Abi Kalyan: నా సమస్యనే...వ్యాపారంగా మలుచుకున్నా!

అత్తారింట్లో పడ్డ కష్టాలు ఆమెలో స్వతంత్రంగా జీవించడానికి కావాల్సిన ఆశలు రేపితే.. తల్లైన కొత్తల్లో తనకెదురైన అసౌకర్యం ఆమెకి సరికొత్త వ్యాపార ఆలోచన అందించింది.

Updated : 05 May 2023 13:36 IST

అత్తారింట్లో పడ్డ కష్టాలు ఆమెలో స్వతంత్రంగా జీవించడానికి కావాల్సిన ఆశలు రేపితే.. తల్లైన కొత్తల్లో తనకెదురైన అసౌకర్యం ఆమెకి సరికొత్త వ్యాపార ఆలోచన అందించింది. పాలిచ్చే తల్లులకోసం ప్రత్యేకంగా దుస్తులు రూపొందిస్తున్న అబి కల్యాణ్‌ తన గెలుపు కథని వసుంధరతో పంచుకున్నారు..

డపదాటి కాలు బయట పెట్టడానికే ఆలోచించిన నేను వ్యాపారవేత్తగా మారానంటే నాకూ ఆశ్చర్యంగానే ఉంటుంది. మాది చెన్నై. నాన్న కళ్యాణ సుందరం ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌. అమ్మ జయచంద్ర మేకప్‌ నిపుణురాలు. చదువు పూర్తవుతూనే పెళ్లైంది. నా కష్టాలు అక్కడ్నుంచే మొదలయ్యాయి. వాళ్లకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అసలు బయటకు వెళ్లడమే నచ్చేది కాదు. అందుకే ముందు జాగ్రత్తగా నా సర్టిఫికేట్లన్నీ దగ్గర పెట్టుకున్నారు. మా బాబు పుట్టాక నా కష్టాలు రెట్టింపయ్యాయి. ఇక భరించలేక బాబుని తీసుకొని పుట్టింటికి వచ్చేశా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నాతో చదువుకున్న స్నేహితులందరూ స్థిరపడ్డారు. నేనే ఏదీ సాధించలేకపోయాననిపించేది. నిజానికి నాకు డిజైనింగ్‌ అంటే ఇష్టం. కానీ అమ్మానాన్నల మాట కాదనలేక ఇంజినీరింగ్‌ చేశా. ఇకనైనా నాకు నచ్చినట్టుగా చేద్దాం అంటే చేతిలో పైసా లేదు. పోనీ ఉద్యోగానికెళదామంటే సర్టిఫికెట్లూ లేవు. రెండేళ్లు పోరాడితే అవి వెనక్కి వచ్చాయి. అలా 36 ఏళ్ల వయసులో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఐటీ కొలువు వచ్చింది. కానీ డిజైనింగ్‌వైపే నా మనసు మళ్లింది. అందుకే నా నగలు అమ్మేసి.. వచ్చిన రూ.2 లక్షలతో దుస్తుల డిజైనింగ్‌ మొదలుపెట్టా. 

ఇబ్బందిగా అనిపించి..

మార్కెట్లో డిజైనర్‌ సంస్థలు చాలానే ఉన్నాయి. మరి నా ప్రత్యేకత ఏంటి అని ఆలోచించినప్పుడు నా అనుభవమే ఇక్కడ ఉపయోగపడింది. మా బాబు పుట్టినప్పుడు దుస్తుల విషయంలో చాలా ఇబ్బందిపడ్డా. సరైన నైటీలు దొరికేవి కావు. నాసిరకంగా ఉండేవి. అన్నింటికి మించి పాలిచ్చేటప్పుడు చాలా అసౌకర్యంగా ఉండేది. అది నా ఒక్కరి సమస్యే కాదని తర్వాత తెలిసింది. ప్రసవం తర్వాత పాపాయి సంరక్షణతో అమ్మలకు నిద్ర ఉండదు. హార్మోన్ల ఇబ్బందులుంటాయి. ఆందోళనగా ఉంటారు. పాలివ్వడానికి దుస్తులు అనుకూలంగా ఉండవు. చాటుకు వెళ్లాలి. ఇవన్నీ ఆలోచించుకొనే 2019లో ‘తొట్టిల్‌’ ప్రారంభించా. తమిళంలో దీనర్థం.. ఊయల. అమ్మానాన్నలు వద్దన్నా పట్టుదలగా ప్రారంభించా. తెలిసిన టైలర్‌తో నేను డిజైన్‌ చేసిన నైటీ, గౌన్లు కుట్టించి మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టా. మొట్టమొదటి ఆర్డరు వచ్చినప్పుడు ఎగిరి గంతేశా. మరికొన్ని మోడళ్లు పెట్టగానే అవీ అమ్ముడయ్యాయి. దీనికితోడు తల్లుల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ రావడంతో నాపై నాకు నమ్మకం వచ్చింది.  

కొవిడ్‌లో..

కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొవిడ్‌ మొదలైంది. ఎక్కడి సరకు అక్కడే ఉండిపోయింది. ఏం చేయాలో తోచలేదు. అయినా సరే నలుగురైదుగురు టైలర్లకు నా ఆలోచన చెప్పి అవుట్‌ఫిట్స్‌ కుట్టించా. లాక్‌డౌన్‌ పూర్తయ్యేసరికి నాదగ్గర డిజైన్లు పోగుపడ్డాయి. వాటిని ఇన్‌స్టాలో ఉంచిన వెంటనే ఆర్డర్లు రావడం మొదలైంది. డిజైన్‌ నుంచి ప్యాకింగ్‌, డోర్‌ డెలివరీ లేదా కొరియర్‌ చేయడం వరకు అన్నీ స్వయంగా నేనే చేసేదాన్ని. ఏడాదికల్లా ఆర్డర్లు పెరిగాయి. ఇప్పుడు నాదగ్గర 25మందికిపైగా టైలర్లు, 15మంది సిబ్బంది ఉన్నారు. తల్లులకు కావాల్సిన గౌనులు, మాక్సీ, టాప్స్‌ వంటివి 300 రకాలకుపైగా డిజైన్‌ చేశా. దేశవ్యాప్తంగా మా ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, దుబాయి, లండన్‌లకూ ఎగుమతి చేస్తున్నాం. వారానికి ఒకటీరెండూ సేల్‌ అయ్యే స్థాయి నుంచి ఇప్పుడు వారానికి 100కుపైగా ఆర్డర్లున్నాయి. వస్త్రం ఎంపికలో నాణ్యతకు పెద్దపీట, వినియోగదారుల అవసరానికి తగ్గట్లు డిజైన్ల రూపకల్పన నా విజయ రహస్యం. ఇన్‌స్టాలో లక్షమంది ఫాలోయర్స్‌ చెప్పే థ్యాంక్యూ మెసేజ్‌లు నాలో ఉత్సాహాన్ని నింపుతుంటాయి. చెన్నైలో మాకు అవుట్‌లెట్‌ ఉంది. త్వరలో హైదరాబాద్‌, వైజాగ్‌లోనూ ప్రారంభించనున్నాం.

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని