స్వశక్తితో ఎదిగింది.. వేల కోట్లు సంపాదిస్తోంది!

ఆమెది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం కాదు.. దీని గురించి పూర్వాపరాలు చెప్పే వారూ ఎవరూ లేరు. అయినా ధైర్యం చేసి ఈ రంగంలోకి అడుగుపెట్టిందామె. అంచెలంచెలుగా ఎదిగి గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొట్టడమే కాదు.. స్వయంశక్తితో మిలియనీర్‌గా ఎదిగిన మహిళగా....

Published : 23 Sep 2022 12:53 IST

(Photo: Linkedin)

ఆమెది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం కాదు.. దీని గురించి పూర్వాపరాలు చెప్పే వారూ ఎవరూ లేరు. అయినా ధైర్యం చేసి ఈ రంగంలోకి అడుగుపెట్టిందామె. అంచెలంచెలుగా ఎదిగి గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొట్టడమే కాదు.. స్వయంశక్తితో మిలియనీర్‌గా ఎదిగిన మహిళగా ఘనత సాధించింది. ఆమే.. పుణేకు చెందిన నేహా నర్ఖడే. తన వ్యాపార వ్యూహాలతో తమ సంస్థను ఎప్పటికప్పుడు లాభాల బాటలో పరిగెత్తిస్తోన్న ఆమె.. తాజాగా విడుదల చేసిన ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022’లో ‘స్వశక్తితో ఎదిగిన అతిపిన్న వయస్కురాలైన పారిశ్రామికవేత్త’గా  ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో ఈ యువ మిలియనీర్‌ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

నేహా నర్ఖడే పుట్టి పెరిగిందంతా పుణేలోనే. ‘పుణే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్ టెక్నాలజీ’లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆమె.. పైచదువుల కోసం జార్జియా వెళ్లింది. అక్కడ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్‌ చేసిన ఆమెకు చదువు పూర్తి కాగానే ఒరాకిల్‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడ కొన్నాళ్లు పనిచేసిన ఆమె.. ఆ తర్వాత లింక్డిన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరింది. ఆ సమయంలోనే మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ‘Apache Kafka’ అనే సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది.

సమాచార వారధిలా..!

అయితే ఎప్పటికైనా వ్యాపార రంగంలోనే స్థిరపడాలని నిశ్చయించుకున్న నేహ.. 2014లో ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఆ ఇద్దరు సహోద్యోగులతోనే ‘కాన్‌ఫ్లుయెంట్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థను నెలకొల్పింది. వ్యాపార సంస్థలు.. తమ ఉత్పత్తులు, సేవలు, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే వారధిలా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతోన్న ఆమె.. తన బృందంతో కలిసి లక్షల సంపదను ఆర్జించే వ్యూహాలు రచిస్తోంది. గోల్డ్‌మన్‌శాక్స్, నెట్‌ఫ్లిక్స్‌, ఉబర్‌.. వంటి సంస్థలు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొనే తమ సమాచార సేకరణ, విశ్లేషణను కొనసాగిస్తున్నాయి.

అతిపిన్న మిలియనీర్‌గా!

తన సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం పరిశ్రమిస్తున్న నేహ.. ఈ ఎనిమిదేళ్ల కాలంలో మిలియనీర్‌గా ఎదిగింది. 2020లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘అమెరికాలో స్వశక్తితో ఎదిగిన మహిళల’ జాబితాలో 33వ స్థానం సంపాదించింది. ఇక ఈ ఏడాది ‘కోటక్‌ వెల్త్‌-హురున్‌ ఇండియా రూపొందించిన ‘దేశంలో వందమంది అత్యధిక సంపద కలిగిన మహిళల జాబితా’లోనూ చోటు దక్కించుకుంది నేహ. ఇక తాజాగా ‘ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2022’లో ‘స్వశక్తితో ఎదిగిన అతిపిన్న వయస్కురాలైన పారిశ్రామికవేత్త’గా ఘనత సాధించి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌. ప్రస్తుతం ఆమె సంపద రూ. 13,380 కోట్లు. అంతేకాదు.. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఓ సదస్సులో భాగంగా ‘ఒరాకిల్‌ గ్రౌండ్‌బ్రేకర్‌ అవార్డు’నూ అందుకుంది నేహ.

ఇలా వ్యాపారవేత్తగా తనను తాను నిరూపించుకుంటోన్న ఈ టెకీ.. రచయిత, వక్త కూడా! ‘Kafka : The Definitive Guide’ అనే పుస్తకానికి సహ రచయిత్రిగా వ్యవహరించిన నేహ.. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై స్ఫూర్తిదాయక, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రసంగాలు కూడా చేస్తుంటుంది.

నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఇది!

చిన్న వయసులోనే తానింత స్థాయికి చేరానంటే.. అందుకు తన కృషికి తోడు చిన్న వయసు నుంచే తన తండ్రి అందించిన ప్రోత్సాహమే అంటోంది నేహ. ‘నేను పెరిగి పెద్దయ్యే క్రమంలో నాన్న నా కోసం కొన్ని పుస్తకాలు తీసుకొచ్చేవారు. అందులో ఈ పురుషాధిపత్య ప్రపంచాన్ని జయించిన ఎందరో మహిళామణుల జీవిత కథలకు సంబంధించిన పుస్తకాలే ఎక్కువగా ఉండేవి. అంతేకాదు.. కొందరు మేటి మహిళల జీవితాలను ఉదాహరణగా తీసుకొని.. జీవితంలోని కీలక దశల్ని ఎలా దాటాలో వివరించే వారు కూడా! ఇందిరా గాంధీ, ఇంద్రానూయీ, కిరణ్‌ బేడీ.. ఇలా వీళ్ల స్ఫూర్తితోనే నలుగురూ నడిచే దారిలో కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకోవాలనుకున్నా. వీళ్లందరికీ సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదన్న బలమైన ఆలోచనే నాతో ఐటీ రంగం వైపు అడుగులేసేలా చేసింది. మహిళలు తలచుకుంటే అసాధ్యమనేది ఏదీ ఉండదు. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠమిదే!’ అంటోంది నేహ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్