Eegalapati Indira: నా భవిష్యత్తు గేరు.. అలా మార్చుకున్నా!
ముగ్గురూ ఆడపిల్లలే అన్న జాలిచూపులు.. రెండో సంబంధమైతే తప్ప పెళ్లిళ్లు కావన్న మాటలు ఆమెను ఆలోచనలో పడేశాయి. ఒకరు చెప్పినట్టు కాదు.. తన జీవితాన్ని తానే మలచుకోవాలని పట్టుదలతో ప్రయత్నించారు.
ముగ్గురూ ఆడపిల్లలే అన్న జాలిచూపులు.. రెండో సంబంధమైతే తప్ప పెళ్లిళ్లు కావన్న మాటలు ఆమెను ఆలోచనలో పడేశాయి. ఒకరు చెప్పినట్టు కాదు.. తన జీవితాన్ని తానే మలచుకోవాలని పట్టుదలతో ప్రయత్నించారు. అరబ్ దేశంలో మెట్రోరైల్ పైలట్‌గా మగవారితో పోటీపడుతూ రాణిస్తున్నారు.. ఈగలపాటి ఇందిర! వసుంధరతో తన ప్రయాణాన్ని పంచుకున్నారిలా..
మాది పల్నాడు జిల్లా.. ధూళిపాళ్ల. అమ్మ వెంకట నర్సమ్మ, నాన్న కోటేశ్వరరావు మెకానిక్. మధ్యతరగతి కుటుంబం, ముగ్గురు అమ్మాయిలమని నాన్నని చూసి అందరూ జాలిపడేవారు. దీనికితోడు నేను రంగు తక్కువ. కాకి, చింతపండు అని హేళనగా పిలిచేవారు. వీటన్నింటికీ ఎదిగి చూపడమే పరిష్కారం అనుకునేదాన్ని. నాన్న అరకొర సంపాదన కుటుంబ పోషణకే సరిపోయేది. దీంతో అక్క శ్రీలక్ష్మిని ఇంటరయ్యాక చదువు మాన్పించారు. ‘సెంటు పొలం లేదు. పెళ్లిళ్లెలా చేస్తాడో. రెండో సంబంధాలైతే కట్నకానుకల బెడదుండదు’ అన్న సలహాలిచ్చేవారు బంధువులు. ఓరోజు అక్కకు బేల్దారి పనిచేసే వ్యక్తి సంబంధం తెచ్చారు కూడా. భవిష్యత్తులో నా పరిస్థితీ ఇంతేనా అని భయమేసింది. నాన్న తిరస్కరించారని తెలిశాకకానీ మనసు కుదుటపడలేదు. అప్పుడే నా భవిష్యత్తు నేనే నిర్దేశించుకోవాలనుకున్నా. కానీ కాలేజీకి వెళ్లడానికి బస్ పాస్ రూ.90 కోసమూ వెతుక్కునే పరిస్థితి. దీంతో అక్కా నేనూ ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాం. ఆ వచ్చిన డబ్బుతో డిగ్రీలో చేరా. తర్వాత అక్కనీ చదువు కొనసాగించేలా ప్రోత్సహించా.
డిగ్రీ తర్వాత స్నేహితుల పుస్తకాలు తెచ్చుకొని ఐసెట్‌కి సిద్ధమయ్యా. దుండిగల్‌లోని ఓ కళాశాలలో ఎంసీఏలో చేరా. ఫీజు ఎలాగోలా సమకూర్చుకున్నా.. హాస్టల్ ఫీజు ఆలస్యమయ్యేది. సరిగ్గా అన్నం ముద్ద నోట్లో పెట్టుకునేప్పుడు గుర్తు చేసేవారు. కళ్లలో నీళ్లు తిరిగేవి. ‘కలిసి ఏదో ఒక పనిచేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చేయ’మని నాన్నకి చెప్పా. నాగోల్‌లో గది అద్దెకు తీసుకొని, అందరం దానిలోనే సర్దుకున్నాం. నాన్న మెకానిక్ పనులు చేస్తోంటే అక్క ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరింది. చెల్లినీ అదే స్కూల్లో ఫీజు రాయితీతో చేర్పించాం. నేను ట్యూషన్లు చెబుతూ.. మొత్తానికి చదువు పూర్తిచేశా.
అది పోగొట్టాలని...
ఎంసీఏ తర్వాత సాఫ్ట్‌వేర్ కాకుండా ఏదైనా భిన్నంగా చేయాలనిపించింది. చిన్నప్పట్నుంచీ ఎంత దన్నుగా నిలిచినా నాన్నకీ అబ్బాయిలేడన్న బెంగే. ఆ భావన పోగొట్టాలని రిపేరింగ్‌లో సాయపడేదాన్ని. ఏదైనా ప్రత్యేకంగా చేసి, నేనూ అబ్బాయికంటే తక్కువ కాదని నిరూపించుకోవాలనుకునేదాన్ని. అందుకే ఎందరు వద్దన్నా మెట్రోరైల్వే ఉద్యోగానికి ప్రయత్నించా. ఎంసీఏలో వివిధ రాష్ట్రాల వాళ్లు ఉండటంతో హిందీ, ఇంగ్లిష్‌పై పట్టొచ్చింది. అదీ ఉపయోగపడింది. పరీక్షలు, ఇంటర్వ్యూ దాటుకొని ఎంపికయ్యా. ట్రైన్ నడపడం, స్టేషన్ నిర్వహణ వంటి ఎన్నో అంశాల్లో శిక్షణిచ్చారు. రెండేళ్లకే లోకో పైలట్ అయ్యా. స్నేహితుల ద్వారా రియాద్ మెట్రోలో అవకాశాలున్నాయని తెలిసి ప్రయత్నించా. ఎంపికైన 11 మందిలో ఒకదాన్నే అమ్మాయిని. ‘మగవాళ్ల పని నీకెందుకు? ఆడపిల్లవి అంత దూరమెందుకు’ అని చాలామంది వారించారు. అయినా ముందుకే సాగా. ముంబయిలో అరబ్ సంస్కృతి, సంప్రదాయం సహా వివిధ అంశాల్లో శిక్షణిచ్చారు. అదయ్యాక పోస్టింగ్!
చెల్లెలు కూడా..
మూడేళ్లుగా ఇతర దేశాల మహిళలు, నిపుణులతో కలిసి పనిచేస్తున్నా. ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీల సందర్భంగా దోహాలో విధులు నిర్వర్తించా. మా బృందానికి మెప్పూ దక్కింది. మా స్ఫూర్తితో మరెంతోమంది మహిళలకు ఇక్కడ అవకాశమిస్తున్నారు. మావారు లోకేష్ సహోద్యోగే. నన్నెంతో ప్రోత్సహిస్తారు! నడిచే దారేదైనా ప్రశ్నించేవారే ఎక్కువ. అలాగని భయపడితే అక్కడే ఆగిపోతాం. అందుకే ప్రయత్నించడానికి ఎప్పుడూ వెనకాడేదాన్ని కాదు. అదే నా భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా చేసింది. నా స్ఫూర్తితో చెల్లెలూ మెట్రో లోకో పైలట్ అవ్వడం గర్వించే విషయం.
- ఆనిరాజ్ కూచిపూడి, సత్తెనపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.