Captain Zoya : అప్పుడు అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి!

ఎనిమిదేళ్ల వయసులో నింగిలోని చుక్కల్ని చూసి పైలట్‌గా మారాలనుకుందామె. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా తన కలను సాకారం చేసుకుంది. ఇది చాలదన్నట్లు అతి చిన్న వయసులోనే బోయింగ్‌ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ఇక గతేడాది 17 గంటల పాటు ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించిన......

Published : 20 Aug 2022 18:06 IST

(Photo: Instagram)

ఎనిమిదేళ్ల వయసులో నింగిలోని చుక్కల్ని చూసి పైలట్‌గా మారాలనుకుందామె. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా తన కలను సాకారం చేసుకుంది. ఇది చాలదన్నట్లు అతి చిన్న వయసులోనే బోయింగ్‌ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ఇక గతేడాది 17 గంటల పాటు ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించిన విమానానికి సారథ్యం వహించి సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇలా ఎయిర్‌ ఇండియా కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు అందుకున్న జోయా అగర్వాల్‌ తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గం (ఉత్తర ధ్రువం) మీదుగా ఏకధాటిగా విమానం నడిపినందుకు గానూ ‘శాన్‌ఫ్రాన్సిస్కో ఏవియేషన్‌ మ్యూజియం, లైబ్రరీ’లో తాజాగా చోటు దక్కించుకుంది జోయా. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిందీ లేడీ పైలట్‌. ఇది తనకు మరపురాని గౌరవం అంటోన్న జోయా.. అసలు తన పైలట్‌ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించిందో తెలుసుకుందాం రండి..

సాహసానికి సన్మానం!

సాధారణంగా ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడపాలంటే ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఈ మార్గంలో విమానాలు నడిపేటప్పుడు తమ విమానయాన సంస్థలు ఎంతో అనుభవమున్న పైలట్లనే ఎంచుకుంటాయి. అయితే గతేడాది జనవరిలో మరో నలుగురు మహిళా పైలట్లను వెంటపెట్టుకుని ఏకధాటిగా 17 గంటల పాటు ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపి చరిత్ర సృష్టించింది జోయా అగర్వాల్. ఈ క్రమంలో సుమారు 250 మంది ప్రయాణికుల్ని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు సురక్షితంగా చేర్చింది. ఇలా భూమి నుంచి 34 వేల అడుగుల ఎత్తులో.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గాన్ని దాటిన ఆమె పేరు అప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే తాను సాధించిన ఈ ఘనతకు గుర్తింపుగా తాజాగా ‘శాన్‌ఫ్రాన్సిస్కో ఏవియేషన్‌ మ్యూజియం, లైబ్రరీ’లో జోయాకు చోటుదక్కింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, తొలి వ్యక్తిగా కీర్తి గడిచిందీ డేరింగ్‌ పైలట్‌.

గొప్ప క్షణం ఇది!

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో 1980లో ప్రారంభమైన ఈ మ్యూజియంలో.. వాణిజ్య విమానయాన చరిత్రకు సంబంధించిన పురాతన వస్తువులు, ఫొటో గ్యాలరీలు వీక్షకుల సందర్శన కోసం ఏర్పాటుచేశారు. అయితే ఇందులో ఓ వ్యక్తికి స్థానం కల్పించడం ఇదే మొదటిసారి కావడం, అదీ జోయాకు దక్కడం విశేషం. అందుకే తాను ప్రస్తుతం పట్టరానంత సంతోషంలో ఉన్నానంటోందీ లేడీ పైలట్‌. ‘ఈ ప్రతిష్టాత్మక మ్యూజియంలో నాకు స్థానం దక్కినందుకు నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఒకప్పుడు డాబాపై కూర్చొని నక్షత్రాల్ని చూస్తూ పైలట్‌ కావాలని కలలు కన్న నేను.. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానంటే నమ్మలేకపోతున్నా. ఏదేమైనా ఇది నాకు, మన దేశానికి ఓ గొప్ప క్షణం!’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది జోయా.

అమ్మానాన్న భయపడ్డారు!

సాధారణంగా ఇంట్లో ఒక కూతురు/కొడుకు ఉంటే ఎంతో గారాబం చేస్తాం.. వారిని కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా చూసుకుంటాం. వారేదైనా సాహసం చేస్తామంటే వారికేమవుతుందోనన్న భయంతో అస్సలు ఒప్పుకోం. కొంతమంది తల్లిదండ్రులైతే మరీ భయపడిపోయి ఏడ్చేస్తుంటారు కూడా! తాను పైలట్‌ అవుతానని చెప్పినప్పుడు తన తల్లి కూడా ఇలాగే బాధపడిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది జోయా.

‘మా అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే సంతానం. దాంతో ఎంతో అల్లారుముద్దుగా పెరిగా. సాధారణంగా ఒక కూతురు/కొడుకు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్లే నా పేరెంట్స్‌ కూడా నా విషయంలో ఎంతో కేరింగ్‌గా ఉంటారు. అయితే నాకేమో సాహసాలు చేయడమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఈ క్రమంలోనే పెద్దయ్యాక పైలట్‌ కావాలని చిన్నతనం నుంచి కలలు కనేదాన్ని. ఇదే విషయాన్ని ఓ రోజు అమ్మకి చెబితే భయపడింది. నాకేమవుతుందోనని ఒక్కసారిగా ఏడ్చేసింది. నాన్న కూడా ‘అంత శక్తి మనకెక్కడిదమ్మా’ అని నిట్టూర్చాడు. అయితే కొన్నాళ్లకు అమ్మే నా లక్ష్యాన్ని, తపనను అర్థం చేసుకుంది. ఈ దిశగా నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టింది..’

ఇంటర్వ్యూకు ముందు నాన్నకు గుండెపోటు!

‘ఈ క్రమంలో డిగ్రీ చదువుతూనే ఏవియేషన్‌ కోర్సు పూర్తి చేశాను. అయితే ఈ కోర్సు పూర్తయ్యాక రెండేళ్ల పాటు ఖాళీగా ఉన్నాను. అప్పుడే ఎయిర్‌ ఇండియాలో పోస్టులు పడ్డాయని తెలిసి ఎంతో సంతోషించాను. అయితే కేవలం 7 పోస్టులకు మూడు వేలమంది దరఖాస్తు చేశారని తెలిసి మొదట ఆందోళన చెందాను.. అయినా పట్టుదలతో ముందుకు సాగాను. ఇక ముంబయిలో నాలుగు రోజుల్లో ఇంటర్వ్యూ ఉందనగా నాన్నకు గుండెనొప్పి వచ్చింది. అయినా నాన్న ‘జోయా.. నువ్వు ముంబయికి వెళ్లు. ఇంటర్వ్యూలో విజయం సాధించి తిరిగిరా!’ అంటూ ఆశీర్వదించి పంపారు.’

అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి!

‘అలా అమ్మానాన్నల ప్రోత్సాహంతో అన్ని అడ్డంకులు దాటి ఎయిర్‌ ఇండియా అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందుకున్నాను. 2004లో దుబాయికి మొదటి ఫ్లైట్‌ నడిపి చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాను. ఆ తర్వాత నేను వెనుదిరిగి చూడలేదు. 2013లో బోయింగ్‌-777ను కూడా నడిపాను. ఇక నాకు పైలట్‌ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్‌ వచ్చినప్పుడు అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి. ఒకప్పుడు ఈ రంగంలో చేరతానంటే బాధతో నిండిన ఆమె కళ్లలో అప్పుడు నాకు ధైర్యం కనిపించింది. ఇక కరోనా సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన ‘వందే భారత్‌ మిషన్‌’లో వేలాదిమంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేర్చాను. అదేవిధంగా గతేడాది ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడిపాను. ఇవన్నీ నా జీవితంలో మర్చిపోలేని విజయాలు..’ అంటోందీ సాహస పైలట్‌.

గతేడాది ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన జోయా.. భవిష్యత్‌ తరాల సమానత్వం కోసం తన వంతు కృషి చేస్తోంది. ఇలా తన విజయాలతోనే కాదు.. ‘అమ్మాయిలూ.. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. మీరు కూడా మీ కలల వైపు ధైర్యంగా అడుగేయండి. ఈ ప్రపంచమే మీకు తోడుగా నిలుస్తుంది... ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయద్దు. మన జీవితాన్ని అందంగా మార్చుకునేందుకు మనకేది ఉత్తమమో అది సాధించి తీరాలి..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోందీ కెప్టెన్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్