Swati Piramal: అప్పుడు ఆ అమ్మాయిని చూసి చలించిపోయా..!

‘ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. విజయం సాధించగలం..’ అంటారు ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త, పిరమల్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ స్వాతి పిరమల్. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకు తెరతీసిన ఆమె.. బాలికలు, మహిళల్లో సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన....

Published : 20 Sep 2022 20:52 IST

(Photos: Twitter)

‘ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం.. విజయం సాధించగలం..’ అంటారు ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త, పిరమల్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ స్వాతి పిరమల్. ఆరోగ్యం, ఔషధ రంగాల్లో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకు తెరతీసిన ఆమె.. బాలికలు, మహిళల్లో సంపూర్ణ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నిరాడంబరతకు మారుపేరుగా నిలిచే ఆమె.. వక్తగా, రచయిత్రిగానూ ఎంతోమందికి సుపరిచితం! ఇలా వైద్య, ఆరోగ్య రంగాల్లో తాను చేసిన సేవలకు గుర్తింపుగా ఇదివరకే ఎన్నో పురస్కారాలు అందుకున్న స్వాతి సిగలో ఇటీవలే మరో ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. అదే.. ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం! పైగా ఇది ఆ దేశ ప్రభుత్వం ఆమెకు అందించిన రెండో పౌర పురస్కారం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆరోగ్య, ఔషధ రంగాల్లో స్వాతి చేసిన కృషి గురించి తెలుసుకుందాం!

గుజరాతీ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన స్వాతి పిరమల్ది వ్యాపార నేపథ్యమున్న కుటుంబం. ఆమె తల్లిదండ్రులిద్దరూ వ్యాపారవేత్తలే.  దాంతో తానూ ఈ రంగంలోనే స్థిరపడాలని కోరుకున్నారు స్వాతి. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ నుంచి పబ్లిక్‌ హెల్త్‌లో మాస్టర్స్‌ పూర్తిచేసిన ఆమె.. ముంబయి యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ పట్టా అందుకున్నారు. 1976లో ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరమల్ను పెళ్లి చేసుకున్నాకే ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు స్వాతి. వృత్తిరీత్యా డాక్టర్‌ అయిన ఆమె.. ‘గోపాల్‌కృష్ణ పిరమల్ హాస్పిటల్‌’ను నెలకొల్పారు. 1992 నుంచి ‘పిరమల్ గ్రూప్‌’కు వైస్‌ ఛైర్‌పర్సన్‌గానూ కొనసాగుతున్నారు.

అవగాహనతోనే చైతన్యం!

‘ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం’ అంటారు స్వాతి. మూడు దశాబ్దాలకు పైగా తన సంస్థ అభివృద్ధిలోనూ ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారామె. ఓ శాస్త్రవేత్తగా తన పరిశోధనలు, అనుభవం, వ్యాపార దక్షతతో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీ-ఉత్పత్తి సంస్థగా పిరమల్ గ్రూప్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు స్వాతి. తాను నెలకొల్పిన ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచడానికి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారామె. ఇందులో భాగంగానే.. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్టియోపొరోసిస్‌, మలేరియా, మధుమేహం, ట్యూబర్‌క్యులోసిస్‌, ఎపిలెప్సీ, పిల్లలకు టీకా ప్రాధాన్యం.. వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఇలా ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేయడానికి అనుక్షణం పరితపిస్తుంటారు స్వాతి.

అది చూసి చలించిపోయా!

వక్తగా జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై ప్రసంగించే స్వాతి.. రచయిత్రి కూడా! పోషకాహారం, ఆరోగ్యానికి సంబంధించి పలు పుస్తకాలు రాసిన ఆమె.. మీడియాకూ కథనాలు రాస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ ఆర్టికల్‌లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.

‘నేను మెడిసిన్‌ చదివే సమయంలో ఓ ప్రాంతానికి వెళ్లాను. అక్కడ పోలియో కారణంగా శరీరం కింది భాగం పక్షవాతానికి గురైన ఓ అమ్మాయిని చూశా. చాలా బాధనిపించింది. అప్పుడే టీకాల గురించి తల్లుల్లో అవగాహన పెంచాలనిపించింది. ఇదే ‘నో పోలియో జోన్‌’ అనే కార్యక్రమానికి తెర తీసింది. నాతో పాటు మెడిసిన్‌ చదువుతున్న స్నేహితులతో కలిసి వీధి నాటకాలు, ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ టీకాల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టాం. టీకా డోసులు తీసుకోని చిన్నారుల్ని గుర్తించి వారికి ఇప్పించాం. ఆ తర్వాత కూడా హెచ్ఐవీ/ఎయిడ్స్‌, అమ్మాయిల్లో రక్తహీనతను నివారించడం, వ్యాయామాలు.. వంటి అంశాలపై అవగాహన పెంచడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించాం..’ అంటూ చెప్పుకొచ్చారు స్వాతి.

మహిళల కోసం ‘హెల్ప్‌లైన్’!

గ్రామీణ/గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు టెలీమెడిసిన్‌ సేవలతో పాటు వారికి సురక్షిత గర్భనిరోధక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ‘i-canhelp’ అనే హెల్ప్‌లైన్‌ సేవలూ అందుబాటులోకి తెచ్చారు స్వాతి. ఇక అమ్మాయిల్లో అవాంఛిత గర్భధారణ, అసురక్షిత గర్భస్రావ పద్ధతుల గురించి వివరించడానికి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మరోవైపు ‘పిరమల్ ఫౌండేషన్’ డైరెక్టర్‌గా గ్రామీణ ప్రాంత మహిళల సాధికారతకు కృషి చేస్తున్నారామె. ఇలా తన సేవలతో సమాజంలో ఆరోగ్య స్పృహ పెంచే దిశగా కృషి సలుపుతోన్న స్వాతి.. ప్రస్తుతం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ అడ్వైజర్స్‌ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. గతంలోనూ పలు సంస్థల్లో బోర్డు మెంబర్‌గా ఉన్నారీ సూపర్‌ ఉమన్.


సేవకు సత్కారం!

వైద్యారోగ్య, ఔషధ రంగాల్లో చేస్తోన్న కృషికి గుర్తింపుగా ఇదివరకే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు స్వాతి. 2012లో ‘పద్మశ్రీ’ అందుకున్న ఆమె.. 2018లో భారత రాష్ట్రపతి కోవింద్‌ చేతుల మీదుగా ‘ఫస్ట్‌ లేడీస్‌ అవార్డు’ స్వీకరించారు. 2011లో ఫార్చ్యూన్‌ ఇండియా విడుదల చేసిన ‘అత్యంత శక్తిమంతమైన వ్యాపార మహిళల’ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు. అంతేకాదు.. వాణిజ్యం, పరిశ్రమలు, సైన్స్‌, ఔషధ రంగాల్లో సేవలు, భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాల బలోపేతానికి కృషి చేసిన ఆమెను ఇటీవలే ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి క్యాథరిన్‌ కొలోనా భారత పర్యటనలో భాగంగా స్వాతికి.. ఈ అవార్డును (Knight of the Legion) బహూకరించారు. 2006లోనూ ఫ్రాన్స్‌ రెండో అత్యున్నత పురస్కారాన్ని (Knight of the Order of Merit) స్వాతి అందుకోవడం విశేషం.

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో నిరాడంబరంగా ఉంటారు స్వాతి. స్వాతి-అజయ్ జంటకు ఇద్దరు సంతానం. కొడుకు ఆనంద్ కూతురు నందిని... ఆనంద్‌.. రిలయన్స్‌ అధినేత కుమార్తె ఈషా అంబానీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని