Published : 16/08/2022 16:28 IST

Renuka Thakur: నాన్న చనిపోయినా.. ఆయన కలను అలా నెరవేర్చింది!

ఆటలో.. అదీ ఓ మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయి రాణించడమంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి.. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించాలి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే కుటుంబ పెద్ద దూరమైతే.. ఆ అమ్మాయి పరిస్థితేంటి? ఆమె ఆశయం ఏం కావాలి? యువ మహిళా క్రికెటర్‌ రేణుకా సింగ్‌ థాకూర్‌ జీవితంలోనూ ఇలాంటి ఎత్తుపల్లాలెన్నో ఉన్నాయి. కానీ వీటిని అధిగమించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని బలంగా నమ్మిందామె. తన కూతురిని క్రికెటర్‌గా చూడాలన్న తన తండ్రి ఆశయాన్ని తన భుజాలపై మోసింది. ఆయన కాలం చేసినా కల నెరవేర్చుకొని.. ‘నాన్న ఏ లోకాన ఉన్నా నన్ను చూసి సంతోషిస్తాడు’ అంటున్న రేణు.. ఇటీవలే ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అందుకే తాజాగా ప్రధాని మోదీజీ ఆమెను ప్రత్యేకంగా అభినందించి గౌరవించారు. ఇది తన కూతురికే కాదు.. తన కుటుంబానికే దక్కిన గొప్ప గౌరవం అంటూ రేణు తల్లి పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోంది. మరి, మోదీ ప్రశంసలందుకున్న ఈ ఇన్‌ స్వింగ్‌ క్వీన్‌ క్రికెట్‌ ప్రయాణంలోని కొన్ని ఎత్తుపల్లాల గురించి తెలుసుకుందాం..!

పాతికేళ్ల రేణుకా సింగ్‌ థాకూర్‌ హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలోని పర్సా అనే మారుమూల కొండ ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఆమెకో సోదరుడున్నాడు. రేణుకకు మూడేళ్ల వయసున్నప్పుడే ఆమె తండ్రి చనిపోయాడు. ఆయనకు క్రికెట్‌ అంటే ప్రాణం. తన కూతురిని కానీ, కొడుకుని కానీ క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కల. అయితే తన కల నెరవేరకుండానే కాలం చేశాడాయన.

అమ్మే అన్నీ అయి..!

ఇలా కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోవడంతో భారమంతా రేణుక తల్లి సునీత భుజాలపై పడింది. అదే సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో క్లాస్‌-4 ఉద్యోగినిగా రూ. 1500 జీతానికి పనిలో చేరిందామె. అయితే కుటుంబ పరిస్థితులెలా ఉన్నా వాటి ప్రభావం పిల్లల కెరీర్‌పై పడకుండా జాగ్రత్తపడ్డారు సునీత. ఈ క్రమంలోనే వారిని వాళ్ల ఇష్ట ప్రకారం చదువు, ఆటల్లో ప్రోత్సహించారు.

‘నాకు మూడేళ్లున్నప్పుడే నాన్న పోయాడు. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించడానికి అమ్మ ఎంత కష్టపడిందో నేను కళ్లారా చూశాను. నాకు క్రికెట్‌ అంటే చిన్నప్పట్నుంచే ఇష్టం. నాన్నకు కూడా ఈ ఆటంటే ప్రాణమని ఆ తర్వాత తెలిసింది. అప్పుడు నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. ఏదో తెలియని ప్రోత్సాహం నా వెన్నుతట్టింది. ఎలాగైనా నాన్న కోరిక నెరవేర్చాలని బలంగా అనుకున్నా..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ క్రికెట్‌ లవర్.

అబ్బాయిలతో సవాల్‌ చేసేది!

క్రికెటర్‌ అయితే కావాలనుకుంది.. కానీ దాన్ని ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో రేణుకకు అర్థం కాలేదు.. పైగా ఆ సమయంలో తనకు మార్గనిర్దేశం చేసే వారూ ఎవరూ లేరు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే అబ్బాయిలతో పోటీ పడేదామె. పరుగు పందేల్లో వాళ్లను అధిగమించి తానే గెలుస్తానని వాళ్లతో సవాల్‌ చేసేది. ఆడపిల్లకు చదువు, ఆటలెందుకని నలుగురూ అన్నా వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యం పైనే దృష్టి పెట్టింది రేణుక. ఇందుకు తన తల్లీ ఎంతగానో సహకరించిందని చెబుతోంది. ఇలా క్రీడలపై తాను చూపే ఆసక్తిని గమనించిన ఆమె అంకుల్‌.. ఆమెను ధర్మశాలలోని హిమాచల్ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌-అకాడమీలో చేర్పించారు. అక్కడే క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన ఈ యువ కెరటం.. రోజురోజుకీ తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది.

ఒక్క టోర్నీ.. 23 వికెట్లు!

