ఛీజ్‌తో ప్రయోగాలు.. ‘ప్రపంచ’ గుర్తింపు తెచ్చిపెట్టాయ్!
పిజ్జా, బర్గర్, పాస్తా.. వీటిపై కాస్త ఛీజ్ చల్లుకొని తీసుకుంటే ఆ రుచే వేరు. ఇందులో మనకు తెలిసినవి కొన్ని రకాలే! కానీ ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ఛీజ్ వెరైటీలున్నాయి. అలాంటి విభిన్న ఛీజ్ రకాల్ని మన దేశంలో తయారుచేస్తూ ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్నారు మౌసమ్ నారంగ్.
(Photos: Instagram)
పిజ్జా, బర్గర్, పాస్తా.. వీటిపై కాస్త ఛీజ్ చల్లుకొని తీసుకుంటే ఆ రుచే వేరు. ఇందులో మనకు తెలిసినవి కొన్ని రకాలే! కానీ ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ఛీజ్ వెరైటీలున్నాయి. అలాంటి విభిన్న ఛీజ్ రకాల్ని మన దేశంలో తయారుచేస్తూ ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్నారు మౌసమ్ నారంగ్. చిన్నతనం నుంచి ఛీజ్ లవర్ అయిన ఆమె.. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకుండా ప్రాచీన పద్ధతుల్లో వీటిని తయారుచేస్తూ ఎంతోమంది అభిమానం చూరగొన్నారు. ఈ ఆదరణే ఆమెను తాజాగా ‘ప్రపంచ ఛీజ్ అవార్డ్స్ - 2023’లో టాప్-4వ స్థానంలో నిలబెట్టింది. ఇక ఈ అవార్డుల్లో మూడు విభాగాల్లో బంగారు పతకాలు అందుకున్న మౌసమ్ ఛీజ్ జర్నీ ఎలా మొదలైందో తెలుసుకుందాం..
మౌసమ్ నారంగ్ ముంబయిలో పుట్టి పెరిగారు. యూకేలో హెచ్‌ఆర్ విభాగంలో మాస్టర్స్ పూర్తిచేసిన ఆమె.. పలు జర్మన్ సంస్థల్లో 8 ఏళ్ల పాటు పనిచేశారు. చాలామంది పిల్లల్లాగే తాను కూడా చిన్నతనంలో ఛీజ్‌ను ఇష్టపడేవారు మౌసమ్. ‘ఛీజ్ అంటే నాకు చాలా ఇష్టం. అదెంతలా అంటే.. నేను బర్మింగ్‌హామ్‌లో పనిచేసేటప్పుడు బ్రెడ్-ఛీజ్ ఎక్కువగా తీసుకునేదాన్ని. ఈ క్రమంలోనే అక్కడ దొరికే విభిన్న ఛీజ్ రకాల గురించి తెలుసుకొని దానిపై మరింత ప్రేమ పెంచుకున్నా. ఆ ఛీజ్ వెరైటీలతో నా ఫ్రిజ్‌ని నింపేసేదాన్ని..’ అంటూ ఛీజ్ అంటే తనకెంతిష్టమో చెబుతున్నారు మౌసమ్.
అభిరుచిగా మొదలుపెట్టి..!
ఆపై కొన్నేళ్లకు ఇండియాకు తిరిగొచ్చిన ఆమెకు అక్కడ దొరికినన్ని ఛీజ్ వెరైటీలు ఇక్కడ లభించలేదు. దీంతో తనే సొంతంగా ఛీజ్ తయారుచేయడం మొదలుపెట్టానంటున్నారు మౌసమ్.
‘బర్మింగ్‌హామ్‌లో ఉన్నప్పుడే ఛీజ్ తయారీలో చిన్న చిన్న మెలకువలు నేర్చుకున్నా. ఇండియాకు తిరిగొచ్చాక అక్కడున్నన్ని ఛీజ్ వెరైటీలు ఇక్కడ నాకు కనిపించలేదు. పైగా నాణ్యమైన ఛీజ్ కూడా దొరికేది కాదు. దీంతో నాకున్న నైపుణ్యాలతో ఇంట్లోనే ఛీజ్-బ్రెడ్ తయారుచేసేదాన్ని. వాటిని స్నేహితులకు, తెలిసినవాళ్లకు ఇచ్చేదాన్ని. ఆ రుచి వాళ్లకు నచ్చడంతో దీన్నే వ్యాపారంగా మలచుకోవాలన్న ఆలోచన వచ్చింది. అలా 2015లో ‘Eleftheria Cheese’ పేరుతో సంస్థను ప్రారంభించా. అయితే అమ్మానాన్నలు మాత్రం నేను దీన్నో అభిరుచిగానే తయారుచేస్తున్నానని అనుకునేవారు. ఇక ఉద్యోగం వదిలేసి పూర్తిగా వ్యాపారంలోకి వచ్చినప్పుడు ఇదంత లాభసాటి బిజినెస్ కాదేమోనని కాస్త కంగారు పడ్డారు. కానీ క్రమంగా వ్యాపారంలో నిలదొక్కుకునే కొద్దీ నన్ను మరింత ప్రోత్సహించడం ప్రారంభించారు..’ అంటున్నారు మౌసమ్.
మెలకువలు నేర్చుకొని..!
అయితే ఛీజ్ తయారీ అంటే అంత సులభమైన విషయం కాదు.. దానికి కావాల్సిన ముడిసరుకులు అందుబాటులో ఉండాలి.. విభిన్న రకాల ఛీజ్ తయారీ పద్ధతులూ తెలిసుండాలి. అందుకే సంస్థ ప్రారంభించే క్రమంలోనే వీటన్నింటి గురించి అవపోసన పట్టానంటున్నారు మౌసమ్.
‘మన దేశం ప్రపంచంలోనే పాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి. అయినా ఛీజ్ తయారీకి కావాల్సిన నాణ్యమైన పాల గురించి ఈ ముంబయి చుట్టుపక్కల చాలానే వెతికాను. ఇక ఛీజ్ తయారీలో వాడే వివిధ రకాల పదార్థాలూ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునేదాన్ని. తొలుత విభిన్న రకాల ఛీజ్ వెరైటీల గురించి పుస్తకాల్లో చదివి, ఆన్‌లైన్‌లో తెలుసుకొని నేనే సొంతంగా తయారుచేసేదాన్ని. ఒక్కోసారి నా ప్రయత్నం విఫలమయ్యేది. దీంతో ఛీజ్ తయారీ మెలకువలు నేర్చుకోవడానికి ఇటలీ వెళ్లాను. ఇక తిరిగొచ్చాక కొంతమంది ఛీజ్ తయారీదారులతో ఓ బృందంగా ఏర్పాటుచేశాను. వాళ్లందరికీ వివిధ రకాల ఛీజ్‌లను తయారుచేయడంపై శిక్షణ ఇచ్చా. ఇలా తొలుత నేను, నా బృందం తయారుచేసిన ఛీజ్‌ను కొన్ని రెస్టరంట్లకు, కెఫేకు అందించేవాళ్లం. అయితే మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురైనా.. నచ్చిన వ్యాపారంలోకొచ్చానన్న సంతృప్తే ఇవన్నీ అధిగమించేలా చేసింది..’ అంటున్నారీ ఛీజ్ లవర్.
అక్కడి రుచులు.. ఇక్కడ!
ప్రస్తుతం పాలు (ఆవు/మేక), ఛీజ్ కల్చర్స్, ఎంజైమ్స్, ఉప్పు.. ఈ నాలుగు ప్రధాన ముడి సరుకులతో విభిన్న రకాల ఛీజ్‌లను తయారుచేస్తున్నారు మౌసమ్. ముఖ్యంగా ప్రాచీన ఛీజ్ తయారీ పద్ధతుల్ని ఉపయోగించి.. విభిన్న రకాల హ్యాండ్‌మేడ్ కళాకృతుల్లో ఛీజ్‌ను రూపొందించడంలో ఆమె దిట్ట. ఈ క్రమంలోనే బర్నోస్ట్ (నార్వే), కోణార్క్ (ఫ్రెంచ్ Tomme స్టైల్ ఛీజ్), మెడాలియన్ (గ్రీస్), బురాటా (ఇటలీ), మొజరెల్లా (ఇటలీ).. ఇలా ఆయా దేశాల సంప్రదాయ ఛీజ్‌ల స్ఫూర్తితో వివిధ రకాల ఛీజ్‌లు తయారుచేస్తూ ఎంతోమంది మనసు దోచుకుంటున్నారామె.
‘హ్యాండ్‌మేడ్ ఛీజ్‌ను ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేయడం వల్ల పాలల్లోని ప్రొటీన్లు, ఇతర పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. దీనివల్ల శాకాహారులకు ఎక్కువ మొత్తంలో ప్రొటీన్లు అందుతాయి. అలాగే పిజ్జాకు మొజరెల్లా, గ్రిల్డ్ ఛీజ్ శాండ్‌విచ్‌లకు చెద్దార్.. ఇలా ఒక్కో రకమైన ఛీజ్ ఒక్కో ఆహారానికి అదనపు రుచిని అందిస్తుంది..’ అంటోన్న మౌసమ్ తన సంస్థ వేదికగా వివిధ రకాల బటర్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
క్రెడిటంతా వారిదే!
ఆయా దేశాల సంప్రదాయ ఛీజ్‌లను ప్రాచీన పద్ధతుల్లో, హ్యాండ్‌మేడ్‌గా రూపొందిస్తూ.. జాతీయంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి దగ్గరయ్యారు మౌసమ్. ఇలా ఛీజ్ తయారీలో తనదైన మార్క్‌ని ప్రదర్శిస్తోన్న ఆమె.. ప్రపంచ పటంలో భారత్‌ను ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టారు. ఈ క్రమంలోనే 2021లో ప్రతిష్టాత్మక ‘ప్రపంచ ఛీజ్ అవార్డు’ల్లో పోటీ పడ్డ ఆమె.. బ్రౌన్ ఛీజ్ కేటగిరీలో రజతం గెలుచుకున్నారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారామె. ఇక తాజాగా మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటారు మౌసమ్. ఈ ఏడాది ‘ప్రపంచ ఛీజ్ అవార్డు’ల్లో భాగంగా మూడు విభాగాల్లో బంగారు పతకాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే బర్నౌస్ట్ ఛీజ్‌కు - సూపర్ గోల్డ్, కోణార్క్ ఛీజ్‌కు - గోల్డ్, మెడాలియన్ ఛీజ్‌కు - గోల్డ్ పతకాలు దక్కాయి. ఇలా ఈసారి ఈ పోటీల్లో టాప్-4లో నిలిచారు మౌసమ్.
‘ఇది నా ఒక్కదాని ఘనతే కాదు.. మా వద్ద పనిచేసే ఛీజ్ తయారీదారులు, మాకు పాలు/ఇతర ముడి సరుకులు అందిస్తోన్న పాల వ్యాపారులు, మమ్మల్ని ఆదరిస్తోన్న వినియోగదారులు.. వీరందరి వల్లే ఈ విజయం, గుర్తింపు దక్కాయి..’ అంటూ తనలోని నిరాడంబరతను చాటుకుంటోన్న ఈ ఛీజ్ లవర్.. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఛీజ్ వెరైటీల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.