Published : 10/02/2022 20:13 IST

అబ్బాయిలతో సవాల్‌ చేసేది!

(Photo: Instagram)

ఆటలో.. అదీ ఓ మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయి రాణించడమంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి.. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించాలి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే కుటుంబ పెద్ద దూరమైతే.. ఆ అమ్మాయి పరిస్థితేంటి? ఆమె ఆశయం ఏం కావాలి? యువ మహిళా క్రికెటర్‌ రేణుకా సింగ్‌ థాకూర్‌ జీవితంలోనూ ఇలాంటి ఎత్తుపల్లాలెన్నో ఉన్నాయి. కానీ వీటిని అధిగమించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని బలంగా నమ్మిందామె. తన కూతురిని క్రికెటర్‌గా చూడాలన్న తన తండ్రి ఆశయాన్ని తన భుజాలపై మోసింది. ఆయన కాలం చేసినా కల నెరవేర్చుకొని.. ‘నాన్న ఏ లోకాన ఉన్నా నన్ను చూసి సంతోషిస్తాడు’ అంటోంది. తన ప్రతిభతో గతేడాది భారత జాతీయ జట్టుకు ఎంపికవడమే కాదు.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న మహిళల ప్రపంచ కప్‌ తుది జట్టులోనూ చోటు దక్కించుకుందీ యువ కెరటం. ఈ నేపథ్యంలో రేణుక క్రికెట్‌ ప్రయాణంలోని కొన్ని మలుపుల్ని తరచి చూద్దాం..

పాతికేళ్ల రేణుకా సింగ్‌ థాకూర్‌ హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలోని పర్సా అనే మారుమూల కొండ ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఆమెకో సోదరుడున్నాడు. రేణుకకు మూడేళ్ల వయసున్నప్పుడే ఆమె తండ్రి చనిపోయాడు. ఆయనకు క్రికెట్‌ అంటే ప్రాణం. తన కూతురిని కానీ, కొడుకుని కానీ క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కల. అయితే తన కల నెరవేరకుండానే కాలం చేశాడాయన.

అమ్మే అన్నీ అయి..!

ఇలా కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో భారమంతా రేణుక తల్లి సునీత భుజాలపై పడింది. అదే సమయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో క్లాస్‌-4 ఉద్యోగినిగా రూ. 1500 జీతానికి పనిలో చేరిందామె. అయితే కుటుంబ పరిస్థితులెలా ఉన్నా వాటి ప్రభావం పిల్లల కెరీర్‌పై పడకుండా జాగ్రత్తపడ్డారు సునీత. ఈ క్రమంలోనే వారిని వాళ్ల ఇష్ట ప్రకారం చదువు, ఆటల్లో ప్రోత్సహించారు.

‘నాకు మూడేళ్లున్నప్పుడే నాన్న పోయాడు. ఆ తర్వాత కుటుంబాన్ని పోషించడానికి అమ్మ ఎంత కష్టపడిందో నేను కళ్లారా చూశాను. నాకు క్రికెట్‌ అంటే చిన్నప్పట్నుంచే ఇష్టం. నాన్నకు కూడా ఈ ఆటంటే ప్రాణమని ఆ తర్వాత తెలిసింది. అప్పుడు నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. ఏదో తెలియని ప్రోత్సాహం నా వెన్నుతట్టింది. ఎలాగైనా నాన్న కోరిక నెరవేర్చాలని బలంగా అనుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ క్రికెట్‌ లవర్.

అబ్బాయిలతో సవాల్‌ చేసేది!

క్రికెటర్‌ అయితే కావాలనుకుంది.. కానీ దాన్ని ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో రేణుకకు అర్థం కాలేదు.. పైగా ఆ సమయంలో తనకు మార్గనిర్దేశం చేసే వారూ ఎవరూ లేరు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే అబ్బాయిలతో పోటీ పడేదామె. పరుగు పందేల్లో వాళ్లను అధిగమించి తానే గెలుస్తానని వాళ్లతో సవాల్‌ చేసేది. ఆడపిల్లకు చదువు, ఆటలెందుకని నలుగురూ అన్నా వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యం పైనే దృష్టి పెట్టింది రేణుక. ఇందుకు తన తల్లీ ఎంతగానో సహకరించిందని చెబుతోంది. ఇలా క్రీడలపై తాను చూపే ఆసక్తిని గమనించిన ఆమె అంకుల్‌.. ఆమెను ధర్మశాలలోని హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌-అకాడమీలో చేర్పించారు. అక్కడే క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన ఈ యువ కెరటం.. రోజురోజుకీ తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంది.

ఒక్క టోర్నీ.. 23 వికెట్లు!

ఎక్కువగా బౌలింగ్ పైనే దృష్టి పెట్టిన ఈ యువ క్రికెటర్‌.. పేసర్‌గా తన క్రీడా నైపుణ్యాలకు పదును పెట్టింది. ఆపై అండర్‌-16, అండర్‌-19 జట్లకు ఎంపికై.. తన పేస్‌ మెలకువలతో పలువురి దృష్టిని ఆకర్షించింది. అయితే 2019లో బీసీసీఐ నిర్వహించిన వన్డే టోర్నమెంట్‌లో 23 వికెట్లు పడగొట్టి.. జాతీయ స్థాయి సెలక్టర్ల దృష్టిలో పడిందామె. ఇక అక్కడ్నుంచి రేణుక దశ తిరిగిందని చెప్పచ్చు. ఆపై దేశవాళీ మ్యాచుల్లో తనకు అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఎదిగిన ఆమె.. గతేడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో జాతీయ జట్టులోకి ప్రవేశించింది. అయితే మొదటి రెండు మ్యాచుల్లో రాణించకపోయినా.. మూడో మ్యాచ్‌లో మేటి క్రీడాకారిణి అలిస్సా హీలే వికెట్‌ పడగొట్టి.. తన వికెట్ల ఖాతాను ఘనంగా ఆరంభించింది రేణుక.

నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు!

ఇక ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20, వన్డే సిరీస్‌ల్లోనూ ఆడే అవకాశం దక్కించుకున్న రేణుక.. మార్చి 4 నుంచి జరగనున్న ‘వన్డే ప్రపంచకప్‌’ జట్టుకూ అర్హత సాధించింది. ‘నేను కానీ, అన్నయ్య కానీ దేశం తరఫున క్రికెట్‌ ఆడాలనేది నాన్న కల. అది నా ద్వారా సాకారమైనందుకు గర్వపడుతున్నా. ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను చూసి నాన్న ఎక్కడున్నా సంతోషిస్తారు.. గర్వపడతారు..! నాన్న కల, అమ్మ త్యాగమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి..’ అంటూ మురిసిపోతోందీ యువ క్రికెటర్‌. సుష్మా వర్మ తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి భారత జట్టులో చోటు దక్కించుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచింది రేణుక. ఇక మీ ఆరాధ్య క్రికెటర్‌, స్ఫూర్తి ప్రదాత ఎవరని అడిగితే.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అని చెబుతోందీ యువ పేసర్.

రాబోయే ప్రపంచకప్‌ తుది జట్టులో చోటు దక్కించుకొని నిండైన ఆత్మవిశ్వాసం, చెప్పలేనంత ఆనందంతో ఉన్న రేణుక.. కప్పు గెలిపించడానికి ప్రతి మ్యాచ్‌లోనూ తన సర్వశక్తులూ ఒడ్డుతానని చెబుతోంది. ఇలా ఈ యువ ప్లేయర్‌ ఉత్సాహం, ఆమె నైపుణ్యాలు చూసి.. భారత మహిళల జట్టుకు మరో అద్భుత పేసర్‌ దొరికినట్లేనని అభిప్రాయ పడుతున్నారు క్రీడా విశ్లేషకులు.

ఆల్‌ ది బెస్ట్‌ రేణుక!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని