7వేల విగ్రహాలు చేశా!

ఎన్నో అరుదైన రంగాల్లోకి మహిళలు ఇప్పుడు అడుగుపెడుతున్నారు. కానీ దశాబ్దాల క్రితమే ఆ సాహసం చేశారు దేవగుప్తపు దేవికారాణి ఉడయార్‌! మగవారే ఎక్కువగా ఉండే శిల్పకళా రంగంలో అడుగుపెట్టి తొలి తెలుగు మహిళా శిల్పిగా నిలిచారు. అంతర్జాతీయ గుర్తింపుతోపాటు ఎన్నో పురస్కారాలూ అందుకున్నారు. ‘శిల్ప కళ నాకు జీవనాధారం కాదు.

Updated : 21 Jan 2023 04:54 IST

ఎన్నో అరుదైన రంగాల్లోకి మహిళలు ఇప్పుడు అడుగుపెడుతున్నారు. కానీ దశాబ్దాల క్రితమే ఆ సాహసం చేశారు దేవగుప్తపు దేవికారాణి ఉడయార్‌! మగవారే ఎక్కువగా ఉండే శిల్పకళా రంగంలో అడుగుపెట్టి తొలి తెలుగు మహిళా శిల్పిగా నిలిచారు. అంతర్జాతీయ గుర్తింపుతోపాటు ఎన్నో పురస్కారాలూ అందుకున్నారు. ‘శిల్ప కళ నాకు జీవనాధారం కాదు.. జీవన విధాన’మంటోన్న ఆవిడని వసుంధర పలకరించింది.

శిల్పి సమాధి స్థితిలోకి వెళితేగానీ శిల్పం తయారవదు. అంత ఏకాగ్రత కావాలి. దానిలో నా ప్రయాణం నాలుగు దశాబ్దాలుగా సాగుతోంది. నాన్నకు శిష్యురాలిగా మొదలుపెట్టి, సొంత గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదిగా. మాది పశ్చిమగోదావరి జిల్లాలోని నత్తారామేశ్వరం. 30ఏళ్ల క్రితమే తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డాం. నాన్న ఆచార్య శ్రీనాథరత్న శిల్పి ఉడయార్‌ విదేశాల్లోనూ ఖ్యాతి గడించారు. ఆయన్ని చూసే నాకూ ఆసక్తి కలిగింది. అయిదో తరగతిలో ఉన్నప్పుడు తనిఖీకి స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌ వచ్చారు. ఆయనకు బహుమతిగా ఇవ్వడానికని ప్రధానోపాధ్యాయులు నన్నో బొమ్మ గీయమన్నారు. పెన్సిల్‌తో రామానుజాచార్యుల చిత్రం గీసిస్తే.. అధికారి మెచ్చుకొని బహుమతిగా రూ.5 ఇచ్చారు. అప్పట్లో అది పెద్దమొత్తమే! ఆ ప్రోత్సాహం ఈ రంగంలో కొనసాగడానికి కారణమైంది. పదేళ్లలోపే వినాయకుడు, శివుడి విగ్రహాలు తయారు చేశా. నాకు 13 ఏళ్లకే వివాహమైంది. బాబు పుట్టాక నాన్న వద్ద శిష్యరికం చేస్తూనే ప్రైవేటుగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ చదివా.

ఎన్టీఆర్‌ మెచ్చుకున్నారు..

ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉంచడానికి విగ్రహాల తయారీ అవకాశమొచ్చింది. అప్పుడు అన్నమాచార్య, మొల్ల విగ్రహాల తయారీలో నాన్నకు సహాయకురాలిగా ఉన్నా. వాటిని చూసి, ఎన్టీఆర్‌ ఎంతో మెచ్చుకున్నారు. నాన్న 60 ఏళ్లు వచ్చేవరకూ శిల్పాలు చేశారు. ఆయనకు సహాయకురాలిగా ఉంటూనే సొంతంగానూ తయారుచేశా. అమెరికా, యూకే, సింగపూర్‌ దేశాల్లోని దేవాలయాల్లో నేను చేసిన విగ్రహాలున్నాయి. మైఖేల్‌ జాక్సన్‌ శిల్పాన్ని తయారుచేసి నృత్యదర్శకుడు ప్రభుదేవా, కవి సి.నారాయణరెడ్డిల ద్వారా అమెరికా పంపా. దిల్లీ ఆంధ్రాభవన్‌లో ప్రతిష్ఠించిన 8 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం తయారు చేయడం గొప్పగా భావిస్తా. ఫైబర్‌, బంగారం, వెండి, కాంస్యం, రాగి, పంచ లోహాలన్నింటితో దాదాపు 7వేల విగ్రహాలు చేశా. సముద్రాల రాఘవాచార్యులు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ప్రభాకరరెడ్డి, దగ్గుబాటి రామానాయుడు, సల్మాన్‌ఖాన్‌, దాసరి నారాయణరావు, బాపు, డీవీఎస్‌ రాజు, ఎస్వీ రంగారావు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోపాటు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి ఎందరో సినీ, రాజకీయ ప్రముఖుల కాంస్య విగ్రహాలు రూపొందించా. సినీనటి విజయనిర్మల బంగారు పాదాలను తయారు చేసిచ్చా.

అవే వరించాయి

పని చేసుకుంటూ వెళ్లడమే నా విధి. పురస్కారాలే వెతుక్కుంటూ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి పురస్కారాలు అందుకున్నా. ఏపీ శిల్ప కళారత్న తదితరాలెన్నో వచ్చాయి. నా సంపాదనలో కొంత కళాసంఘాలు, వృద్ధాశ్రమాల నిర్మాణం, నిర్వహణకు అందిస్తున్నా. శిల్ప కళ మరుగున పడకూడదని ఆసక్తి ఉన్నవారికి నేర్పిస్తున్నా. కోల్‌కతా, మహారాష్ట్ర నుంచి 30 మందికిపైగా నా దగ్గర శిక్షణ తీసుకున్నారు. మనవాళ్లకీ నేర్పిస్తుంటా. నేర్చుకుంటూ నావద్ద పనిచేస్తుంటారు. వాళ్లకి జీతాలూ ఇస్తా. నాకు వాస్తు, జ్యోతిషాల్లోనూ ప్రావీణ్యం ఉంది. దేవత, మానవ మూర్తుల విగ్రహాలను చేసేప్పుడు నిష్ఠ తప్పక పాటిస్తా. రోజూ తలస్నానం.. ఇంట్లో పూజతోపాటు ఒంటిపూట భోజనం చేస్తా. ఒకసారి తయారీ మొదలుపెడితే చుట్టూ ఏం జరుగుతోందో తెలియని సమాధి స్థితిలోకి వెళ్లిపోతా. తాతలు, నాన్న అంతా పేరు మోసిన శిల్పులే కాబట్టి, ఇబ్బందులేమీ ఎదుర్కోలేదు. అయిదో తరంగా మా బాబు శ్రీనివాస శిల్పి కూడా ఈ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది.

-డాక్టర్‌ గురువెల్లి రమణమూర్తి, ఎం.రాజశేఖర్‌, తాడేపల్లిగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్