Work-Life Balance: ఆ బాధ ఇప్పటికీ వేధిస్తుంటుంది!

మనలో చాలామంది చాలా సందర్భాల్లో అనుకునే మాట.. 'నాకింకో రెండు చేతులుంటే బాగుండు', 'మరో 24 గంటలుంటే బాగుండు..' అలా అయితే మనకున్న పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయని అనుకుంటాం.. నిజమే.. ఆఫీసు బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లల చదువుల మధ్య సమతూకం సాధించడమంటే

Published : 03 Mar 2022 18:17 IST

మనలో చాలామంది చాలా సందర్భాల్లో అనుకునే మాట.. 'నాకింకో రెండు చేతులుంటే బాగుండు', 'మరో 24 గంటలుంటే బాగుండు..' అలా అయితే మనకున్న పనులన్నీ సవ్యంగా పూర్తవుతాయని అనుకుంటాం.. నిజమే.. ఆఫీసు బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లల చదువుల మధ్య సమతూకం సాధించడమంటే మహిళలకు కత్తి మీద సామే! ఇలాంటివి కేవలం ఉన్నత స్థానాల్లో ఉన్నవారికే సాధ్యమనుకుంటాం.. కానీ అది నిజం కాదని.. కెరీర్‌లో విజయం సాధించిన కొందరు మహిళలు తమ స్వీయానుభవాలతో చెబుతున్నారు. అయినా పట్టు వదలకుండా కెరీర్‌లో సక్సెసయ్యారు.. మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా ఇంటికీ సమయం కేటాయిస్తున్నారు.

కంపెనీ మద్దతు కావాలి!

కెరీర్‌ ధ్యాసలో పడిపోయి ఇంటిని, పిల్లల్ని నిర్లక్ష్యం చేశామని ఒకానొక సమయంలో మనకూ అనిపిస్తుంటుంది. తన విషయంలోనూ ఇది అనుభవమే అంటున్నారు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరైన ఆమె.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లోని అనుభవాలను రంగరించి ‘మై లైఫ్‌ ఇన్‌ ఫుల్‌ : వర్క్‌, ఫ్యామిలీ, అండ్‌ అవర్‌ ఫ్యూచర్‌’ అనే పుస్తకం రాశారు. మహిళలు ఇంటిని-ఆఫీస్‌ని బ్యాలన్స్‌ చేసుకోవాలంటే.. వారు పనిచేసే కంపెనీల మద్దతు కీలకమంటూ అందులో చెప్పుకొచ్చారామె.

‘1980ల్లో బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌లో ఉద్యోగం చేసే క్రమంలో క్యాన్సర్‌తో పోరాడుతున్న నాన్నను చూసుకోవడానికి ఇండియా రావాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కంపెనీ నాకు మూడు నెలల వేతనంతో కూడిన సెలవుల్ని మంజూరు చేసింది. ఒకవేళ ఈ తరహా సెలవు నాకు లభించకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేసేదాన్నేమో! దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడేది. అందుకే ప్రతి కంపెనీ తమ ఉద్యోగులకు కష్టసుఖాల్లో మద్దతుగా నిలవాలి.. అప్పుడే వాళ్లు అటు ఆఫీస్‌ని, ఇటు ఇంటిని సమన్వయం చేసుకోగలరు. ఇదొక్కటనే కాదు.. ఆ తర్వాత ‘ఏషియా బ్రౌన్‌ బొవేరీ’ సంస్థలో చేరాక నేను అమ్మనయ్యాను. ఆ సమయంలోనూ నా మానసిక, శారీరక స్థితిగతుల్ని అర్థం చేసుకొని.. నా సౌకర్యానికే ప్రాధాన్యమిచ్చిందీ సంస్థ. అలాగని వాళ్ల నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ప్రసవానంతర సెలవుల్లో ఉన్నప్పటికీ నాకు వీలు కుదిరినప్పుడల్లా ఆఫీస్‌ పనులు నిర్వహించేదాన్ని..’ అంటూ చెప్పుకొచ్చారామె.

పిల్లల విషయంలో బాధపడ్డా!

ఓ వర్కింగ్‌ మదర్‌గా పిల్లలకు తగిన సమయం కేటాయించలేదన్న బాధ ఇప్పటికీ అప్పుడప్పుడూ వేధిస్తుంటుందని తన పుస్తకంలో రాసుకొచ్చారు నూయీ.

‘కెరీర్‌ ధ్యాసలో పడిపోయి నా ఇద్దరు కూతుళ్ల పెంపకం విషయంలో నేరం చేస్తున్నానని నేను చాలాసార్లు ఫీలయ్యాను. ఎన్నోసార్లు అపరాధ భావనతో కుంగిపోయాను. వాళ్ల స్కూల్లో జరిగే కార్యక్రమాలకు కూడా పని భారం వల్ల సమయం కేటాయించలేకపోయేదాన్ని. నా కూతురు స్కూల్లో ప్రతి బుధవారం ‘కాఫీ విత్ మదర్స్’ అనే కార్యక్రమం ఉండేది. వర్కింగ్ వుమన్ అయిన నేను బుధవారం ఉదయం 9 గంటలకు కాఫీ కార్యక్రమానికి ఎలా అటెండ్ అవ్వగలను? అందుకే చాలాసార్లు ఆ కార్యక్రమాన్ని నేను మిస్సయ్యేదాన్ని. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నా కూతురు ‘చూడు మమ్మీ.. అందరు తల్లులూ కార్యక్రమానికొచ్చారు.. నువ్వు తప్ప!’ అనేది. అప్పుడు నాకు చాలా గిల్టీగా అనిపించేది. అయితే ఇలాంటి విషయాల్లో క్రమంగా నన్ను నేను సమాధానపర్చుకోవడం మొదలు పెట్టాను. ఎందుకంటే వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం.. ఈ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఒక్కోసారి రెండింటినీ సమన్వయం చేసుకోవడం కుదరకపోవచ్చు. అందుకే మహిళలు రెండింటికీ న్యాయం చేయగలిగామని చెప్పుకోలేరు..’ అంటారామె.


పనిలోనే రోజులు గడిచిపోయేవి..!

నూయీ మాత్రమే కాదు.. ఇంటిని-ఆఫీస్‌ని సమన్వయం చేసుకోవడం అంత సులభం కాదంటున్నారు అమెరికా శ్వేత సౌధంలో పాలసీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో మొదటి మహిళా డైరెక్టర్‌గా పనిచేసిన అన్నే మేరీ స్లాటర్. ఆమె రాసిన ‘వై విమెన్ స్టిల్ కాంట్ హావ్ ఇట్ ఆల్’ అనే పుస్తకంలో తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

‘అమెరికా శ్వేత సౌధంలో ఉద్యోగం.. ఇది నా కల. దీన్ని నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టాలే పడ్డాను.. ముఖ్యంగా టీనేజీలోకి అడుగుపెడుతున్న నా పిల్లల ఆలనాపాలనా మొత్తం నా భర్తకే వదిలేశాను. సోమవారం ఉదయం 4.20కి ప్రారంభమయ్యే నా ఆఫీస్ శుక్రవారం అర్ధరాత్రెప్పుడో పూర్తయ్యేది. ఈ మధ్యలో మీటింగులు, ఫైళ్లు, మెమోలు, రిపోర్టులు, కామెంట్లు, డ్రాఫ్టులు అంటూ ఎన్నో పనులుండేవి.. ఇక నా కోసం నేనేం చేయాలనుకున్నా మిగిలిన రెండు రోజుల్లో (వారాంతాల్లో)నే చేసుకోవాల్సి వచ్చేది. అందుకే ఈ విషయంపై సలహా తీసుకుందామని నా సీనియర్ అఫీషియల్‌ని అడిగాను. తన విషయంలోనూ ఇలాగే అవుతోందని ఆవిడ చెప్పారు.

(Photo: LinkedIn)

ఉద్యోగం మానేయాలనుకున్నా.. కానీ!

వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోలేక ఒకానొక దశలో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను.. ఆ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా? అని చాలామంది నన్నడిగారు. కానీ నా దృష్టిలో నా పిల్లల కంటే నా పని గొప్పది కాదు.. ఈ ఉద్యోగం మానేస్తే నేను లెక్చర్స్ ఇవ్వడం, పత్రికలకు కాలమ్స్ రాయడం, పుస్తకం రాయడం వంటివి చాలా చేయొచ్చు. అయితే ఆ తర్వాత ఓ చోట ‘వర్క్‌-లైఫ్ బ్యాలన్స్’ గురించి ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఇద్దరు మహిళలను కలిశాను. వాళ్లూ ఉన్నత హోదాల్లో ఉన్నవారే.. కానీ వారికీ సమతూకం సాధ్యం కాలేదని చెప్పారు..’ అంటూ ఆ పుస్తకంలో తన మనోగతాన్ని పంచుకున్నారావిడ.

అయితే ఇంటిని-పనిని సమన్వయం చేసుకోవడం కష్టమని వీళ్లు పూర్తిగా తమ కెరీర్‌కి గుడ్‌బై చెప్పలేదు. నా వల్ల కాదని నిరాశ పడలేదు. అందులో రాణించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మరోవైపు వీలైనప్పుడల్లా ఇంటికీ సమయం కేటాయిస్తున్నారు.. కాస్త కష్టమైనా ఇటు ఇంటిని, అటు పనిని సమానంగా ప్రేమించడం నేర్చుకోవాలన్న విషయం వీళ్ల జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్