ఎక్కువగా బౌలింగ్ పైనే దృష్టి పెట్టిన ఈ యువ క్రికెటర్‌.. పేసర్‌గా తన క్రీడా నైపుణ్యాలకు పదును పెట్టింది. ఆపై అండర్‌-16, అండర్‌-19 జట్లకు ఎంపికై.. తన పేస్‌ మెలకువలతో పలువురి దృష్టిని ఆకర్షించింది. అయితే 2019లో బీసీసీఐ నిర్వహించిన వన్డే టోర్నమెంట్‌లో 23 వికెట్లు పడగొట్టి.. జాతీయ స్థాయి సెలక్టర్ల దృష్టిలో పడిందామె. ఇక అక్కడ్నుంచి రేణుక దశ తిరిగిందని చెప్పచ్చు. ఆపై దేశవాళీ మ్యాచుల్లో తనకు అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఎదిగిన ఆమె.. గతేడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో జాతీయ జట్టులోకి ప్రవేశించింది. అయితే మొదటి రెండు మ్యాచుల్లో రాణించకపోయినా.. మూడో మ్యాచ్‌లో మేటి క్రీడాకారిణి అలిస్సా హీలే వికెట్‌ పడగొట్టి.. తన వికెట్ల ఖాతాను ఘనంగా ఆరంభించింది రేణుక.

ఆమె ప్రదర్శన ఎంతోమందికి స్ఫూర్తి!

తన ప్రతిభతో అనతికాలంలోనే జాతీయ జట్టులో కీలకంగా మారిన రేణుక.. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. తన ఇన్‌ స్వింగ్‌ మాయాజాలంతో ఐదు మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టిన ఆమె.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. తద్వారా భారత మహిళల జట్టు రజత పతకం సొంతం చేసుకోవడంలో ముఖ్య భూమిక పోషించిందీ సిమ్లా క్రికెటర్‌. ఇలా రేణుక చేసిన అత్యద్భుత ప్రదర్శనను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాలు నెగ్గిన క్రీడాకారుల కోసం తాజాగా ఏర్పాటు చేసిన సత్కార వేడుకలో ఆమె విజయాల్ని ఇలా కొనియాడారు.

‘రేణుక తన స్వింగ్‌ మాయాజాలంతో మరోసారి అదరగొట్టింది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్‌గా నిలిచింది. ఇదో గొప్ప విజయం. ఆమె మోము సిమ్లా ప్రశాంతతకు, ఆమె చిరునవ్వు అక్కడి పర్వతాల ఆహ్లాదకర వాతావరణానికి నిదర్శనం.. ఆమె దూకుడు అగ్రశ్రేణి బ్యాటర్లను సైతం ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు. ఇలాంటి అత్యద్భుత ప్రదర్శన ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతుంది..’ అంటూ రేణుపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీజీ. దీంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగుతోంది. ఇలా ఈ యువ ప్లేయర్‌ ఉత్సాహం, ఆమె నైపుణ్యాలు చూసి.. భారత మహిళల జట్టుకు మరో అద్భుత పేసర్‌ దొరికినట్లేనని, ఆమె స్థానం శాశ్వతమని అభిప్రాయపడుతున్నారు క్రీడా విశ్లేషకులు.

నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు!

ఇలా మొత్తానికి నాన్న కల తన ద్వారా నెరవేరినందుకు, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందంటోందీ స్వింగ్‌ క్వీన్‌. ‘నేను కానీ, అన్నయ్య కానీ దేశం తరఫున క్రికెట్‌ ఆడాలనేది నాన్న కల. అది నా ద్వారా సాకారమైనందుకు గర్వపడుతున్నా. నన్ను చూసి నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు.. గర్వపడతారు..! నాన్న కల, అమ్మ త్యాగమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి..’ అంటూ మురిసిపోతోందీ యువ క్రికెటర్.

మరోవైపు తన కూతురికి మోదీజీ ప్రశంసలు దక్కినందుకు తన కుటుంబం, గ్రామం ఎంతగానో మురిసిపోతున్నాయంటున్నారు రేణు తల్లి సునీత.

‘ఆటపై మక్కువ, కృషి.. ఈ రెండే నా బిడ్డను నేడు అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి. తను చిన్న వయసులో ఉన్నప్పుడే మావారు మాకు శాశ్వతంగా దూరమయ్యారు. అయినా కష్టాలు నా పిల్లల దాకా తీసుకురాకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా. వాళ్లూ మా అంచనాలకు తగ్గట్లే రాణించి మాకు మంచి పేరు తీసుకొచ్చారు. ఇందుకు తాజా ఉదాహరణే.. మోదీజీ నా రేణుకను ప్రశంసించడం. ఇది కేవలం తనకే కాదు.. మా కుటుంబానికి, మా గ్రామానికి దక్కిన గొప్ప ప్రశంస!’ అంటూ మురిసిపోయారామె.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పది స్థానాల్ని మెరుగుపరచుకొని ఐసీసీ టీ20 మహిళల ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో నిలిచిందీ సిమ్లా క్రికెటర్‌. సుష్మా వర్మ తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి భారత జట్టులో చోటు దక్కించుకున్న రెండో క్రికెటర్‌ రేణుక. ఇక మీ ఆరాధ్య క్రికెటర్‌, స్ఫూర్తి ప్రదాత ఎవరని అడిగితే.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అని చెబుతోందీ యువ పేసర్.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని