Beauty Contest: తల్లైనా తపనను వీడలేదు!
కెరీర్‌పై స్పష్టత, లక్ష్యంపై తపన ఉంటే.. పెళ్లైనా, పిల్లలు పుట్టినా అనుకున్నది సాధించచ్చు.. అని నిరూపిస్తుంటారు కొందరు మహిళలు. మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్ దివ్య పటిదార్ జోషి కూడా అలాంటి అరుదైన కోవకే చెందుతుంది. చిన్న వయసు నుంచే మోడలింగ్, సమాజ సేవ, నటన, సంగీతం.. వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన.....
(Photos: Instagram)
కెరీర్‌పై స్పష్టత, లక్ష్యంపై తపన ఉంటే.. పెళ్లైనా, పిల్లలు పుట్టినా అనుకున్నది సాధించచ్చు.. అని నిరూపిస్తుంటారు కొందరు మహిళలు. మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్ దివ్య పటిదార్ జోషి కూడా అలాంటి అరుదైన కోవకే చెందుతుంది. చిన్న వయసు నుంచే మోడలింగ్, సమాజ సేవ, నటన, సంగీతం.. వంటి రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఆమెకు ఎప్పటికైనా అందాల కిరీటం గెలవాలన్నది కల. అయితే వివాహ బంధంలోకి అడుగుపెట్టినా.. భర్త, అత్తింటి వాళ్ల ప్రోత్సాహంతో ఇటీవలే ‘మిసెస్ యూనివర్స్ సెంట్రల్ ఏషియా - 2021’ కిరీటాన్ని గెలుచుకొని తన చిరకాల స్వప్నం నెరవేర్చుకుందామె. ఈ నేపథ్యంలో ఈ అందాల రాణి సక్సెస్‌ఫుల్ జర్నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..!
దివ్యది మధ్యప్రదేశ్‌లోని రత్లాం. కాలేజీలో ఉన్నప్పట్నుంచే మోడలింగ్, సమాజ సేవ, నటన, సంగీతం.. వంటి అంశాల్లో చాలా చురుగ్గా ఉండేది. తనలోని సంగీత నైపుణ్యాలతో ‘సరిగమప’, ‘ఇండియన్ ఐడల్’.. వంటి టీవీ కార్యక్రమాల్లో సత్తా చాటింది. 2013లో రత్లాంకు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ ప్రయాస్ జోషీని వివాహమాడిన ఆమెకు.. ఆర్యమాన్ అనే మూడేళ్ల కొడుకున్నాడు.
అత్తింటి వారి ప్రోత్సాహంతో..!
చాలామంది ఆడపిల్లలు పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక తమ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెడుతుంటారు.. కారణం-వారికి తగిన ప్రోత్సాహం లేకపోవడమే! అయితే ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతురాలినంటోంది దివ్య. ‘పెళ్లైనా చదువు, కెరీర్ లక్ష్యాలపై శ్రద్ధ పెట్టగలిగానంటే అదంతా నా భర్త, అత్తింటి వారి ప్రోత్సాహమే! వివాహం తర్వాతే ఎంబీఏ, ఎంఏ, పీహెచ్‌డీ పూర్తి చేశాను. అందాల కిరీటం గెలుచుకోవాలన్నది నా చిన్ననాటి కల. ఈ విషయంలోనూ మా అత్తింటి వాళ్లు నన్ను ప్రోత్సహించారు. 2018లో ఏడాది పసిబిడ్డను తీసుకొని అందాల పోటీల్లో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లా. అక్కడే ‘మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ అవార్డు’ గెలుచుకున్నా. ఆ మరుసటి ఏడాది ‘మిసెస్ యురేషియా’ కిరీటం అందుకున్నా..’ అంటూ తన తపన గురించి చెప్పుకొచ్చింది దివ్య.
తాను డిజైన్ చేసుకున్న గౌన్‌లోనే..!
కేవలం జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ వేదిక పైనా జయకేతనం ఎగరేయాలని పరితపించింది దివ్య. ఈ క్రమంలో ఇటీవలే దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా నిర్వహించిన ‘మిసెస్ యూనివర్స్ సెంట్రల్ ఏషియా-2021’ పోటీల్లో పాల్గొంది. ప్రపంచవ్యాప్తంగా 120 మంది సుందరాంగుల్ని వెనక్కి నెట్టి ఈ పోటీలో విజయం సాధించిందామె. అంతేకాదు.. ఇదే కాంపిటీషన్‌లో ‘మిసెస్ యూనివర్స్ ఇన్‌స్పిరేషన్’ కిరీటాన్ని సైతం సొంతం చేసుకుంది. దివ్యకు దుస్తులు కుట్టడం, డిజైన్ చేయడంలో ప్రావీణ్యం ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే పాల్గొన్న పోటీల్లో భాగంగా తుది రౌండ్‌కు.. తానే స్వయంగా డిజైన్ చేసుకున్న గౌన్ ధరించి.. తన కలల కిరీటాన్ని అందుకోవడం విశేషం.
సేవకు బ్రాండ్ అంబాసిడర్!
సమాజ సేవలో పీహెచ్‌డీ చేసిన దివ్య.. తన వంతుగా ఈ సమాజానికి ఏదో ఒక విధంగా సహాయపడాలని తపించేది. ఈ క్రమంలోనే ‘ది గ్రోయింగ్ వరల్డ్ ఫౌండేషన్’, ‘ది గ్రోయింగ్ ఇండియా ఫౌండేషన్’.. వంటి స్వచ్ఛంద సంస్థల్ని నెలకొల్పింది. వీటి ద్వారా మహిళలు, పిల్లల సంక్షేమానికి పాటుపడుతోంది. నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొంటోన్న వివక్ష, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు తన వంతుగా కృషి చేస్తోంది దివ్య. అయితే కరోనా సమయంలో తన తండ్రి మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన ఆమె.. తన తల్లి రాధా పటిదార్ సహకారంతోనే ఈ ఒత్తిడి నుంచి బయటపడగలిగానంటోంది. అంతేకాదు.. అదే సమయంలో ఒత్తిడి, ఆందోళనలు.. వంటి మానసిక సమస్యలపై అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు సైతం చేపట్టింది దివ్య. అంతటితో ఆగకుండా.. మధ్యప్రదేశ్‌లోని 11 మారుమూల గ్రామాలను దత్తత తీసుకొని.. నిస్వార్థంగా వాటి అభివృద్ధికి కూడా కృషి చేస్తోందామె. ఇలా ఆమె చేస్తోన్న సేవల్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
ఇలా ఓవైపు ఇల్లాలిగా-అమ్మగా, మరోవైపు కెరీర్‌లోనూ విజయం సాధిస్తూనే.. సమాజ సేవతో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్న ఈ అందాల రాశి.. నేటి మహిళలందరికీ ఆదర్శం అనడం అతిశయోక్తి కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.