ప్రభుత్వ బస్సుకి.. ఆమె సారథ్యం!

బస్‌ డ్రైవర్‌ అనగానే స్టీరింగ్‌ వెనుక ఖాకీ దుస్తుల్లో మగవాళ్లే స్ఫురణకు వస్తారు. అయితే కొన్నాళ్లుగా అక్కడక్కడైనా భారీ వాహనాల్ని మేమూ నడపగలమని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. తాజాగా యూపీలో మొదటి ప్రభుత్వ మహిళా బస్‌ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు ప్రియాంక.

Published : 03 Jan 2023 01:10 IST

బస్‌ డ్రైవర్‌ అనగానే స్టీరింగ్‌ వెనుక ఖాకీ దుస్తుల్లో మగవాళ్లే స్ఫురణకు వస్తారు. అయితే కొన్నాళ్లుగా అక్కడక్కడైనా భారీ వాహనాల్ని మేమూ నడపగలమని నిరూపిస్తున్నారు అమ్మాయిలు. తాజాగా యూపీలో మొదటి ప్రభుత్వ మహిళా బస్‌ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు ప్రియాంక. ఓ సాధారణ గృహిణి ఇక్కడి దాకా ఎలా వచ్చిందో చదివేయండి.

ర్త, ఇద్దరు పిల్లలు ఇదే ప్రియాంక శర్మ లోకం. ఉత్తర్‌ప్రదేశ్‌లో చిన్న గ్రామం వీళ్లది. 2016లో అకస్మాత్తుగా భర్త చనిపోయారు. దీంతో కుటుంబ భారమంతా ఆవిడపైనే పడింది. పని చేస్తేనే ఇల్లు గడిచేది. ఇలాగైతే పిల్లల భవిష్యత్తు కష్టమనుకుంది ప్రియాంక. దేశ రాజధానికి వెళితే మంచి ఉపాధి అవకాశాలుంటాయని ఎవరో సలహా ఇస్తే అక్కడికి వెళ్లింది. ఒక ఫ్యాక్టరీలో సహాయకురాలిగా ఉద్యోగం. జీతం ఫర్లేదు. తర్వాత కొన్నాళ్లకు డ్రైవర్లకు మంచి జీతాలుంటాయని విని, అక్కడే ఇతరుల సాయంతో నేర్చుకుంది. ఇలా కాదు.. పూర్తి పట్టు తెచ్చుకోవాలని డ్రైవింగ్‌ కోర్సులు చేసింది. తేలికపాటి నుంచి భారీ వాహనాల్నీ నేర్చుకొని లైసెన్స్‌ సంపాదించింది. ఈసారి అవకాశాల కోసం ముంబయి వెళ్లింది. అక్కడ సరకుల రవాణా వాహనాలు నడపాలి. దీనికోసం రాత్రీ పగలూ తేడా లేకుండా దేశమంతా తిరిగింది.

రోజుల తరబడి ఇంటికి, పిల్లలకు దూరంగా ఉండాలన్న బెంగ ప్రియాంకది. వేరే మార్గం లేదు. ఈ సమస్యకు పరిష్కారం గురించి  వెదుకు తున్నప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా డ్రైవర్లకు అవకాశమిస్తోందని వింది ప్రియాంక. దరఖాస్తు చేసుకుంటే ఎంపికయింది. శిక్షణ అయ్యాక తుది ఎంపికలోనూ స్థానం సంపాదించింది. మొత్తం 26 మందిని తీసుకుంటే ప్రియాంక తొలి పోస్టింగ్‌ అందుకొని విధుల్లోకీ చేరింది. అలా ఆ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ బస్సును నడుపుతోన్న తొలి మహిళగా నిలిచింది. ‘అమ్మాయిల డ్రైవింగ్‌పై అనుమానాలెక్కువ. అవకాశం ఇవ్వడానికీ త్వరగా ముందుకు రారు. మావారు చనిపోయాక ఎన్నో కష్టాలు చూశా. వాటిముందు ఇవేవీ పెద్దగా అనిపించలేదు. ఒంటరి మహిళగా ఎన్నో దాటుకుంటూ వచ్చా. అందుకే ఈ అవకాశం వరంగా తోచింది. సంపాదన కాస్త తక్కువైనా ఎందరినో సురక్షితంగా గమ్యాలకు చేరుస్తున్నానన్నది ఆనందం. పిల్లలూ సంతోషిస్తున్నారు. పైగా... ప్రభుత్వ ఉద్యోగినని గర్వంగా చెప్పుకొనే అవకాశం ఇది’ అంటోంది ప్రియాంక. ఇది మొదలు మాత్రమే.. తన స్ఫూర్తితో ఇంకా ఎంతోమంది అమ్మాయిలు ధైర్యంగా వస్తారంటోంది. మంచి పరిణామమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్