Updated : 27/10/2021 20:45 IST

చక్కెర వ్యాక్స్ ట్రై చేశారా?

మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో అవాంఛిత రోమాలు కూడా ఒకటి. దీనికోసం చాలామంది వ్యాక్సింగ్, త్రెడింగ్ వంటి పద్ధతులను అనుసరిస్తుంటారు.. వీటివల్ల నొప్పి ఎక్కువగా ఉండడంతో పాటు వెంట్రుకలు లోపలికి పెరగడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాటికంటే నొప్పి తక్కువగా ఉంటూ, ఎలాంటి ఇబ్బందులూ కలిగించని సహజసిద్ధమైన పద్ధతి గురించి మీకు తెలుసా? దాన్ని షుగరింగ్ అంటారు.. అదేనండీ.. చక్కెర పాకంతో వ్యాక్సింగ్ చేయడం అన్నమాట. ఈ నేపథ్యంలో దీని గురించి తెలుసుకుందాం రండి..

సహజంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి కొన్ని రకాల వ్యాక్స్‌లు సరిపడవు. అలాంటివారు తమకు నచ్చిన వ్యాక్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొందరైతే షేవింగ్‌తో సరిపెట్టుకుంటారు. అయితే కెమికల్ వ్యాక్స్, త్రెడింగ్.. ఈ రెండు పద్ధతులూ ఉపయోగించడం వల్ల వెంట్రుకలు చాలా తొందరగా తిరిగి పెరిగే అవకాశాలుంటాయట. మరేం చేయాలి అనుకుంటున్నారా? దీనికి ప్రత్యామ్నాయమే చక్కెర వ్యాక్స్..

మిడిల్ ఈస్ట్‌లో మొదలైంది..

ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు కదా అని ఇదేదో ఇటీవలే వచ్చిన ట్రెండ్ కానేకాదు.. క్రీస్తు పూర్వమే మహిళలు ఈ తరహా వ్యాక్స్‌తో తమ అవాంఛిత రోమాల్ని తొలగించుకునేవారట. ఈ పద్ధతి మొదటగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రారంభమైందట. ఇందులో సాధారణంగా చక్కెర, నీళ్లు, నిమ్మరసం వాడి వ్యాక్స్‌ని తయారుచేస్తారు. దీన్ని జెల్‌లా తయారుచేసి వెంట్రుకలపై పూసి ఆరిన తర్వాత వెంట్రుకలు పెరిగిన దిశలోనే లాగడం వల్ల నొప్పి పెద్దగా తెలీదు. ఈ పద్ధతిలో వెంట్రుకలు కుదుళ్ల నుంచి వచ్చేయడం వల్ల తిరిగి పెరగాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఇది మిగిలిన పద్ధతులన్నింటికంటే ఉత్తమమైనది అంటారు బ్యుటీషియన్లు.

ఎలా చేస్తారంటే..

రెండు కప్పుల చక్కెర, పావు కప్పు నిమ్మరసం, కొద్దిగా నీళ్లు తీసుకొని మూడింటినీ కలుపుతూ బాగా వేడి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిశ్రమం బంగారు రంగులోకి మారుతుంది. కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా చేస్తే రంగు మారకుండా కూడా ఈ వ్యాక్స్ మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. దీన్ని కాస్త చల్లార్చి ఆ తర్వాత గ్లౌజులు వేసుకున్న చేతితో వెంట్రుకలు ఉన్నచోట వ్యతిరేక దిశలో పూయాలి. అలా వ్యతిరేక దిశలో పూసిన తర్వాత వెంట్రుకలకు అంటుకునేలా ఒత్తి ఆ తర్వాత వెంట్రుకలు ఏ దిశగా పెరిగాయో అదే దిశలో దీన్ని నెమ్మదిగా వూడదీయాలి. దీనివల్ల వెంట్రుకలు చక్కెర మిశ్రమానికి అంటుకొని బయటకు వచ్చేయడంతో పాటు పెద్దగా నొప్పి కూడా తెలీదు. వెంట్రుకలు కూడా కుదుళ్ల నుంచి బయటకు వస్తాయి.

ఎన్నో ప్రయోజనాలు

వ్యాక్సింగ్‌లో భాగంగా వ్యాక్సింగ్ స్ట్రిప్స్‌ని వాడినప్పుడు వెంట్రుకలతో పాటు చర్మం కూడా ఈ స్ట్రిప్స్‌ని అంటుకొని ఉంటుంది. అందుకే వెంట్రుకలను లాగినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. పైగా వ్యతిరేక దిశలో లాగడం వల్ల తిరిగి వెంట్రుకలు వచ్చినప్పుడు లోపలికి పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సున్నితమైన చర్మతత్వం ఉన్న వారికి వ్యాక్సింగ్ అస్సలు సరిపడదు. కానీ చక్కెరతో ఇలా వ్యాక్స్ చేసుకుంటే మాత్రం సున్నితమైన భాగాల్లోనూ ఎలాంటి నొప్పీ లేకుండా వెంట్రుకలను తీసేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. అవేంటంటే..

* వ్యాక్సింగ్‌లా కాకుండా చక్కెర వ్యాక్స్ వల్ల చిన్నగా ఉన్న వెంట్రుకలను కూడా పూర్తిగా తీసేసే అవకాశం ఉంటుంది.

* వ్యాక్స్‌లా కాకుండా దీన్ని గది ఉష్ణోగ్రత వద్దే ఉపయోగించడం వల్ల చర్మం కాలే అవకాశం ఉండదు.

* మొత్తం కాలు లేదా చేతికి ఒకేసారి అప్త్లె చేసుకొని నెమ్మదిగా తొలగించే అవకాశం ఉండడం వల్ల వ్యాక్సింగ్‌తో పోల్చితే ఈ చక్కెర వ్యాక్స్ (షుగరింగ్) చాలా సులభంగా, త్వరగా పూర్తయ్యే ప్రక్రియ.

* కేవలం చక్కెర, నీళ్లు, నిమ్మరసంతో చేసిందే కాబట్టి చర్మానికి ఎలాంటి హానీ ఉండదు.

* ఒకవేళ ఏవైనా వెంట్రుకలు బయటకు రాకుండా మిగిలిపోతే ఈ పేస్ట్‌ని మరోసారి అప్త్లె చేసుకోవచ్చు కూడా..!

* ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల వెంట్రుకల ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే ఈ పద్ధతి మిగిలిన వాటికంటే ఎంతో ప్రభావవంతమైనదని చెప్పుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని