Sruthi dhulipala: హాలీవుడ్‌లో.. ఆర్‌ఆర్‌ఆర్‌కి పని చేశా!

‘హాలీవుడ్‌ సినిమాలకు ప్రచారం చేస్తా!’ అన్నప్పుడు ఆ అమ్మాయిని చూసి చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వేశారు. ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడో..? 18 హాలీవుడ్‌ సినిమాలే కాదు.. ఆస్కార్‌ సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌కి పబ్లిసిటీ కల్పించడంలోనూ తోడ్పడింది.

Updated : 16 Apr 2023 07:44 IST

‘హాలీవుడ్‌ సినిమాలకు ప్రచారం చేస్తా!’ అన్నప్పుడు ఆ అమ్మాయిని చూసి చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వేశారు. ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడో..? 18 హాలీవుడ్‌ సినిమాలే కాదు.. ఆస్కార్‌ సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌కి పబ్లిసిటీ కల్పించడంలోనూ తోడ్పడింది. నవ్విన వారి చేతే శభాష్‌ అనిపించుకుంటోంది.. శృతి ధూళిపాల! ఈ హైదరాబాదీని వసుంధర పలకరించింది!

ట్టుదలగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమనేదానికి నేనే ఉదాహరణ! కాలేజ్‌ క్యాంటీన్‌లో భవిష్యత్‌పై చర్చించుకుంటున్నాం. నేను ‘హాలీవుడ్‌ సినిమాలకు ప్రచారం చేస్తా’నన్నా. అంతే.. జోక్‌ వేసినట్టు అందరూ నవ్వేశారు. నేను బాధపడలేదు. బలంగా ప్రయత్నించాలనుకున్నా. అమ్మ కవిత వ్యాపారవేత్త. నాన్న డీఎస్సార్‌ మూర్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, మృదంగ విద్వాంసులు. తమ్ముడున్నాడు. నాలుగో ఏటనే హైదరాబాద్‌ సిస్టర్స్‌ వద్ద సంగీత శిక్షణ ప్రారంభించా. పుస్తకాల పురుగుని, సినిమాలన్నా ప్రాణమే. ఈ రెండే సినిమా రంగంపై ఆసక్తికి కారణమయ్యాయి. అమ్మానాన్న కోరిక మేరకు ఇంజినీరింగ్‌లో చేరినా.. నాకిష్టమైన జర్నలిజం, పబ్లిక్‌ రిలేషన్స్‌, మార్కెటింగ్‌ల్లో ఇంటర్న్‌షిప్‌లు చేశా.

2017లో పబ్లిక్‌ రిలేషన్స్‌లో మాస్టర్స్‌కు బోస్టన్‌ యూనివర్శిటీలో సీటొచ్చింది. నేను తప్ప మరో భారతీయ అమ్మాయి లేదు. చాలా ఇబ్బంది పడ్డా. మానేసి ఇంటికెళ్లిపోదామనీ అనుకున్నా. నా లక్ష్యం కోసమని వాటన్నింటినీ పంటి బిగువున భరించా. దీనికితోడు పర్మనెంట్‌ వీసా కష్టమైంది. అది లేనిదే అక్కడ ఉండలేను. భారత్‌కి తిరిగొచ్చేయాలి. రెండో ఏడాది చదువుతున్నప్పుడే లాస్‌ఏంజెల్స్‌లో ‘బిగ్‌ బేంగ్‌’ అనే షోకు పబ్లిసిటీ అసిస్టెంట్‌గా అవకాశమొస్తే చాలా సంబరపడ్డా. తీరా చివర్లో ఫుల్‌టైం జాబ్‌ ఇవ్వనన్నారు. సామాన్లన్నీ స్టోరేజ్‌ యూనిట్‌లో ఉంచి ఉద్యోగం కోసం దేశమంతా తిరిగా. తెలిసినవాళ్లు, బంధువుల ఇళ్లల్లో ఉంటూ.. ఇంటర్వ్యూలకు వెళ్లేదాన్ని. అందరూ అన్నట్టుగా ఏమీ సాధించకుండానే వెనుదిర గాలేమోనని భయమేసేది. ఎక్కడికెళ్లినా తాత్కాలిక ఉద్యోగాలే దక్కేవి. నిరాశతో కొన్నిసార్లు ఏడ్చేశా కూడా. చివరకు శాన్‌ఫ్రాన్సిస్‌స్కోలో ఓ పీఆర్‌ ఏజెన్సీలో ఫుల్‌టైం జాబ్‌, దాంతోపాటు పర్మనెంట్‌ వీసా దక్కాయి.

మలుపు..

వీసా దక్కాక నా కల నెరవేెర్చుకోవడానికి ‘డిస్నీ’లో ఉద్యోగానికి ప్రయత్నించా. ఎన్నో వడపోతలు దాటి చివరకు సాధించా.. అదే నా జీవితంలో పెద్ద మలుపు. 2022 ఆస్కార్‌ పబ్లిసిటీ విభాగంలో నేనూ సభ్యురాలినే. రెడ్‌కార్పెట్‌ నుంచి ప్రీమియర్స్‌ ప్లానింగ్‌ వరకు నా బాధ్యతే. ఆ సమయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. తర్వాత మూవింగ్‌ పిక్చర్‌ కంపెనీ (ఎంపీసీ)కి మారా. భారీ బడ్జెట్‌ చిత్రాలకు యూఎఫ్‌ఎక్స్‌, సినిమాటోగ్రఫీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వంటివి చేస్తారిక్కడ. ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఇక్కడే జరిగింది. ఆ సినిమాల ప్రచార బాధ్యత నాది. అలా ఆర్‌ఆర్‌ఆర్‌ అవకాశమొచ్చింది. ఆస్కార్‌తోపాటు గోల్డెన్‌ గ్లోబ్‌ వంటి వివిధ అవార్డులకు దరఖాస్తు చేయడం, జ్యూరీతో చర్చలు, స్క్రీనింగ్‌, రాజమౌళి, కీరవాణిగారితో ఇంటర్వ్యూలు ప్లాన్‌ చేయడం వంటివన్నీ నా పనిలో భాగమే. టాప్ గన్: మావెరిక్, హౌస్‌ ఆఫ్‌ ద డ్రాగన్‌ వంటి 18 హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేశా.


సవాళ్లెన్నో..

యాస, వర్ణం, సంస్కృతి.. ఏ విషయం తీసుకున్నా అమెరికన్లతో పోలిస్తే నేను భిన్నమే. వేదికపై నిల్చొన్నప్పుడు, సమావేశాల్లో నా మాట వింటారా అనే భయముండేది. ‘నిన్ను నువ్వు మార్చుకో’మన్న సలహాలొచ్చేవి. నాలా నేనుంటూనే కష్టపడ్డా. సంగీత సాధననీ ఆపలేదు. వారాంతాల్లో శాస్త్రీయ సంగీతానికి పాప్‌ కలిపి బృంద కచేరీలిస్తా. స్పాటిఫై, యూట్యూబ్‌ల్లోనూ నా పాటలు ఉంచుతున్నా. మరిన్ని భారతీయ చిత్రాలను ప్రపంచ వేదికపైకి చేర్చాలన్నది లక్ష్యం. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్పిరేషనల్‌ వుమెన్‌ అవార్డ్స్‌ (ఐఐడబ్ల్యూఏ) -2023లో ‘బెస్ట్‌ వుమెన్‌ పెర్ఫార్మర్‌ ఇన్‌ అడ్వర్టైజింగ్‌, మార్కెటింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌’కు ఎంపికయ్యా. త్వరలో దిల్లీలో అందుకోనున్నా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని