megh balika: ఆడపిల్లల బ్యాండ్ అదరగొట్టేస్తుంది!
సంగీతం జీవితానివ్వదు... చక్కగా పెళ్లిచేసుకో అన్నారు. కాదంటే ఒత్తిడి చేశారు... వద్దంటే, ఇష్టంగా కొనుక్కున్న గిటార్‌ని నేలకేసి కొట్టారు.
సంగీతం జీవితానివ్వదు... చక్కగా పెళ్లిచేసుకో అన్నారు. కాదంటే ఒత్తిడి చేశారు... వద్దంటే, ఇష్టంగా కొనుక్కున్న గిటార్‌ని నేలకేసి కొట్టారు. అయినా, పట్టువదలక ముందుకు అడుగేస్తే... ఆడపిల్లలేం ఎదుగుతారని హేళన చేశారు అయినా సరే ‘నవ్వినవారి పళ్లే బయటపడతాయి... నా లక్ష్యాన్ని మాత్రం తుడిచిపెట్టలేవు’ అనుకుందామె. ఆ పట్టుదలే... త్రిపుర ఆల్‌గర్ల్స్ బ్యాండ్ ‘మేఘ్‌బాలిక’కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ వివరాలే ఇవన్నీ...
త్రిపురకు చెందిన మూన్‌సాహాకు సంగీతమంటే ఎంతో ఆసక్తి. ఎప్పటికైనా ఓబ్యాండ్ ప్రారంభించాలనేది ఆమెకల. కానీ, తండ్రి తనకి పెళ్లి చేయాలనుకున్నారు. ‘ఈ పాటలూ, గీటలూ ఏం వద్దంటూ.. మూన్ రూపాయి రూపాయి పోగేసి కొనుక్కున్న గిటార్‌ని గోడకేసి కొట్టారు. అది ఆమెను తీవ్రంగా బాధించింది. ఏడ్చింది. గోలచేసింది. దాన్నే కెరియర్‌గా ఎంచుకుంటానని తెగేసి చెప్పింది. మొదట ఇంట్లో వాళ్లు ససేమిరా కుదరదన్నారు. తన పట్టుదల చూసి చివరకు ఒప్పుకున్నా...చుట్టుపక్కల వారు మాత్రం మూన్ సంగీతాన్నీ, ఆమె లక్ష్యాన్నీ తరచూ గేలి చేస్తుండేవారు. ఆ మాటలు విని ఆమె బెదిరిపోలేదు. తనతో పాటు నడిచే ఔత్సాహిక సంగీత కళాకారిణుల కోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషణ మొదలుపెట్టింది. మొదట వచ్చిన ఐదుగురితో కలిసి 2017లో ‘మేఘ్ బాలిక’ (క్లౌడ్‌గర్ల్)పేరుతో బ్యాండ్ ప్రారంభించింది.
ఆయన గది ఇవ్వడంతో....
ఈ బృందంలో అనన్య సర్కార్, దేబ్జానీ నంది, మామన్ దేబ్‌నాద్.. వంటివారున్నారు. మొదట్లో వీరంతా రిహార్సల్ చేయడానికి చోటెక్కడా దొరికేది కాదు. దాంతో ఒక్కోరోజు ఒక్కో సభ్యురాలి ఇంట్లోనే సాధన చేసేవారు. వీరి సమస్య తెలుసుకున్న స్థానిక వార్తా పత్రిక సంపాదకుడు సమీరన్ రాయ్ తన కార్యాలయంలో ఓ గది కేటాయించారు. బృందం మొదటి కార్యక్రమం అగర్తలలో జరిగింది. దానికి మంచి పేరు రావడంతో... స్థానిక సాంస్కృతిక సంస్థ చందనీర్...ఓ విభావరి ఏర్పాటు చేసింది. అప్పట్నుంచి అవకాశాలు వరుస కట్టాయి. దూరదర్శన్, ఆకాశవాణి వంటి చోట్లా ఈ బ్యాండ్‌కు ప్రదర్శనలు ఇచ్చే అవకాశం దక్కింది. అలా ఓఎన్‌జీసీ సంస్థకోసం ప్రోగ్రాం చేసే సమయానికి వీరి దగ్గర గిటార్, హార్మోనియం మాత్రమే సొంతంగా ఉన్నాయి. ఆ విషయం గమనించిన ఆ ఆయిల్ కంపెనీ...డ్రమ్స్ సెట్‌ని బహుకరించింది. అలా ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ... 2023 నాటికి త్రిపుర మొట్టమొదటి ‘ఆల్ గర్ల్స్ బ్యాండ్’గా ప్రసిద్ధి చెందింది. దుర్గా పూజ వేడుకలు, పెళ్లిళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఈవెంట్లు... ఇలా అన్ని చోట్లా వీరి ప్రదర్శనలు ఉండాల్సిందే అనే స్థితికి వచ్చింది. మూన్ సాహా సంగీతం కోసం బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకుంది. ఈమే కాదు...ఈ బృందంలోని ప్రతి ఒక్కరూ...వృత్తి, ప్రవృత్తులను ఏర్పరుచుకున్నారు. పేరుతో పాటు ఆర్థిక స్థిరత్వాన్నీ సాధించడంతో ఇప్పుడు వారి బంధువులూ, స్నేహితులంతా శెభాష్ అంటున్నారు. వారి బిడ్డలతో ఈ బృంద సభ్యులను స్ఫూర్తిగా తీసుకోమని సూచిస్తున్నారు. ‘కలలు కంటేనే.. కోరుకున్నది జరిగిపోదు...దానికోసం శ్రమించాలి. అడ్డంకులను ఎదుర్కొనే మనోధైర్యం కావాలి. ఇవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి’ అని చెబుతారీ బృంద సభ్యులు. నిజమే కదా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.