‘ఎవరో చేసిన తప్పుకు నేనెందుకు బలి కావాలి’ అనుకున్నా!

ఎవరో చేసిన తప్పులు కొంతమంది పాలిట శాపంగా పరిణమిస్తుంటాయి. మరి, ఇలాంటి ప్రతికూలతలు కమ్ముకున్నప్పుడు అక్కడే ఆగిపోతే జీవితానికి అర్థమే లేకుండా పోతుంది.. అదే ధైర్యం చేసి అడుగు ముందుకేస్తే మనమేంటో నిరూపించుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాస్మిన్‌ మన్సూరే జీవితంలోనూ ఇన్ని మలుపులున్నాయి.

Updated : 29 Dec 2021 20:47 IST

(Photo: Twitter)

ఎవరో చేసిన తప్పులు కొంతమంది పాలిట శాపంగా పరిణమిస్తుంటాయి. మరి, ఇలాంటి ప్రతికూలతలు కమ్ముకున్నప్పుడు అక్కడే ఆగిపోతే జీవితానికి అర్థమే లేకుండా పోతుంది.. అదే ధైర్యం చేసి అడుగు ముందుకేస్తే మనమేంటో నిరూపించుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాస్మిన్‌ మన్సూరే జీవితంలోనూ ఇన్ని మలుపులున్నాయి. హాయిగా, ఆనందంగా సాగుతోన్న ఆమె జీవితంలో ఆమ్ల దాడితో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఒళ్లంతా గాయాలై, ఎడమ కన్ను కోల్పోయినా.. తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదామె. ఇరుగుపొరుగు వారు సూటిపోటి మాటలతో వేధించినా తనేంటో నిరూపించుకోవాలనుకుందే తప్ప తిరిగి ఒక్కమాటా అనలేదు.

ఈ స్వీయ ప్రేరణే ఆమెను నలుగురిలో ఒక్కరిగా ఎదిగేలా చేసింది.. ఆమె ప్రతిభ, పట్టుదలకు ప్రభుత్వ ఉద్యోగాలే వరుస కట్టాయి. ఎన్ని ఉద్యోగాలొచ్చినా ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌లో పనిచేయడమే తన లక్ష్యంగా పెట్టుకుందామె! అయితే ఆమ్లదాడి బాధితులకు అందులో అవకాశం లేకపోవడంతో ఆమె అప్లికేషన్‌ను తిరస్కరించారు. ఈ క్రమంలో- రెండేళ్ల పాటు న్యాయ పోరాటం చేసి మరీ తన కలను నెరవేర్చుకుంది. ఎయిమ్స్‌లో నర్సుగా ఉద్యోగం సంపాదించింది. ఈ ప్రస్థానంలో యాస్మిన్‌ జీవితంలోని ఎత్తుపల్లాల్ని ఓసారి తరచి చూద్దాం..!

కొంతమంది చుట్టూ ఉన్న వాళ్లు ఎదుగుతున్నా ఓర్వలేరు.. సంతోషంగా ఉన్నా తట్టుకోలేరు. ఎలాగైనా వాళ్ల ఆనందాన్ని ఆవిరి చేయాలనుకుంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో నివసిస్తోన్న యాస్మిన్‌ మన్సూరే కుటుంబం పైనా ఇలాంటి దాడే జరిగింది. హాయిగా, సంతోషంగా ఉన్న వాళ్ల కుటుంబాన్ని చూసి ఓర్వలేక గిట్టని వాళ్లు ఆ కుటుంబంపై 2004లో ఆమ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యాస్మిన్‌, ఆమె చెల్లెలికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆ మాటలు తట్టుకోలేకపోయా!

ఈ క్రమంలో- వారం పాటు స్థానిక ఆస్పత్రిలోనే చికిత్స పొందిన ఆమె.. ఆ తర్వాత దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాల్సి వచ్చింది. ఇలా సుమారు రెండేళ్ల పాటు ఆస్పత్రి చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. ఇక యాసిడ్‌ చర్మం లోపలి పొరల్లోకి వెళ్లడంతో తన శరీరం చాలా వరకు డ్యామేజ్‌ అయింది. దీనికి తోడు ఎడమ కంటిని కూడా కోల్పోయింది యాస్మిన్‌. ఈ క్రమంలో తనను తాను అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడేదట! ఇక చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్నా ఇరుగుపొరుగు వాళ్ల సూటిపోటి మాటలు ఆమెను మరింత ఒత్తిడిలోకి నెట్టేవి. ‘ఇలాంటి అమ్మాయిల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అసలు వీళ్లకు పెళ్లవుతుందా?’ అంటూ నలుగురూ నానా మాటలూ అనడంతో తీవ్ర మనోవేదనకు గురైందామె. అయితే ఈ బాధను పంటి బిగువున భరిస్తూ.. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే తనను తాను నిరూపించుకోవడమొక్కటే మార్గమని నమ్మానంటోంది యాస్మిన్.

