూ.. సరికొత్త హంగులద్దుతోంది స్మృతి. మరోవైపు ఈ కళను నలుగురికీ చేరువ చేసేలా.. వర్క్‌షాప్స్‌, గేమ్స్, పార్టీలు.. వంటి ఈవెంట్లూ నిర్వహిస్తోందామె. ‘SIABAZ’ అకాడమీని నెలకొల్పి.. ఈ వేదికగా ఔత్సాహికులకు చాక్లెట్‌ తయారీలో శిక్షణ కూడా ఇస్తోంది స్మృతి. మరోవైపు వీటి ప్యాకింగ్‌లోనూ పర్యావరణహిత పద్ధతుల్ని అనుసరిస్తూ.. ఎకో-వారియర్‌గానూ పేరుతెచ్చుకుందామె. ఇలా తనలోని చాక్లెట్‌ సృజనాత్మకతకు గుర్తింపుగా పలు అవార్డులూ అందుకున్న ఈ చాక్లెట్‌ లవర్‌.. మన జీవితంతో చాక్లెట్లకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ ‘ది చాక్లెట్‌ అల్ఫాబెట్‌’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని