Kalidindi Vedavati: ఎన్‌ఆర్‌ఐల ఆస్తులు.. లెక్కలు చూస్తున్నా!
అమెరికాలో ఉన్నా.. హైదరాబాద్‌లో సొంతిల్లు కావాలనుకునే వారొకరు. ఆస్ట్రేలియాలో ఉండి దాచుకున్న డబ్బుతో స్వదేశంలో స్థలం కొన్నవారు ఇంకొకరు. మరి ఎక్కడో సుదూరాన ఉంటే.. వీటి బాగోగులు చూసేదెవరు? వీటి నిర్వహణే కాదు.. ఆత్రేయపురం పూతరేకుల నుంచి, పోచంపల్లి దుస్తుల వరకూ కోరుకున్న వస్తువు ఏదైనా సరే విదేశాల్లో ఉన్నవారికి అందిస్తున్నారు కలిదిండి వేదవతి.
అమెరికాలో ఉన్నా.. హైదరాబాద్‌లో సొంతిల్లు కావాలనుకునే వారొకరు. ఆస్ట్రేలియాలో ఉండి దాచుకున్న డబ్బుతో స్వదేశంలో స్థలం కొన్నవారు ఇంకొకరు. మరి ఎక్కడో సుదూరాన ఉంటే.. వీటి బాగోగులు చూసేదెవరు? వీటి నిర్వహణే కాదు.. ఆత్రేయపురం పూతరేకుల నుంచి, పోచంపల్లి దుస్తుల వరకూ కోరుకున్న వస్తువు ఏదైనా సరే విదేశాల్లో ఉన్నవారికి అందిస్తున్నారు కలిదిండి వేదవతి. అదెలాగో ఆవిడ మాటల్లోనే...
చిన్నప్పటి నుంచీ ఉద్యోగం, వ్యాపారం చేస్తోన్న మహిళలే నాకు స్ఫూర్తి. అయితే, నేను బిజినెస్ చేస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మాది తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లి దగ్గర రామచంద్రపురం. పుట్టినిల్లూ, మెట్టినిల్లూ ఇదే. ఇంటర్ చదివా. నాకు పద్దెనిమిదేళ్లప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూర్యనారాయణ రాజుతో వివాహమైంది. ఆయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో కాపురం పెట్టాం. అప్పట్లో బంధువులు, స్నేహితుల పిల్లలెవరు కోర్సులు నేర్చుకోవాలన్నా మా ఇంట్లోనే ఉండేవారు. ఏ పనైనా ఉత్సాహంగా చేసే నన్ను చూసి ఎదురింట్లో ఉండే పెద్దావిడ మెచ్చుకునేవారు. ‘నువ్వూ ఏదైనా సొంతంగా ప్రయత్నించు’ అంటూ బ్యూటీషియన్, ఆంగ్ల శిక్షణ కోర్సుల్లో చేర్పించారు కూడా. ఈలోగా మావారి ఉద్యోగరీత్యా యూకే, అమెరికా వెళ్లాం. ఆ సమయంలో ఇక్కడ మా ఫ్లాటు నిర్వహణ కోసం బంధువులపై ఆధారపడాల్సి వచ్చేది. పదే పదే అడగడం ఇబ్బందైనా తప్పేది కాదు. పద్నాలుగేళ్లకు హైదరాబాద్ వచ్చేశాం. తిరిగొచ్చాక విదేశాల్లో ఉండే బంధువులూ, స్నేహితులూ నన్ను ఇలాంటి సాయాలే అడిగేవారు. పెట్టుబడుల కోసం ఆరాలు తీసేవారు. ఇదంతా గమనించాక దీన్నే వ్యాపారంగా మలుచుకుంటే అన్న ఆలోచన వచ్చింది. అలా ఆరేళ్లక్రితం ‘వేదా ఎన్‌ఆర్‌ఐ సర్వీసెస్’ ప్రారంభమైంది. తొలిరోజుల్లో ‘ఆడపిల్లవు హాయిగా ఇంట్లో ఉండక, ఎందుకీ రిస్కు పనులు’ అన్న సలహాలొచ్చేవి. ఇంట్లోవాళ్లు ప్రోత్సహించారు. ఈ రంగంలో ఎదురయ్యే చిక్కులు, న్యాయపరమైన ఇబ్బందులు వంటి వాటన్నింటిపై అవగాహన తెచ్చుకుని, ముందుకే సాగా.
ఏం చేస్తామంటే...
విదేశాల్లో ఉన్న మనవాళ్లు తిరిగి భారత్‌లో స్థిరపడాలని సొంతిళ్లు, ఆస్తులూ కొనుక్కోవాలనుకుంటారు. వాటి బాగోగులు చూసుకునేవారు కావాలనుకుంటారు. కానీ, బిజీ జీవితాల్లో ఒకరికొకరు సాయం చేసుకునే సమయం ఎవరికుంది? మేం ఆ పని చేసిపెడతాం. వాళ్ల ఫ్లాట్‌లు అద్దెకివ్వడం, ఇంటీరియర్, మరమ్మతులు చేయడం, ఆస్తుల కొనుగోళ్లు అమ్మకాలు.. వంటివన్నీ చూసుకుంటాం. మొదట విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారికే సేవలందించే వాళ్లం. ఇప్పుడు దేశవ్యాప్తంగానూ ఖాతాదారులున్నారు. వాళ్లకు అందించిన సేవల్ని బట్టి కొంతమొత్తం తీసుకుంటాం. ఓ ఇంటికి ఇంటీరియర్ చేయించాలంటే.. కనీసం ముగ్గురిని ఎంపిక చేస్తాం. వారిలో తక్కువకి కోట్ చేసినవారికే అవకాశమిస్తాం. ఈ విధానమే ఎక్కువ మందిని ఆకర్షించింది.
ఇబ్బందులూ ఉన్నాయి...
వ్యాపారమన్నాక అడుగడుగునా సవాళ్లు సాధారణమే! ముఖ్యంగా అద్దె ఇళ్ల విషయంలో ఇరుగుపొరుగు వారికీ, యజమానికీ ఏ సమస్యా లేకుండా చూసుకోవాలి. ఆస్తులు కొనేప్పుడు న్యాయపరమైన చిక్కులు రాకుండా గమనించుకోవాలి. ఇలా ఇంకెన్నో! ఇష్టంగా చేస్తున్నా కాబట్టే అలసట అనిపించదు. 600కు పైగా ఆస్తుల నిర్వహణ చూస్తున్నా. వాటి విలువ రూ.కోట్లలోనే! అపర్ణ, మైహోం, కల్పతరు, జయభేరి వంటి చోట్ల వందల్లో ఖాతాదారులున్నారు. దేశ, విదేశీ రియల్ ఎస్టేట్ సంస్థలూ మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనికితోడు ‘షాప్ అండ్ షిప్’ పేరుతో మరో సంస్థనీ మొదలుపెట్టా. ఎన్‌ఆర్‌ఐల కోసం షాపింగ్, కొనుగోళ్లకు మార్గనిర్దేశం చేయడం, షాపింగ్ చేసిన వాటిని డెలీవరీ చేయడం వంటివెన్నో చేస్తున్నాం. మావద్ద పనిచేసే పదిహేను మందిలో పదమూడు మంది మహిళలే. భవిష్యత్తులో మరింత మందికి అవకాశం కల్పించాలన్నది నా లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.