పెళ్లయినా... అదే దూకుడు!

క్రీడల్లో ఎంత ప్రావీణ్యం చూపినా... ఒకానొక దశకొచ్చేసరికి వాటిని ఆపే అమ్మాయిలే ఎక్కువ. పెళ్లి, పిల్లలు జీవితంలోకి వచ్చాక వాటి వైపు ఆలోచన కూడా పోదు. కానీ రత్నకుమారి అలాకాదు. ఓవైపు ఉద్యోగం, మరోవైపు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పతకాల పంట పండిస్తున్నారు.

Published : 19 Jun 2024 02:49 IST

క్రీడల్లో ఎంత ప్రావీణ్యం చూపినా... ఒకానొక దశకొచ్చేసరికి వాటిని ఆపే అమ్మాయిలే ఎక్కువ. పెళ్లి, పిల్లలు జీవితంలోకి వచ్చాక వాటి వైపు ఆలోచన కూడా పోదు. కానీ రత్నకుమారి అలాకాదు. ఓవైపు ఉద్యోగం, మరోవైపు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే పతకాల పంట పండిస్తున్నారు. అదెలా సాధ్యమైందో... మనతో పంచుకున్నారిలా...

మాది ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కృష్ణాపురం. నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. అయిదుగురు పిల్లలం. కూలీ పనులు చేస్తూ మమ్మల్ని చదివించడం అమ్మకు భారమైంది. అందుకే నన్ను వైరాలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చేర్పించింది. చిన్నప్పట్నుంచీ ఆటలంటే ఆసక్తి. బాగా ఆడేదాన్ని కూడా. దాన్ని గమనించిన వ్యాయామ ఉపాధ్యాయనులు సుజాత, శ్రీదేవి ప్రోత్సహించారు. దాంతో పతకాలూ సాధించా. ఇంటర్‌లో ఉన్నప్పుడు కేరళలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ పోటీల్లోనూ పాల్గొన్నా. అయితే ఇంజినీరింగ్‌కి వచ్చాక నెమ్మదిగా పోటీలకు దూరమయ్యా. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. ఏదైనా మంచి సంస్థలో ఉద్యోగం చేస్తా అనుకున్నారంతా. కానీ నేను కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. తొలిప్రయత్నంలోనే ఎంపికయ్యా. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నా.

తిరిగి ఆటల్లోకి...

జిల్లా ఎస్పీ, డీఎస్పీలు క్రీడాకారులను బాగా ప్రోత్సహిస్తారు. దీంతో తిరిగి ఆటలపై దృష్టిపెట్టా. మూడేళ్లుగా 400, 100 హర్డిల్స్‌ పరుగు పందేల్లో పాల్గొని పతకాలూ సాధిస్తున్నా. తాజాగా కేరళలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఈ రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించా. నాకు బాక్సింగ్‌లోనూ ప్రావీణ్యముంది. ప్రస్తుతం జాతీయస్థాయి బాక్సింగ్‌ పోటీలకు సిద్ధమవుతున్నా. మూడు పదుల వయసులో, ఓవైపు ఉద్యోగం, రెండేళ్ల కూతురి బాధ్యత మరోవైపు... రెండింటి సమన్వయం అంత తేలికేమీ కాదు. కానీ విజయం సాధించాలన్న పట్టుదలతోనే కొనసాగుతున్నా. ఈ క్రమంలో మావారి సహకారాన్నీ మర్చిపోలేను. ఆయన ప్రైవేటు ఉద్యోగి. పోటీలున్నప్పుడు పాప బాధ్యతంతా తనే తీసుకుంటారు. ఆయనవల్లే రెండింట్లో దూసుకెళుతున్నా. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కావాలి, ఒలింపిక్స్‌లో దేశం తరఫున పోటీపడాలి... ఇవీ నా ముందున్న లక్ష్యాలు.

శనిగారపు సతీష్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్