Sasha: నిమిషం చీరతో.. కోటి వ్యాపారం!
చీరపై ప్రేమ ఉన్నా.. కట్టడానికి పడే శ్రమే చాలామంది సమస్య. సాషాకీ ఇది అనుభవమే. అసలే అమెరికాలో పెరిగిన భారతీయురాలు. ఆమెకి ఇంకా ఇబ్బంది అనిపించేది. అలాగని కట్టకుండా ఉండలేదు. దానికి ఆమె చేసిన ప్రయత్నం రూ.కోటి వ్యాపారమైంది.
చీరపై ప్రేమ ఉన్నా.. కట్టడానికి పడే శ్రమే చాలామంది సమస్య. సాషాకీ ఇది అనుభవమే. అసలే అమెరికాలో పెరిగిన భారతీయురాలు. ఆమెకి ఇంకా ఇబ్బంది అనిపించేది. అలాగని కట్టకుండా ఉండలేదు. దానికి ఆమె చేసిన ప్రయత్నం రూ.కోటి వ్యాపారమైంది.
కెమిస్ట్రీలో డిగ్రీ, ఆపై ఎంబీఏ పూర్తిచేశారు సాషా. పుట్టింది ముంబయి అయినా చిన్నతనంలోనే వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఆమె సెలవులన్నీ భారత్‌లోనే గడిపేవారు. సంప్రదాయ వస్త్రాలంటే మరీ మక్కువ. భారతీయ సంప్రదాయం, కళలను విదేశీయులకూ పరిచయం చేయాలనుకున్నారు. చదువయ్యాక ఐ2సీ వరల్డ్ పేరుతో 2008లో అమెరికాలో ఓ ఈకామర్స్ సంస్థను ప్రారంభించారు. దీనిద్వారా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, గృహాలంకరణ వస్తువులను అమ్ముతున్నారు. వాళ్ల నాన్నకి ముంబయిలో ఓ అంతర్జాతీయ బీపీఓ సంస్థ ఉంది. దాన్నీ తనే చూసుకుంటున్నారు.
ఓసారి సెలవుల్లో భారత్ వచ్చారు. బంధువుల ఇంట్లో వేడుక. ఇద్దరు పిల్లలను రెడీ చేసి, తను సిద్ధమవుతోంటే ఎంతకీ చీర లొంగదే! సమయం మించి పోతోంది. ఇంతలో తన కజిన్ రెడీమేడ్ చీరను నిమిషాల్లో కట్టేసుకుంది. ‘అది చూసి ఆశ్చర్యపోయా. అడిగితే ‘వేడుకలప్పుడు ఇబ్బంది అవుతోందని నేనే డిజైన్ చేసుకున్నా’ అంది. కాస్త కృత్రిమంగా ఉన్నా.. ఆ ఆలోచన నచ్చి నేనూ ప్రయత్నిద్దామనుకున్నా. మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లో ఎంత వెతికినా అవేవీ నచ్చలేదు. అప్పుడే వీటిని తయారు చేయిస్తే డిమాండ్ ఉంటుందనిపించి ‘వన్ మినిట్ శారీ’ ప్రారంభించా’ అంటారు సాషా రేవాంకర్.
ఆలోచన 2020లోనే వచ్చినా పరిశోధన చేసి, అమల్లోకి తేవడానికి రెండేళ్లు పట్టింది. ‘త్వరగా పూర్తయితే సరిపోదు. అచ్చమైన చీర కట్టుకున్నట్టే అనిపించాలి. ఇంకా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కడుతుంటారు. అలానూ డిజైన్ చేయాలనుకున్నా. ప్రస్తుతానికి మా చీరలు మూడు విధాలుగా కట్టుకోవచ్చు. ఇంకా వీటిని అన్ని సైజుల వారికీ వీలుగా సిద్ధం చేస్తున్నాం’ అనే సాషా వీటిని భారత్‌తోపాటు అమెరికాలోని వారికీ అందుబాటులోకి తెచ్చారు. ఏడాదిలో రూ.కోటికిపైగా వ్యాపారం చేసిన ఆమె ఇతర దేశాలకీ విస్తరించే పనిలో ఉన్నారు. అంతేకాదు.. చీరలకు రెడీమేడ్ బ్లవుజులనూ రూపొందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.