ఇంగ్లిష్‌ చుక్కలు చూపించింది!

తన జీవితంలో ఆమ్ల దాడి మిగిల్చిన వేదనను భరిస్తూనే.. మరోవైపు చదువు పైనా దృష్టి సారించింది యాస్మిన్‌. ఈ క్రమంలోనే దిల్లీ యూనివర్సిటీకి చెందిన గార్గి కాలేజ్‌ నుంచి ఆర్ట్స్‌ విభాగంలో డిగ్రీ పట్టా పుచ్చుకుంది. ‘ఆమ్ల దాడిలో గాయపడిన నేను దిల్లీలో చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే నర్సుగా స్థిరపడాలని నిర్ణయించుకున్నా. దీనికి సంబంధించిన కోర్సు గురించి డిగ్రీ చదివేటప్పుడే తెలుసుకున్నా. ఆ తర్వాత ఎంట్రన్స్‌ రాసి జామియా హమ్దర్ద్‌ కళాశాలలో నర్సింగ్‌ కోర్సులో చేరా. అయితే ఇక్కడ నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇంగ్లిష్‌. నాకు ఈ భాషపై పట్టు లేకపోవడం, కోర్సు అంతా ఇంగ్లిష్‌లోనే ఉండడంతో ఒకరకంగా నాకు పట్టపగలే చుక్కలు కనిపించినట్లైంది. అయితే యాసిడ్‌ దాడి వల్ల సుమారు 60 శాతం పైగా గాయాలతో విపరీతమైన బాధను అనుభవించిన నాకు ఇంగ్లిష్‌ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదనిపించింది.. అందుకే పట్టుదలతో భాష నేర్చుకొని నర్సింగ్‌ కోర్సు పూర్తి చేశా..’ అంటూ చెప్పుకొచ్చింది యాస్మిన్.

కేసు గెలిచి.. ఉద్యోగం సంపాదించి..!

జామియా హమ్దర్ద్‌ కళాశాలలో 2014లో నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన యాస్మిన్‌.. అక్కడే రెండేళ్ల పాటు నర్సుగా విధులు నిర్వర్తించింది. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్‌ ఖాళీల్ని భర్తీ చేయడానికి నిర్వహించిన పరీక్షల్లోనూ ఉత్తీర్ణురాలైందామె. అయితే ఎన్ని ఉద్యోగాలొచ్చినా ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌లో పనిచేయడమే తన లక్ష్యంగా పెట్టుకుందామె! ఇలా ఆమె ఎదురుచూపులకు తెరదించుతూ 2016లో వెయ్యి ఖాళీలతో ఎయిమ్స్‌ నర్సింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంతో సంబరపడిపోయిన యాస్మిన్‌.. ఇందుకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమ్లదాడి బాధితులకు అందులో అవకాశం లేకపోవడంతో ఆమె అప్లికేషన్‌ను తిరస్కరించారు. దీంతో యాసిడ్‌ దాడి బాధితులకు కూడా ఈ పరీక్ష రాసే అవకాశమివ్వాలని దిల్లీ హైకోర్టును ఆశ్రయించిందామె. రెండేళ్ల పోరాటం అనంతరం తాను విజయం సాధించడమే కాదు.. ఆమ్ల దాడి బాధితులతో సహా పలు శారీరక లోపాలున్న వారిని సైతం ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకునేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇలా గతేడాది ఎయిమ్స్‌లో నర్సుగా ఉద్యోగం సంపాదించి.. వార్తల్లో నిలిచింది. 

ఇలా ఈ 17 ఏళ్ల కాలంలో సుమారు 20కి పైగా సర్జరీలు చేయించుకొని.. ఆ బాధను భరిస్తూనే కెరీర్ పైనా దృష్టి సారించింది యాస్మిన్‌. తన కెరీర్‌లో ‘ఉత్తమ ఉద్యోగి’గా జాతీయ అవార్డు అందుకోవడంతో పాటు పలు అవార్డులు-రివార్డులు కూడా అందుకుంది. ‘శారీరక లోపమనేది మన శరీరానికే కానీ.. తపనకు, ఆశయ సాధనకు కాదం’టూ తన మాటలతోనూ నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది యాస్మిన్.
హ్యాట్సాఫ్‌ యాస్మిన్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్