Preeti vishwakarma: ట్రెక్కింగ్‌లో ఫిట్స్‌ వచ్చి పడిపోయా...

కొన్ని వ్యాధులను మందులతో తగ్గించొచ్చు. అయితే ఆమెకొచ్చే ఫిట్స్‌కు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం ఉండదు. దీంతో ఆమెను ఒంటరిగా బయటకెళ్లొద్దనే వారు.

Updated : 19 May 2023 05:31 IST

కొన్ని వ్యాధులను మందులతో తగ్గించొచ్చు. అయితే ఆమెకొచ్చే ఫిట్స్‌కు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం ఉండదు. దీంతో ఆమెను ఒంటరిగా బయటకెళ్లొద్దనే వారు. ఎవరితోనూ ఈ సమస్యను చెప్పొద్దనే వారు. కానీ.. మనసు మాటవింటూ.. ఒంటరిగా దేశమంతా పర్యటిస్తున్నారీమె. పైగా మహిళా పర్యటకుల కోసం స్టార్టప్‌ నడుపుతున్నారీమె. సమస్యకే సవాల్‌ విసురుతున్న ప్రీతి విశ్వకర్మ కథనమిది.

ప్రీతి వాళ్లది ఉత్తర్‌ ప్రదేశ్‌. తను పుట్టినప్పుడు ఆ విషయాన్ని వాళ్ల నాన్నకు చెప్పేటప్పుడు సంకోచించారు. ఎందు కంటే ఆడపిల్ల అని. మగ పిల్లాడు లేని కుటుంబమని అందరి నుంచి విమర్శలు మొదలయ్యాయి. ‘నేను ఆడపిల్లనైనందుకు అమ్మ నిరాశపడేది. నాన్న మాత్రం నన్ను ప్రోత్సహించే వారు. చిన్నప్పుడు అందరిలాగే ఉన్నాను. పదోతరగతిలో ఓసారి స్పృహతప్పి పడిపోయా. వైద్యులు పరీక్షించి ఒత్తిడి వల్లే అనడంతో దీని గురించి అందరం మర్చిపోయాం. తర్వాత డిగ్రీ చేసి ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు చదువుతున్నప్పుడు మళ్లీ ఫిట్స్‌ వచ్చాయి. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స చేశారు. అప్పుడు ఈ అనారోగ్యం గురించి వైద్యులు చెప్పారు. అందరూ ‘అసలే ఆడపిల్ల. పాపం ఫిట్స్‌ వస్తుంటాయి. పెళ్లెవరు చేసుకుంటారు అని జాలిచూపే వారు. ఒంటరిగా బయటికెళ్లొద్దని, ఎవరితోనూ దీని గురించి చెప్పొద్దనే వారు. ఇవన్నీ చాలా బాధించేవి. ఒత్తిడిగా ఉండేది. దీన్నుంచి బయటపడటానికి ఎక్కడికైనా వెళ్లాలనిపించిందం’టారు 32 ఏళ్ల ప్రీతి.

గాయాలైనా.. తను ప్రారంభించిన స్టార్టప్‌తో మహిళా బృందాలను పలు సాహస యాత్రలకు తీసుకెళ్లారు. ఇప్పటివరకు 25 రాష్ట్రాలు సహా భూటాన్‌, నేపాల్‌, ఇండోనేషియా వంటి దేశాల్లోనూ పర్యటించారు. ‘మొదట్లో నా ట్రెక్కింగ్‌ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు కొందరు సందేహించే వారు. ఒంటరిగా వెళ్లానంటే నమ్మే వారు కాదు కాలేజీ అమ్మాయిలను పంపడానికి కొందరు తల్లిదండ్రులు సంశయించేవారు. ఈ అనారోగ్యంతో వారి పిల్లల భద్రతకు నేనెలా భరోసా ఇవ్వగలనని ప్రశ్నించేవారు. అయినా వారికి ఓపిగ్గా అవగాహన కలిగించేదాన్ని. మరికొందరు మాత్రం ప్రశంసించేవారు. నాతో టూర్స్‌కు రావడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం 20 నుంచి 70 ఏళ్ల వయసు వరకూ మహిళలు నాతో టూర్‌లకు వస్తున్నారు. ప్రతిసారీ 15 మంది ఉంటారు. ఏటా 15 ట్రిప్స్‌ వేస్తుంటా. నాతో వచ్చేవారందరికీ నా గురించి ముందుగానే చెబుతా. ఒక్కోసారి ఫిట్స్‌తో పడిపోయినప్పుడు గాయాలూ అవుతాయి. ఓసారిలానే మెలకువ వచ్చే సరికి ఎడమకంటి మీద కుట్లు వేసి ఉన్నాయి. అలాంటప్పుడు కొంత విశ్రాంతి తర్వాత మా ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఏ పరిస్థితుల్లోనూ భయపడకుండా ధైర్యంగా ఉండే నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఇటువంటి అనారోగ్యం ఉన్న ఒకామె నాకు సందేశం పంపింది. తను అయిదేళ్లగా నాలుగ్గోడల మధ్యే ఉంటున్నట్లు చెప్పింది. ఈ అనారోగ్యంతోనూ అందరిలా సంతోషంగా ఉండొచ్చని తనకు, తన కుటుంబానికి అవగాహన కల్పించి బయటకు తీసుకొచ్చా. నాలాంటి వారిలో స్ఫూర్తిని నింపాలన్నది నా ఆశయమంటో’న్న ప్రీతి ప్రయత్నం ప్రశంసనీయం కదూ...


తొలిసారిగా.. తనతో ట్రిప్‌కు రమ్మని ప్రీతి స్నేహితులను అడిగితే ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ఒంటరి ప్రయాణానికే సిద్ధమయ్యారీమె. ‘నా 23 ఏళ్లప్పుడు మొదటి సారిగా ధర్మశాలకు ట్రెక్కింగ్‌కెళ్లా. అమ్మ భయపడినా, నాన్న ధైర్యాన్నిచ్చారు. ఈ ప్రయాణం నాలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఆ తర్వాత మరెన్నో ట్రెక్స్‌ సునాయసంగా పూర్తిచేశా. విల్‌పవర్‌ ఉంటే చాలు. ఏదీ అడ్డుకాదు. ఇదే అందరికీ చెప్పి అవగాహన కల్పించాలనిపించింది. ఒంటరిగా ప్రయాణించేటప్పుడు పెద్దగా రక్షణ ఉండదని అపోహతో చాలామంది మహిళలు వెనుకడుగు వేస్తున్నట్లు గుర్తించా. ఇటువంటివారి కోసం 2016లో ‘వుమెనియా ఆన్‌ రోడ్‌ట్రిప్స్‌’ సంస్థను ప్రారంభించా’నంటారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్