స్టార్టప్‌లకు సలహాలిచ్చే ‘స్టార్టప్‌’ ఇది!

మనసులో ఒక ఆలోచన పెట్టుకొని.. ఇతరుల ఒత్తిడితో మరో విషయంపై దృష్టి సారిస్తే ఏమవుతుంది..? అపజయమే ఎదురవుతుంది. దిల్లీకి చెందిన నేహా నగర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. చిన్న వయసు నుంచే వ్యాపారంపై ప్రేమ పెంచుకున్న ఆమెను.. తన తల్లిదండ్రులు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా చూడాలనుకున్నారు.

Published : 16 Nov 2021 15:41 IST

(Photo: Screengrab)

మనసులో ఒక ఆలోచన పెట్టుకొని.. ఇతరుల ఒత్తిడితో మరో విషయంపై దృష్టి సారిస్తే ఏమవుతుంది..? అపజయమే ఎదురవుతుంది. దిల్లీకి చెందిన నేహా నగర్‌ విషయంలోనూ ఇదే జరిగింది. చిన్న వయసు నుంచే వ్యాపారంపై ప్రేమ పెంచుకున్న ఆమెను.. తన తల్లిదండ్రులు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా చూడాలనుకున్నారు. కానీ అది ఆమెకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు. దీంతో ఒకటి కాదు, రెండు కాదు.. మూడుసార్లు అందులో ఫెయిలైంది. ఇక పేరెంట్స్‌ తెచ్చిన పెళ్లి ప్రస్తావన నచ్చక.. ఎంబీఏలో చేరింది. మక్కువతో చదివింది.. అందరూ వెళ్లే దారిలో కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకుంది. ఇలా తన కలను సాకారం చేసుకునే క్రమంలో ఓ స్టార్టప్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం దీని ద్వారా ఎన్నో స్టార్టప్‌ల/వ్యాపారాల చట్టపరమైన అవసరాలు తీర్చుతూ ‘ది వన్‌ అండ్‌ ఓన్లీ’ అనిపించుకుంటోంది. సవాళ్లు ఎదుర్కొన్నప్పుడే సక్సెస్‌ సాధ్యమంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

పాతికేళ్ల నేహకు చిన్నతనం నుంచి బిజినెస్‌ ప్లానింగ్‌ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే పెద్దయ్యాక స్టార్టప్‌లు/వ్యాపారాలు ప్రారంభించే వారికి తగిన సలహాలివ్వడం, వారి వ్యాపారాన్ని వృద్ధి చేసే ప్రణాళికలు రచించేందుకు వీలుగా తానే ఓ కంపెనీని ప్రారంభించాలనుకుంది. అయితే తనది సంప్రదాయ కుటుంబం కావడంతో చదువు, ఉద్యోగాలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు ఆమె తల్లిదండ్రులు. దీనికి తోడు స్కూల్లో, కాలేజీలో తనకు స్నేహితులు ఎక్కువగా లేకపోవడం, బాడీ షేమింగ్‌కి గురవడం.. వంటి అంశాలు ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపాయి.

9-5 ఉద్యోగం నచ్చక!

తనకు ఇష్టం లేకపోయినా తన తల్లిదండ్రుల ఒత్తిడితో సీఏ పరీక్షలు రాసింది నేహ. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడుసార్లు ఇందులో ఫెయిలైంది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. దాన్నుంచి తప్పించుకోవడానికి ఎంబీఏలో చేరిందామె. ఎలాగూ ముందు నుంచీ వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన ఉంది కాబట్టి.. ఈ కోర్సులో దానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చన్న ఉత్సుకతతో చదువు సాగించింది నేహ. మరోవైపు ఫైనాన్స్‌లో ఇంటర్న్‌షిప్‌ కూడా చేసింది. ఆ తర్వాత దిల్లీలో ఉద్యోగం రావడం, పెళ్లి.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు IIFL Securities, Paytm, Groww, Amazon, CoinSwitch, Bajaj Finserv, ICICI Bank.. వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేసింది. అయినా మనసంతా వ్యాపారంపై ఉన్నప్పుడు 9-5 ఉద్యోగం చేయడం ఆమెకు ఎంత మాత్రమూ నచ్చలేదు. అయితే ఇన్ని రోజులు తన ఆలోచనలకు తల్లిదండ్రులు అడ్డుపడ్డట్లుగానే ఇప్పుడు అత్తమామలూ ససేమిరా అన్నారు. కానీ భర్త ప్రోత్సాహం తనకు కొండంత బలాన్నివ్వడంతో తన కల నెరవేర్చుకునే దిశగా అడుగులేశానంటోందీ బిజినెస్‌ లవర్‌.

అందుకే ఈ నిర్ణయం!

‘చాలామందికి వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది. కానీ దాన్ని ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? దాని ప్రణాళిక, పెట్టుబడి.. వంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండదు. తద్వారా వ్యాపారాల్లో నష్టాల్ని చవిచూసే వారే ఎక్కువ. నాకూ వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఇలాంటి అనుభవాలు కొన్ని ఎదురయ్యాయి. అందుకే ఇలాంటి వారికి మార్గనిర్దేశనం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే Taxationhelp.in పేరుతో ఓ స్టార్టప్‌ని ప్రారంభించా. దీని ద్వారా కేవలం వ్యాపార ప్రణాళికలు, సలహాలు రూపొందించడమే కాదు.. స్టార్టప్‌లు/వ్యాపారాల చట్టపరమైన, వృత్తిపరమైన అవసరాలను తీర్చే వేదికగా కూడా దీన్ని తీర్చిదిద్దా. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వ్యాపారాలు/స్టార్టప్‌లకు సంబంధించిన ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు, ట్యాక్స్‌ ఫైలింగ్‌, అకౌంటింగ్‌, డాక్యుమెంటేషన్‌, కాపీ రైట్‌ రిజిస్ట్రేషన్‌, పేటెంట్‌ హక్కులు, ఆస్తి ఒప్పంద పత్రాలు రూపొందించడం.. తదితర సేవల్ని అందిస్తున్నాం..’ అంటూ తన స్టార్టప్‌ విశేషాలు పంచుకుందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌.

ఆర్థిక అవగాహన ముఖ్యం!

ఓవైపు వ్యాపారాలకు సంబంధించిన చట్టపరమైన అవసరాల్ని తీర్చడమే కాదు.. మరోవైపు ఆర్థిక విషయాలపై అందరిలో అవగాహన నింపుతోంది నేహ. ముఖ్యంగా మహిళలందరికీ ఆర్థిక స్వాతంత్ర్యమే కాదు.. ఆర్థిక అవగాహనా ముఖ్యమేనంటోంది. ఈ క్రమంలోనే ఆర్థిక అంశాలకు సంబంధించిన వీడియోలు రూపొందిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ‘ఈ రోజుల్లో చాలామంది మహిళలు ఆర్థిక స్వేచ్ఛ సాధించారు. కానీ ఆర్థిక విషయాల్లో అవగాహన ఉన్న స్త్రీలు ఎంతమంది అంటే వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. ఈ సమీకరణాన్ని మార్చడానికే ఆర్థిక విషయాలకు సంబంధించిన వీడియోలు రూపొందిస్తున్నా. ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తున్నా. అలాగే విదేశాల్లో పాఠశాల దశ నుంచే పిల్లలకు డబ్బు, పొదుపు-మదుపు, పెట్టుబడులు.. వంటి అంశాల గురించి బోధిస్తారు.. ప్రయోగాత్మకంగా వాళ్లతో పాటింపజేస్తారు. ఇదే విధానాన్ని ఇక్కడి స్కూళ్లలో అమలు చేస్తే పరిస్థితుల్లో చాలా వరకు మార్పు తీసుకురావచ్చు..’ అంటోంది నేహ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్