లక్షల జీతం వద్దని.. షూ లాండ్రీ తెరిచింది!
యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇలాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం.. ఎవరైనా వదులుకుంటారా? కానీ బిహార్‌కు చెందిన షాజియా ఖైజర్ బంగారం లాంటి ఈ ఉద్యోగాన్ని వదులుకుంది. కారణం.. వ్యాపారం చేయాలన్న తపనే! ఈ పట్టుదలతోనే విదేశాల నుంచి స్వదేశానికి.....
(Photos: Facebook)
యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇలాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం.. ఎవరైనా వదులుకుంటారా? కానీ బిహార్‌కు చెందిన షాజియా ఖైజర్ బంగారం లాంటి ఈ ఉద్యోగాన్ని వదులుకుంది. కారణం.. వ్యాపారం చేయాలన్న తపనే! ఈ పట్టుదలతోనే విదేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న ఆమె.. చెప్పులు శుభ్రం చేసే లాండ్రీని ప్రారంభించాలనుకుంది. అప్పుడందరూ ‘ఇంత చదువు చదివి చెప్పులు కుట్టే పని చేస్తావా? కుటుంబం పరువు తీస్తావా?’ అని నానా మాటలూ అన్నారు. అయినా వెనకడుగు వేయని ఆమె.. ‘కాలమే సమాధానం చెబుతుంద’ని నిర్ణయించుకుంది. ఈ ధైర్యమే ఇప్పుడు షాజియాను నలుగురిలో ఒక్కరిగా నిలబెట్టింది. వేల వ్యాపారం కాస్తా లక్షలకు పడగెత్తింది. ప్రస్తుతం సామాన్యులకే కాదు.. ప్రముఖులకూ పాదరక్షల సేవలు అందిస్తోన్న షాజియా కథ.. ఎంతోమంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకం!
షాజియాది బిహార్‌లోని భగల్‌పూర్. ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి. ఉన్నత విద్యావంతుల కుటుంబమే అయినా సంప్రదాయ ముస్లిం నేపథ్యం కావడంతో చిన్న వయసులోనే పెళ్లి చేసి ఆమెను అత్తారింటికి పంపాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. కానీ అది ఆమెకు ఇష్టం లేదు. ఉన్నత చదువులు చదవాలని, ఆర్థిక స్వాతంత్రం పొందాలనేది షాజియా కోరిక. అందుకే ఇక్కడుంటే మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమైందామె. ముస్లిం యువతిగా, ఆడపిల్లగా అక్కడా ఆమెకు కొంత వివక్ష ఎదురైంది. వాటన్నింటినీ ఎదుర్కొని చదువు కొనసాగించింది. ఫిజియోథెరపీలో డిగ్రీ పూర్తిచేశాక పెళ్లి చేసుకుంది షాజియా.
అందుకే ఉద్యోగం వదిలేసింది!
పెళ్లైనా తన భర్తపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్న ఆమె.. రెండేళ్ల పాటు స్థానిక పాఠశాలలో టీచర్‌గా పనిచేసింది. ఆపై యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థల్లో పనిచేసే అవకాశం చేజిక్కించుకుంది. కానీ ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేకపోయాయి. ఎందుకంటే ఆమె మనసంతా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన పైనే ఉంది. ఇందుకు భర్త ప్రోత్సాహం కూడా ఉండడంతో విదేశాల్లో ఉద్యోగం వదిలేసి స్వదేశానికి చేరుకుందామె. బిజినెస్ అయితే చేయాలనుకుంది.. కానీ అందులోనూ అందరికంటే భిన్నంగా, అందరికీ ఉపయోగపడేలా ఉండాలనుకుంది. ఈ క్రమంలోనే ఓ చిన్న పాటి పరిశోధన చేసింది షాజియా. అప్పుడే ఓ పత్రికలో షూ క్లీనింగ్ గురించి తెలుసుకుంది. వెంటనే నచ్చేయడంతో అదే తన వ్యాపార అంశంగా నిర్ణయించుకుందామె.
‘చెప్పులు కుడతావా?’ అన్నారంతా!
