వ్యాపారాభివృద్ధికి సలహాలు కావాలా? మేమిస్తాం!
‘ఓటమి గెలుపుకి నాంది’ అన్నారు పెద్దలు. కొచ్చికి చెందిన అనూజా బషీర్ కూడా ఇదే సూత్రాన్ని నమ్మింది. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని.. వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆమె వరుసగా రెండుసార్లు....
(Photos: Instagram)
‘ఓటమి గెలుపుకి నాంది’ అన్నారు పెద్దలు. కొచ్చికి చెందిన అనూజా బషీర్ కూడా ఇదే సూత్రాన్ని నమ్మింది. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని.. వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆమె వరుసగా రెండుసార్లు విఫలమైంది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని.. ముచ్చటగా మూడోసారికి విజయం చవిచూసింది. ప్రస్తుతం వ్యాపారాలు/స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే వారికి.. వారి వ్యాపారాభివృద్ధికి సంబంధించి అన్ని కోణాల్లో సలహాలిస్తోందామె. ‘అసలు వ్యాపారంలోకి రావాలన్న ఆశ, ఆశయం.. రెండూ లేకపోయినా.. అనుకోకుండా ఇదే నా పూర్తి స్థాయి కెరీర్‌గా మారిపోయిందం’టోన్న బషీర్ వ్యాపార ప్రయాణం గురించి తెలుసుకుందాం రండి..
బషీర్ కుటుంబంలో అందరూ ప్రభుత్వాధికారులే. దీంతో ఒక రకమైన క్రమశిక్షణతో కూడిన కుటుంబ వాతావరణంలో పెరిగిన ఆమె కూడా ప్రభుత్వ అధికారి కావాలనుకుంది. ఈ ఆశయంతోనే సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అయితే పెళ్లయ్యాక దుబాయ్ వెళ్లిపోయిన ఆమె.. దశాబ్దం పాటు అక్కడే సివిల్ ఇంజినీర్‌గా పనిచేసింది. ఆపై భారత్‌కు తిరిగొచ్చిన ఆమె.. కొచ్చిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరింది.
వరుస వైఫల్యాలు!
‘టీచింగ్ నా ప్రవృత్తి. అందుకే దుబాయ్ నుంచి తిరిగి రాగానే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరాను. ఓవైపు ఉద్యోగాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు బోలెడన్ని విషయాలు నేర్చుకున్నా. విద్యార్థులకు పాఠాలు బోధించడంతోనే సరిపెట్టుకోకుండా.. కెరీర్ పరంగానూ వారికి మార్గనిర్దేశనం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో కెరీర్ నైపుణ్యాల్ని పెంచే ఓ వేదికను ప్రారంభించాలనుకున్నా. ఈ ఆసక్తే ‘LIKES’ అనే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ప్రారంభించేందుకు దోహదం చేసింది. ఉద్యోగం వదులుకొని, రూ. 10 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఈ వ్యాపారంలో సక్సెస్ కాలేకపోయా. దాంతో కొన్నాళ్ల పాటు కెరీర్‌కు విరామమిచ్చి ఇంటి బాధ్యతలు నిర్వర్తించా. ఇక 2017లో ఓ మార్కెటింగ్ కంపెనీని ప్రారంభించా. ఈ వేదికగా పలు సంస్థలకు మార్కెటింగ్ వ్యూహాలకు సంబంధించిన సలహాలిచ్చాను. అయితే దురదృష్టవశాత్తూ ఇందులోనూ విఫలమయ్యా. అయినా నిరాశపడలేదు. ఎలాగైనా వ్యాపారంలో నిలదొక్కుకోవాలని సంకల్పించుకున్నా..’ అంటూ తన వరుస వైఫల్యాల గురించి చెప్పుకొచ్చింది బషీర్.
వ్యాపారాభివృద్ధి పాఠాలు!
వరుసగా తన ప్రణాళికలు విఫలమవుతున్నా నిరాశ చెందని బషీర్.. 2019లో Ourea పేరుతో మరో సంస్థను ప్రారంభించింది. ఇన్నాళ్లూ తాను ఏ వ్యాపారాభివృద్ధికి సంబంధించిన నైపుణ్యాలపై పట్టు లేక విఫలమవుతూ వచ్చిందో.. ఆ మెలకువలనే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు/స్టార్టప్‌లు ప్రారంభించే వారికి, కార్పొరేట్ సంస్థలకు అందించాలనుకుంది. 360 డిగ్రీల బిజినెస్ మోడల్‌గా ప్రారంభించిన తన కంపెనీని మరింత అభివృద్ధి చేయడానికి ఏటికేడు కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకొని దాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తోందామె.
‘Ourea’ అంటే గ్రీక్‌లో పర్వతం అని అర్థం. ఎలాగైతే సవాళ్లను దాటుకుంటూ పర్వతారోహణ చేస్తామో.. అదే విధంగా వైఫల్యాలను ఎదుర్కొని, దృఢ సంకల్పంతో వ్యాపారంలో సక్సెస్ కావాలన్న ఆకాంక్షతోనే నా సంస్థకు ఈ పేరు పెట్టుకున్నా. కొత్తగా వ్యాపారాలు/స్టార్టప్‌లు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు, కార్పొరేట్ సంస్థలకు.. వారి వ్యాపారాభివృద్ధికి కావాల్సిన నైపుణ్యాలు నేర్పించడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. ప్రస్తుతం ఆయా సంస్థల అవసరాల్ని బట్టి.. బ్రాండింగ్, డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, స్ట్రాటజిక్ మార్కెటింగ్, SEO సేవలు, వెబ్ డిజైన్ డెవలప్‌మెంట్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, వెబ్ మెయింటెనెన్స్, హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్.. వంటి సేవలందిస్తున్నాం..’ అంటూ చెప్పుకొచ్చింది బషీర్.
ఆ పట్టుదల కావాలి!
ఇలా మూడేళ్లలో వెయ్యికి పైగా స్టార్టప్‌లు/కార్పొరేట్ సంస్థలకు తమ వ్యాపారాభివృద్ధిలో మార్గనిర్దేశనం చేసిన బషీర్.. ‘ఫ్లెక్సీక్లౌడ్’ అనే మరో సంస్థకు సీఎంవోగా కొనసాగుతోంది. ఒకప్పుడు వ్యాపారంలో వరుస వైఫల్యాలు చవి చూసిన ఆమె.. ఇప్పుడు అదే వ్యాపారంలో నలుగురికీ సలహాలిస్తూ.. వారి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న బషీర్.. ‘40 అండర్ 40 ఇండియన్ అఛీవర్స్ క్లబ్’లో చోటు దక్కించుకుంది. మరోవైపు ఫోర్బ్స్, ఫార్చ్యూన్.. వంటి పత్రికలు విడుదల చేసిన జాబితాల్లోనూ స్థానం సంపాదించింది. బషీర్ మంచి వక్త కూడా! టెడెక్స్ వంటి వేదికలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయడంతో పాటు.. వ్యాపార మెలకువలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతూ ఎంతోమంది మహిళల్లో ప్రేరణ కలిగిస్తుంటారామె. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలు తమ ఆశయాల్ని విడిచిపెట్టకూడదం’టూ స్వీయానుభవంతోనే తనను తాను నిరూపించుకున్నారామె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.