Lakshmi Haritha Bhavani: చిరుధాన్యాలతో చిరంజీవులు కమ్మని...
ప్రసవమయ్యాక రెండువారాలు స్పృహే లేదు... కొవిడ్ బారిన పడ్డప్పుడూ అదే పరిస్థితి... చావు అంచుల వరకూ వెళ్లిన అనుభవాలివి... రెండు సందర్భాల్లోనూ తనని బతికించింది తృణధాన్యాలిచ్చిన శక్తే అంటారామె.
ప్రసవమయ్యాక రెండువారాలు స్పృహే లేదు... కొవిడ్ బారిన పడ్డప్పుడూ అదే పరిస్థితి... చావు అంచుల వరకూ వెళ్లిన అనుభవాలివి... రెండు సందర్భాల్లోనూ తనని బతికించింది తృణధాన్యాలిచ్చిన శక్తే అంటారామె. అందుకే వాటిని అందరికీ పరిచయం చేసి, ఆరోగ్యప్రదమైన జీవనశైలిని అందించాలని తపన పడుతున్నారు దేవరగట్ల లక్ష్మీహరితా భవాని. నిల్వకారకాలు వాడకుండా తృణ ధాన్యాల ఉత్పత్తులతో వ్యాపారవేత్తగా రాణిస్తోన్న ఆమె వసుంధరతో చెప్పిన ‘చిరు’ ముచ్చట్లివి..
మా సొంతూరు సూర్యాపేట. అమ్మానాన్నా ప్రభుత్వోద్యోగులు. అమ్మ ఉమామహేశ్వరి వ్యవసాయాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యింది. నాన్నకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో అమ్మ చూసుకోవాల్సి వచ్చింది. దాంతో చదువు కోసం తమ్ముళ్లిద్దరినీ తీసుకుని, హైదరాబాద్ వచ్చేశా. వాళ్లను చూసుకుంటూనే ఈఈఈ, ఎంటెక్ చదివి ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశా. తర్వాత సౌర ఉత్పత్తుల తయారీ సంస్థలో రెండేళ్లు చేసి, సొంతంగా కన్సల్టెన్సీ ప్రారంభించా. కానీ సరైన సిబ్బంది దొరక్క, ఇబ్బందులు పడి ఆ పని ఆపేశాను. ఈలోపు అమ్మ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ కాలేజీలో జొన్న, రాగి బిస్కెట్ల తయారీని చూసింది. ఆరోగ్యప్రదమైన ఆ చిరుతిళ్లను తెచ్చి ఇంటి దగ్గర అమ్మితే ఎలా ఉంటుందనే ఆలోచన చేసింది. నాకూ నచ్చింది. కొన్నాళ్లు ఆ వ్యాపారం చేశాం. కానీ అదే సమయంలో నాన్న చనిపోవడం, నా పెళ్లి కావడంతో ఆ పనికి బ్రేక్ పడింది. మావారు ఎల్ అండ్‌టీలో మేనేజర్. పెళ్లి తర్వాతా ఏదైనా చేయాలన్న తపన పోలేదు. నా మనసంతా... ‘జంక్ ఫుడ్ వాడకం పెరుగుతోంది. పిల్లలను ఆకర్షించే మంచి పోషకాహారం దొరకడం లేదు’.. వీటి చుట్టే తిరుగుతోంది. ఆలోచన చిరుధాన్యాల వైపే మళ్లింది. అదే వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. అమ్మ సలహాతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ అండ్ రిసెర్చ్‌లో.. 2019లో శిక్షణ తీసుకున్నా. కానీ పెట్టుబడి కావాలిగా? మావారు కొంత సాయం చేశారు. నా నగలు, అమ్మ ఎల్‌ఐసీ డబ్బులు డ్రా చేసి ఏడు లక్షలతో యంత్రాలు కొన్నా. ‘ఏన్షియెంట్ ఫుడ్స్’ పేరుతో యూనిట్ ప్రారంభించా. అమ్మ, మా ఆడపడుచు సరోజ సాయంతో లడ్డూలు, బిస్కెట్లు, బూందీ తయారీ చేసేవాళ్లం. వాటిని షాపులకి, గేటెడ్ కమ్యూనిటీలకు నేనే తీసుకెళ్లి అమ్మేదాన్ని. ఇంతలో అమ్మా, నేను కొవిడ్ బారిన పడ్డాం. వ్యాపారం కూడా నెమ్మదించింది. వచ్చిన డబ్బులు వచ్చినట్టే అయిపోయేవి. అప్పుడు బ్యాంక్ రుణం కోసం ప్రయత్నించా. ‘తృణధాన్యాల వ్యాపారం అంటున్నారు.. నిలబడగలరా?’ అంటూ బ్యాంకులు తిరస్కరించాయి. ఒక బ్యాంకు మాత్రం రుణమిచ్చి ఆదుకుంది. అలా 2022 చెంగిచెర్లలో యూనిట్ ప్రారంభించా. కొన్నిరోజులు సమయానికి ఆర్డర్లు అందివ్వడానికి రాత్రుళ్లు యూనిట్‌లోనే పడుకునేదాన్ని. ప్రస్తుతం తృణధాన్యాలతో 70 రకాల ఉత్పత్తుల్ని అందిస్తున్నాం. మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా రవ్వలు, దోసె, పొంగల్ మిక్స్, సూప్ మిక్స్, మురుకులు, లడ్డూలు, చెక్కలు, గవ్వలు, బూందీతోపాటు నెయ్యి, బెల్లంతో స్వీట్స్, రకరకాల పొడులు, గానుగ నూనెతో పచ్చళ్లు చేస్తున్నాం. పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా స్కూళ్లకు కూడా ‘స్నాక్స్ కిట్స్’ అందిస్తున్నాం. దాంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పించగలుగుతున్నానన్నది ఒక సంతోషం.
రైతుల నుంచే....
స్టాల్స్ పెట్టిన కొత్తలో రుచి చూపించడానికే కేజీల కొద్దీ ఉత్పత్తులు అయిపోతుండేవి. అయినా బాధపడలేదు. రుచి చూసినవాళ్లంతా బాగున్నాయి అంటూ ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించారు. నిల్వకారకాలు లేని ఉత్పత్తులు కావడంతో క్రమంగా నమ్మకం, అమ్మకాలు పెరిగాయి. దిల్లీలో గ్లోబల్ ఆర్గానిక్ ఎక్స్‌పోలో పాల్గొన్నాక పేరు, ఆత్మవిశ్వాసం వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం వారి ‘వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్’ పథకం కింద హైదరాబాద్ నగరంలోనే మొదటిసారిగా హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో స్టాల్ పెట్టే అవకాశం దక్కింది. ఈ మధ్యే నాంపల్లి రైల్వేస్టేషన్‌లో వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్ కింద మరో స్టాల్‌నీ ఏర్పాటు చేశాం. రాగులు, కొర్రలు, పెసలు, జొన్నలు, సజ్జలు ఇలా తృణధాన్యాల్ని రైతుల నుంచే నేరుగా కొంటాం. ప్రసవం అయ్యాక ఒకసారి, కొవిడ్ సమయంలో మరోసారి తీవ్ర అనారోగ్యం పాలయ్యా. నాలో రోగనిరోధకశక్తి వల్లే బయటపడ్డానని.. అందుకు చిన్నప్పుడు అమ్మ పెట్టిన రాగిజావ, జొన్న సంకటే కారణం అని నా నమ్మకం. వాటి విలువ అందరికీ తెలియాలనే ఈ తాపత్రయం.
- భూపతి సత్యనారాయణ, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.