200 కిలోల కేక్.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా?

కేక్స్ చాలామంది తయారుచేస్తారు.. కానీ వాటిని విభిన్నంగా అలంకరించే ఓర్పు-నేర్పు కొందరికే ఉంటుంది.. మరికొందరు తమ సృజనతో వాటికి కొంగొత్త హంగులద్దుతుంటారు.. అలాంటి వాళ్లే ప్రపంచ మెప్పు పొందుతారు. పుణేకు చెందిన ప్రాచీ ధవళ్‌ దేవ్‌....

Updated : 10 May 2023 22:18 IST

(Photos: Instagram)

కేక్స్ చాలామంది తయారుచేస్తారు.. కానీ వాటిని విభిన్నంగా అలంకరించే ఓర్పు-నేర్పు కొందరికే ఉంటుంది.. మరికొందరు తమ సృజనతో వాటికి కొంగొత్త హంగులద్దుతుంటారు.. అలాంటి వాళ్లే ప్రపంచ మెప్పు పొందుతారు. పుణేకు చెందిన ప్రాచీ ధవళ్‌ దేవ్‌ కూడా అలాంటి అరుదైన కళాకారిణే! రాయల్‌ ఐసింగ్‌ ఆర్ట్‌లో ప్రావీణ్యం పొందిన ఆమె.. విశ్వవ్యాప్తంగా ఉన్న ఎలాంటి రాజప్రాసాదాలు, కట్టడాలనైనా రుచికరమైన కేక్‌ల రూపంలో తీర్చిదిద్దడంలో దిట్ట. అనితర సాధ్యమైన తన నైపుణ్యాలతో భారత్‌లోనే అత్యుత్తమ రాయల్‌ ఐసింగ్‌ కేక్‌ ఆర్టిస్ట్‌గా ఖ్యాతి గాంచిన ప్రాచీ.. ఇప్పటికే రెండు ప్రపంచ రికార్డుల్ని సాధించింది. ఇక ఇటీవలే భారతీయ రాజభవనం నమూనాను పోలిన 200 కిలోల కేక్‌ను తయారుచేసి మూడో ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకుంది. సొంత రికార్డును అధిగమిస్తూ కొత్త రికార్డు నమోదు చేయడంలో ఉన్న సంతృప్తి, ఆనందం మరెందులోనూ దొరకదంటోన్న ఈ రాయల్‌ ఐసింగ్ క్వీన్‌ సక్సెస్‌ఫుల్‌ జర్నీ గురించి తెలుసుకుందాం..!

ప్రాచీ తల్లిదండ్రులు డెహ్రాడూన్‌కు చెందిన వారు. పుణేకు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని పెళ్లాడిన ఆమె.. ఆ తర్వాత అక్కడే స్థిరపడింది. చిన్నతనం నుంచీ అటు చదువులో రాణిస్తూనే.. ఇటు కేక్‌ బేకింగ్‌ పైనా ఆసక్తి చూపేది ప్రాచీ. ఈ క్రమంలోనే అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేకంగా, కొత్తగా కేక్‌లు తయారుచేయాలని ఆరాటపడేది. ఈ తపనే తనను రాయల్‌ ఐసింగ్‌ వంటి క్లిష్టమైన కేక్‌ కళ నేర్చుకునేందుకు పురిగొల్పింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన, కేక్‌ ఐకాన్‌గా పేరుగాంచిన ‘సర్‌ ఎడ్డీ స్పెన్స్‌ ఎంబీఈ’ ఆధ్వర్యంలో యూకేలో ఈ కేక్‌ నైపుణ్యాలు ఒంటబట్టించుకుందీ కేక్‌ లవర్.

కష్టమైనా ఇష్టంగా..!

నిజానికి మనం ఒక పనిని ఇష్టపడితే.. అది ఎంత కష్టమైనా సరే.. దాన్ని ఆస్వాదిస్తూ మరీ పూర్తి చేస్తాం. రాయల్‌ ఐసింగ్‌ వంటి క్లిష్టమైన కళలోనూ తాను ఇంతటి గుర్తింపు సొంతం చేసుకోవడానికి దానిపై తనకున్న ఈ మక్కువే కారణమంటోంది ప్రాచీ.

