‘పుట్టు గుడ్డిది.. చదివి ఏం సాధిస్తుందిలే’ అన్నారు!

వైద్యుల నిర్లక్ష్యం ఆమెను పుట్టుకతోనే అంధురాలిని చేసింది. దీనికి తోడు ‘పుట్టు గుడ్డిది.. చదివి ఏం సాధిస్తుందిలే’ అన్నారంతా! కానీ తాను మాత్రం శారీరక లోపాన్ని తనకున్న ప్రత్యేకతగా భావించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ట్రిపుల్‌ ఐటీలో బంగారు పతకం అందుకుంది.

Updated : 08 Sep 2022 17:12 IST

(Photo: nammabengaluruawards.org)

వైద్యుల నిర్లక్ష్యం ఆమెను పుట్టుకతోనే అంధురాలిని చేసింది. దీనికి తోడు ‘పుట్టు గుడ్డిది.. చదివి ఏం సాధిస్తుందిలే’ అన్నారంతా! కానీ తాను మాత్రం శారీరక లోపాన్ని తనకున్న ప్రత్యేకతగా భావించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ట్రిపుల్‌ ఐటీలో బంగారు పతకం అందుకుంది. అయినా శారీరక లోపం కారణంగా చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించలేకపోయింది. ‘ఒకరు నాకు ఉద్యోగం ఇవ్వకపోతేనేం.. నేనే నలుగురికి ఉపాధి కల్పిస్తానం’టూ ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే స్థాపించింది. దీని ద్వారా ఎంతోమంది అంధ విద్యార్థుల్లో విద్యా కుసుమాలు పూయిస్తూ, తన సంస్థ వేదికగా నలుగురికీ ఉపాధి కల్పిస్తోన్న ఆమే.. బెంగళూరుకు చెందిన విద్య. పేరులోనే అక్షర జ్ఞానాన్ని నింపుకొన్న ఈ యంగ్‌ సెన్సేషన్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

సాధారణంగా ఏదైనా అవయవ లోపముంటే.. వారిని జాలిగా, చులకనగా చూస్తుంటారు. భవిష్యత్తులో ఏమీ సాధించలేరని అభిప్రాయ పడుతుంటారు. విద్య విషయంలోనూ ఇదే జరిగింది. బెంగళూరులోని ఓ గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పుట్టుకతోనే శాశ్వతంగా చూపు కోల్పోయింది. తమ బిడ్డకు కంటి చూపు వస్తుందన్న ఆశతో మూడేళ్ల పాటు వివిధ ఆస్పత్రుల చుట్టు తిరిగారు ఆమె తల్లిదండ్రులు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఆమెకు చికిత్స అందించే క్రమంలో ఓ డాక్టర్‌.. ‘ఈమెకు ఇక ఎప్పటికీ కంటి చూపు రాదు.. కానీ ఉన్నత చదువులు చదివిస్తే మంచి భవిష్యత్తును అందించిన వారవుతారు’ అని వారికి సలహా ఇవ్వడంతో వాళ్లు దాన్నే మనసులో నింపుకొన్నారు.

అంకెలంటే ప్రాణం!

కంటి చూపు లేకపోయినా అంకెలు లెక్కబెట్టడమంటే విద్యకు మహా ఇష్టం. ఈ క్రమంలోనే తల్లి చాటలో బియ్యం పోసిచ్చినా, ఆఖరికి ఆవాల గింజల్ని కూడా ఎంతో ఓపికతో లెక్కబెట్టేదామె. ఇలా తన కూతురికి గణితంపై ఉన్న మక్కువను గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆ దిశగానే విద్యను ప్రోత్సహించారు. ఊర్లో అంధుల పాఠశాల లేకపోవడంతో స్థానిక ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో సిటీలోని అంధ పాఠశాలలో ఆమెను చేర్పించారు. అక్కడే బ్రెయిలీ పద్ధతిలో ఏడో తరగతి దాకా చదువుకుందామె. అయితే ఆ తర్వాతే ఆమెకు అసలు సవాళ్లు ఎదురయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఆ పైతరగతులు ఆ పాఠశాలలో లేకపోయేసరికి మరో స్కూల్‌కి మారింది విద్య. అది సాధారణ స్కూల్‌ కావడంతో పాఠాలన్నీ బ్లాక్‌ బోర్డ్ పైనే బోధించేవారు. ఈ క్రమంలో ఇతర సబ్జెక్టులు ఎలా ఉన్నా.. గణితం, సైన్స్‌ నేర్చుకోవడం ఎంతో కష్టమైందని చెబుతోంది విద్య.

మట్టి నమూనాల్ని తడుముతూ..!

‘నాకు చిన్నప్పట్నుంచీ గణితం, సైన్స్‌ అంటే పిచ్చి. అయితే ఏడో తరగతి వరకు బ్రెయిలీ లిపిలోనే ప్రాథమికాంశాలు నేర్చుకున్నా.. ఆ తర్వాత సదుపాయాలు లేకపోవడంతో బ్లాక్‌ బోర్డు పాఠాలే వినాల్సి వచ్చింది. ఈ క్రమంలో మట్టి నమూనాల్ని (Clay Models) తడుముతూ బొమ్మలు, సమీకరణాల్ని అర్థం చేసుకునేదాన్ని. Tailor Frame (అంధ విద్యార్థులు ప్రాథమిక గణితం కోసం ఉపయోగించే పరికరం) సహాయంతో గణిత సమస్యల్ని పరిష్కరించేదాన్ని. ఆడియో పాఠాలు వినేదాన్ని. ఇలా నేను పడిన శ్రమకు తగిన ఫలితం దక్కింది. పదో తరగతిలో 95 శాతం మార్కులతో పాసయ్యా..’ అంటోంది విద్య.

అక్కడా సవాళ్లే!

పదిలో మంచి మార్కులు రావడంతో విద్యకు తనపై తనకు నమ్మకం మరింతగా పెరిగింది. ఇదే ఆత్మవిశ్వాసంతో సిటీలోని జూనియర్‌ కాలేజీలో చేరిందామె. అయితే అక్కడ ఆడియో పాఠాల సదుపాయం లేకపోవడంతో.. తన కజిన్‌ సహకారంతో కంప్యూటర్‌లో స్క్రీన్‌ రీడర్‌ని ఉపయోగిస్తూ పాఠాలు నేర్చుకుంది విద్య. ఆ తర్వాత ఎంతో మక్కువతో డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ తీసుకున్నా.. చూపు లేకపోవడంతో అక్కడా ఆమెను అందరూ నిరాశపరిచారు. దీంతో ఒకానొక సమయంలో కోర్సు నుంచి బయటికి వచ్చేద్దామనుకున్న ఆమె.. తన కజిన్‌ ప్రోగ్రామింగ్‌ పాఠాల్ని ఆన్‌లైన్‌లో ఆడియో రూపంలో పంపించడంతో తిరిగి పుంజుకుంది. ఓ అంధ విద్యార్థిగా పాఠాలు నేర్చుకునే క్రమంలో చిన్నతనం నుంచి ఎన్నో సవాళ్లను దాటుకుంటూ ఇక్కడి దాకా చేరుకున్న ఆమె ప్రయాణం.. ట్రిపుల్‌ ఐటీ బెంగళూరులో ఎమ్మెస్సీ డిజిటల్‌ సొసైటీ విభాగంలో బంగారు పతకం సాధించడంతో పరిపూర్ణమైంది.

బీపీఓ ఉద్యోగమిస్తామన్నారు!

క్యాంపస్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌.. ఈ ప్రతిభతో ఉద్యోగాలు వరుస కట్టడం ఖాయం. కానీ విద్య విషయంలో అలా జరగలేదు. తన సహ విద్యార్థులందరూ క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఎంపికైతే.. విద్యకు మాత్రం బంగారు పతకం సాధించినా మొండి చెయ్యే ఎదురైంది. కంటి చూపు లేదన్న కారణంతో, కంప్యూటర్‌పై పనిచేయలేదన్న ఉద్దేశంతో చాలా కంపెనీలు బీపీఓ ఉద్యోగమిస్తానన్నాయి. కానీ విద్యకు అది అస్సలు నచ్చలేదు. ‘అయినా ఇంత చదువు చదివిందీ బీపీఓ జాబ్‌ కోసం కాదుగా! వేరే వాళ్లు నాకు ఉద్యోగం ఇవ్వకపోతే ఏంటి..? నేనే నలుగురికి ఉపాధి కల్పిస్తా’నని ఆ క్షణం నిర్ణయించుకుందామె. ఈ సంకల్పమే 2018లో ‘విజన్‌ ఎంపవర్‌’ అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పడానికి కారణమైంది. మూడేళ్లుగా సంస్థను నిర్వహిస్తోన్న ఆమె.. ఈ వేదికగా కర్ణాటకలోని అంధ పాఠశాలలకు బోధనా వనరుల్ని సమకూర్చుతోంది.

ఇదే మా ప్రత్యేకత!

తరగతి గదిలో సైన్స్‌, గణితం పాఠ్యాంశాల్ని పిల్లలకు సులభంగా, అర్థమయ్యే రీతిలో బోధించడంలో ఇవి సహాయపడతాయి. ఇందుకోసం నిష్ణాతులైన ఓ బృందాన్ని సైతం ఏర్పాటు చేసుకుందామె. వారి సహాయంతో డిజిటల్‌ బుక్స్‌, Subodha (అంధ విద్యార్థులకు సైన్స్‌, మ్యాథ్స్‌ సులభంగా అర్థమయ్యేలా వివరించే ఓ పద్ధతి), Tactile Diagrams (పటాలు, గ్రాఫ్‌లు, బొమ్మల్ని తడుముతూ నేర్చుకునే పద్ధతి).. వంటి ప్రత్యేక పద్ధతులతో అంధ విద్యార్థులు సులభంగా పాఠాలు అర్థం చేసుకునేలా, వారికి చదువుపై శ్రద్ధ పెరిగేలా చేస్తోంది విద్య. అంతేకాదు.. ఆయా అంశాలకు సంబంధించి యూట్యూబ్‌ వీడియోలను రూపొందిస్తూ ఎంతోమందికి చేరువవుతోంది.

తన సేవలకు గుర్తింపుగా 2018లో ‘కర్ణాటక విమెన్‌ అఛీవర్స్‌ అవార్డు’ను సైతం అందుకుందామె. ఇలా తనలాంటి సమస్య మరే విద్యార్థికి రాకూడదన్న ముఖ్యోద్దేశంతో ముందుకు సాగుతోన్న విద్య జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్