వ్యాపార ప్రారంభానికి ముందు దీని గురించి మరికొంత పరిశోధన చేసింది షాజియా. ఈ క్రమంలో చెన్నైలోని ‘సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్’ని సందర్శించి ఫుట్‌వేర్ డిజైనింగ్ టెక్నాలజీ గురించి తెలుసుకుంది. మరోవైపు నోయిడాలోని ‘ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్’లో లెదర్ షూస్, దీనికి సంబంధించిన ముడి సామగ్రి గురించి మరిన్ని విషయాల్లో అవగాహన పెంచుకుంది. ఇలా సంపూర్ణ అవగాహన పెంచుకున్న ఆమె.. 2016లో పాట్నాలో ‘రివైవల్’ పేరుతో తొలి షూ లాండ్రీ షాపు తెరిచింది. సాధారణంగా చెప్పుల వ్యాపారమంటే అందరూ చులకనగా చూస్తారు. షాజియాకూ ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు.. ‘ఫిజియోథెరపిస్ట్‌గా హాయిగా ఏదైనా ఆసుపత్రిలో ఉద్యోగం చేసుకోక.. ఇంత చదువు చదివి.. చెప్పుల వ్యాపారం చేస్తావా? అయినా పేరేదైతేనేం.. అదీ చెప్పులు కుట్టే వ్యాపారమేగా?!’ అంటూ దెప్పిపొడిచేవారు. ‘ఇవన్నీ విని నా మనసు చివుక్కుమన్నా.. కాలమే వారి మాటలకు సమాధానం చెబుతుంది అనుకునేదాన్ని’ అంటుంది షాజియా.
సామాన్యుల దగ్గర్నుంచి సీఎం దాకా!
కేవలం ఇద్దరే ఇద్దరు ఉద్యోగులతో తన స్టార్టప్‌ని ప్రారంభించిన షాజియా.. వేలల్లో ఉన్న వ్యాపారాన్ని ఇప్పుడు లక్షల్లో లాభాలొచ్చేలా అభివృద్ధి చేసింది. ఇదంతా తన తపనతోనే సాధ్యమైందంటోందామె. ‘రివైవల్.. ఆ పేరులోనే ఉంది.. తిరిగి పూర్వ కళ తీసుకురావడం అని! చెప్పులు, షూస్‌కు అవసరమైన రిపేర్లు చేసి.. శుభ్రం చేసి కొత్త వాటిలా మెరిపించడమే మా లాండ్రీ సంస్థ ముఖ్యోద్దేశం. క్రమంగా ఈ వ్యాపారాన్ని ఇతర లెదర్ ఉత్పత్తులకూ విస్తరించా. ప్రస్తుతం మా వద్ద చెప్పులు/షూస్‌తో పాటు లెదర్ జాకెట్స్, బ్యాగ్స్, సోఫా, కార్పెట్, కుర్చీలు.. వంటివి కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కేవలం సామాన్యుల నుంచే కాదు.. ప్రముఖుల నుంచీ మాకు ఆర్డర్లు అందుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఇతర ప్రభుత్వ అధికారుల షూస్ కూడా సర్వీసింగ్ కోసం మా వద్దకొస్తుంటాయి. ఆన్‌లైన్‌లో ఒక్క రిక్వెస్ట్ పెడితే చాలు.. వస్తువులు సేకరించడం, కొత్త వాటిలా చేసి తిరిగి వినియోగదారుల వద్దకు చేర్చడం మాదే బాధ్యత! అంతేకాదు.. కస్టమర్ల ఆసక్తిని బట్టి ప్రత్యేకంగా షూస్/ఫుట్‌వేర్‌ని తయారు చేసే సదుపాయం కూడా మా వద్ద అందుబాటులో ఉంది..’ అంటూ తన సంస్థ కార్యకలాపాల గురించి చెప్పుకొచ్చిందీ లాండ్రీ లేడీ.
ఉపాధి కల్పిస్తూ..!
తనతో పాటు నలుగురూ అభివృద్ధి చెందాలనుకునే నైజం షాజియాది. అందుకే ఫుట్‌వేర్ సర్వీసింగ్ నైపుణ్యాల్ని మరింతమంది మహిళలకు పంచుతోంది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు, వర్క్‌షాప్స్ ఏర్పాటు చేస్తూ దీనికి సంబంధించిన మెలకువలు నేర్పిస్తోందామె. ఈ క్రమంలో కొందరు మహిళలు స్థానికంగా షూ లాండ్రీ షాపులు పెట్టుకొని ఉపాధి పొందుతున్నారు. మరోవైపు.. పేదలకు ఉచితంగా పాదరక్షలు అందించేందుకు త్వరలోనే ‘ఫుట్‌వేర్ డొనేషన్ క్యాంప్’ కూడా ఏర్పాటుచేయనున్నట్లు చెబుతోంది షాజియా. ఇలా తన వ్యాపార దక్షతకు, సేవలకు గుర్తింపుగా ‘బిహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ నుంచి ‘బెస్ట్ స్టార్టప్ అవార్డు’ కూడా అందుకుందామె. ‘ఒకవేళ నేను షూ లాండ్రీ ప్రారంభించకుండా ఉద్యోగంలోనే కొనసాగితే.. ఇప్పుడు ఇంతమందికి నా పేరు తెలిసేదే కాదు.. కాబట్టి ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగినప్పుడే అనుకున్నది సాధించగలం..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోందీ సక్సెస్‌ఫుల్ ఆంత్రప్రెన్యూర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.