‘నాకు చిన్నతనం నుంచీ అద్భుతమైన కళాఖండాల అందాలను ఆస్వాదించడమంటే మక్కువ. ముఖ్యంగా విక్టోరియా, యూరోపియన్ కట్టడాల నిర్మాణ శైలి, సొగసును వర్ణించడం మాటలతో సాధ్యమయ్యే పని కాదు. అందుకే వాటిని అంతే అందంగా, అద్భుతంగా నా ఐసింగ్‌ నైపుణ్యాలతో తీర్చిదిద్దుతున్నా. శిలలపై శిల్పాలు చెక్కినట్లు.. ఆ హంగుల్ని కేక్‌పై తీర్చిదిద్దడమంటే మాటలు కాదు.. అందుకు ఎంతో ఓపిక కావాలి. అయితే ఇష్టమైన పనిలో కష్టం తెలియదు.. అందుకే ఈ కళను మనసారా ఆస్వాదిస్తున్నా..’ అంటున్నారీ ఐసింగ్‌ క్వీన్.

‘వీగన్‌’.. నా ప్రత్యేకత!

కేక్స్‌ తయారీలో చాలావరకు కోడిగుడ్లు ఉపయోగించడం మనకు తెలిసిందే! అప్పుడే వాటి రుచి, మృదుత్వం ఇనుమడిస్తాయి. అయితే తాను తయారుచేసే ఏ కేక్‌లోనూ, రాయల్‌ ఐసింగ్‌తో తయారుచేసే కళాఖండాల్లోనూ గుడ్లు అస్సలు ఉపయోగించనంటోంది ప్రాచీ. ఈ క్రమంలో ఎక్కువ భాగం వీగన్‌ కేక్స్‌ రూపొందించడానికే మొగ్గు చూపుతానంటోంది.
‘విభిన్న కళాఖండాలను కేక్‌లుగా మలచడమే కాదు.. కప్‌ కేక్స్‌, కుకీస్‌, వ్యక్తిగతంగా తయారుచేయించుకునే ప్రత్యేక థీమ్‌ తరహా కేక్స్‌, పండగలు-ఇతర ప్రత్యేక సందర్భాల్లో రూపొందించే కేక్స్‌.. వంటివెన్నో మేము తయారుచేస్తున్నాం. అయితే వీటిలో ఎందులోనూ కోడిగుడ్లు ఉపయోగించను. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎక్కువగా వీగన్‌ తరహాలో వీటిని తయారుచేయడానికే మొగ్గు చూపుతుంటా..’ అంటూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారామె. ప్రస్తుతం ముంబయికి చెందిన Sugarin అనే కేక్‌ అలంకరణ వస్తువుల సంస్థతో కలిసి పనిచేస్తోన్న ప్రాచీ.. తన కెరీర్‌లో బ్రిటిష్‌ రాజకుటుంబం కోసం ప్రత్యేకంగా కేక్‌లు రూపొందించడం మర్చిపోలేని అనుభూతి అంటూ ఓ సందర్భంలో తన మనసులోని మాటను పంచుకున్నారు.


దాసోహమంటోన్న రికార్డులు!

కేక్‌ బేకింగ్‌, రాయల్‌ ఐసింగ్‌ నైపుణ్యాలతో ‘ది క్వీన్‌ ఆఫ్‌ రాయల్‌ ఐసింగ్‌’గా పేరుగాంచిన ప్రాచీ తయారుచేసే కేక్‌లకు విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా పలు కేక్‌ తయారీ పోటీల్లో జడ్జిగానూ వ్యవహరించారామె. అంతేకాదు.. ఫోర్బ్స్‌ ఇండియా.. వంటి పత్రికలు విడుదల చేసిన ఆయా జాబితాల్లోనూ చోటు దక్కించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీ చేతులు మీదుగా ‘భారత్‌ లీడర్‌షిప్‌ అవార్డు’ సైతం అందుకున్నారు ప్రాచీ.

ప్రపంచంలోనే గొప్ప చారిత్రక కట్టడంగా పేరుగాంచిన ‘మిలాన్‌ చర్చి’ని తన రాయల్‌ ఐసింగ్‌ నైపుణ్యాలతో గతేడాది అంతే అద్భుతంగా ఆవిష్కరించారీ ఐసింగ్‌ క్వీన్‌. సుమారు 100 కిలోల వీగన్‌ రాయల్‌ ఐసింగ్‌తో, చేత్తో రూపొందించిన ఈ కళాఖండానికి మాతృక మాదిరిగానే ఆయా సొగసులు జోడించారు. ఇలా తన అరుదైన నైపుణ్యాలకు గుర్తింపుగా.. ‘అతిపెద్ద రాయల్‌ ఐసింగ్‌ కళాఖండా’న్ని రూపొందించినందుకు గాను, ‘ఎక్కువ సంఖ్యలో వీగన్‌ రాయల్‌ ఐసింగ్‌ నిర్మాణా’ల్ని తన ఐసింగ్‌ నైపుణ్యాలతో తీర్చిదిద్దినందుకు గాను.. ఇలా ఒకేసారి రెండు ప్రపంచ రికార్డుల్ని సొంతం చేసుకున్న ప్రాచీ.. ఇటీవలే మూడో ప్రపంచ రికార్డును తన వశం చేసుకున్నారు.


ఆ ఆనందం అనిర్వచనీయం!

భారతీయ రాజభవనం స్ఫూర్తితో రూపొందించిన ఈ ఐసింగ్‌ కేక్‌ నిర్మాణంలో తన అద్భుత నైపుణ్యాల్ని మరోసారి కనబరిచారు ప్రాచీ. 10’1’’ అడుగుల పొడవు, 4’7’’ అడుగుల ఎత్తు, 3’8’’ అడుగుల వెడల్పుతో.. మొత్తంగా 200 కిలోల బరువున్న ఈ కేక్‌తో ముచ్చటగా మూడో రికార్డు సృష్టించడం మర్చిపోలేని అనుభూతి అంటున్నారామె.
‘నేను గత పదకొండేళ్లుగా ఈ కెరీర్‌లో కొనసాగుతున్నా. సొంత రికార్డుల్ని అధిగమిస్తూ కొత్త రికార్డు సృష్టించడంలో ఉన్న ఆనందం, సంతృప్తి మరెందులోనూ దొరకదు. ఇది నన్ను నేను మరింతగా మెరుగుపరచుకునేందుకు దోహదపడుతుంది. మరింత సృజనాత్మకంగా నా పనితీరును కనబరిచేలా ప్రోత్సహిస్తుంది. భారతీయ కళాఖండాల స్ఫూర్తితో ఇటీవలే నేను రూపొందించిన భారీ ఐసింగ్‌ కేక్‌కు ముచ్చటగా మూడో ప్రపంచ రికార్డు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. రాయల్ ఐసింగ్‌ పైపింగ్‌ కళ నా ప్రాణం. ఇందులో మరిన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ నా కళతో అసాధ్యాల్ని సైతం సుసాధ్యం చేయాలనుకుంటున్నా..’ అంటూ తన భవిష్యత్‌ ప్రణాళికల్ని పంచుకుందీ కేక్‌ల రారాణి.

ఇలా తాను తయారుచేసే విభిన్న కేక్‌లను వీగన్‌ రాయల్‌ ఐసింగ్‌తో ఎంబ్రాయిడరీ చేస్తూ, లేస్‌ తరహాలో హంగులద్దుతూ ప్రత్యేకంగా నిలుస్తోందామె. వర్ణించడానికి మాటలు కూడా సరిపోని ఈ కేక్‌ కళాకృతులు చూడగానే ఆకట్టుకోవడమే కాదు.. నోరూరిస్తాయి కూడా! ఇందుకు ఆమె ఇన్‌స్టా పేజీనే నిదర్శనం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని