ఇల్లు చల్లగా ఉండాలంటే...!

వేసవి అంటేనే అధిక ఉష్ణోగ్రతలు.. ఈ అధిక వేడికి భయపడే చాలామంది ఇంటిపట్టునే ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో- వేడిని తట్టుకొనే విధంగా ఇంటిని తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. ఎంత ఏసీలు, కూలర్లు వాడుతున్నా సరే- ఫర్నిచర్ దగ్గరి నుంచి గుమ్మాలకు....

Published : 11 Apr 2023 21:36 IST

వేసవి అంటేనే అధిక ఉష్ణోగ్రతలు.. ఈ అధిక వేడికి భయపడే చాలామంది ఇంటిపట్టునే ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో- వేడిని తట్టుకొనే విధంగా ఇంటిని తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. ఎంత ఏసీలు, కూలర్లు వాడుతున్నా సరే- ఫర్నిచర్ దగ్గరి నుంచి గుమ్మాలకు వేసే కర్టెన్ల వరకు ఇంట్లోకి వేడి ప్రవేశించకుండా అడ్డుకునేవై ఉండాలి. బయట ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉన్నా.. ఇంట్లో మాత్రం చల్లదనాన్ని నింపేవై ఉండాలి. అప్పుడే వేసవి తాపాన్ని తట్టుకోగలుగుతాం. మరి దానికోసం ఇంటిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకుందామా...

ఫర్నిచర్ ఇలా..

ఇల్లు చల్లగా ఉండాలని ఇప్పటికిప్పుడు పాత ఫర్నిచర్ మార్చేసి కొత్త ఫర్నిచర్ కొనక్కర్లేదు. ఇప్పటికే ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌ను కూడా వేసవి వేడిని తట్టుకొనే విధంగా మార్చేసుకోవచ్చు. కొంతమంది సోఫా, కుషన్ కవర్లు, మంచంపై దుప్పట్లు.. ఇలా వీటన్నింటికీ ఎక్కువగా ముదురు రంగులో ఉన్న వాటినే ఉపయోగిస్తారు. పొరపాటున ఏదైనా మరక అయితే.. అది అంతగా కనిపించదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తూ ఉంటారు. కానీ వేసవిలో మాత్రం వీటికోసం వీలైనంత లేత రంగుల్లో ఉన్నవే ఎంచుకోవాలి. ఎందుకంటే ఇవి వేడిని ఎక్కువగా గ్రహించవు. కాబట్టి.. ఇల్లు కాస్త చల్లగా ఉంటుంది. అలాగే వీటిలోనూ సిల్క్ తరహావి కాకుండా.. నూలువి ఎంచుకొంటే బాగుంటుంది.

కుచ్చుల కర్టెన్లు వద్దు..

ఇల్లు అందంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో.. కొంతమంది కిటికీలకు, తలుపులకు కుచ్చులుగా ఉండే కర్టెన్లను (డ్రేపరీ తరహా) ఉపయోగిస్తుంటారు. ఇవి మందంగా ఉండటం వల్ల లోపలికి గాలి సరిగా రాదు. ఫలితంగా.. ఇల్లు వేడెక్కే అవకాశం ఉంది. అందుకే.. వేసవిలో మాత్రం పలుచటి కర్టెన్లను ఉపయోగించాలి. ఇవి తేలికగా ఉండటంతో పాటు.. లోపలికి గాలి ప్రసరించేలా చేస్తాయి. దీనికోసం కూడా ముదురు రంగులను కాకుండా.. లేత రంగులనే ఎంచుకోవడం మంచిది. కొంతమందికి కిటికీలకు కర్టెన్లు వేయడాన్ని అంతగా ఇష్టపడరు. అలా చేస్తే ప్రకృతిని ఆస్వాదించడానికి వీలుండదనే ఆలోచన కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి వారు గదిలోకి ఎండ ప్రసరించకుండా చేసే విండో వ్యాలన్సెస్‌ను ఉపయోగించవచ్చు. ఇవి కిటికీ పైభాగాన్ని మాత్రమే మూసి ఉంచుతాయి. దీనివల్ల ఇంట్లోకి ఎండ ప్రవేశించదు.. సరికదా అటు ప్రకృతినీ ఆస్వాదించినట్లవుతుంది.

ఇంట్లోనే నందనవనం..!

వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే.. చేయాల్సిన మరో పని గదుల్లో అక్కడక్కడా మొక్కలను పెంచడం. ఇవి వేసవి తాపాన్ని తగ్గించడంతో పాటు ఇంటి లోపల ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దీనికోసం.. కలబంద, స్నేక్ ప్లాంట్, బేబీ రబ్బర్ ప్లాంట్, గోల్డెన్ పాటోస్ వంటి ఇండోర్‌ప్లాంట్స్ ఎంచుకోవాలి. నీడలో పెరిగే పూల మొక్కలను సైతం ఇంట్లో అక్కడక్కడా అమర్చుకోవడానికి ఉపయోగించవచ్చు. ఫలితంగా ఇల్లు పరిమళ భరితంగా మారుతుంది. మీరు రోజులో ఎక్కువ సమయం ఒకేచోట ఉండటానికి ప్రాధాన్యమిస్తే.. ఆ ప్రదేశంలో మొక్కలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. మొక్కల వల్ల ఇల్లు అందంగా ఉండటంతో పాటు చల్లగానూ మారుతుంది.

నచ్చిన ప్రదేశం కనిపించేలా..

కొంతమందికి పచ్చటి ప్రకృతిని చూడటమంటే ఎంతో ఇష్టం. మొక్కలు, చెట్లను చూస్తూ పరవశిస్తూ.. సమయం గడిపేవారు ఎంతోమంది ఉంటారు. అయితే ప్రస్తుతం అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద భవనాలను నిర్మించే సంస్కృతి పెరిగిపోతోంది. కొన్ని ఇళ్లకు కిటికీ తలుపు తెరిస్తే.. దానికి ఎదురుగా మరో ఫ్లాట్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు పూలు, మొక్కలు కనిపించే విధంగా ఫర్నిచర్ అమరికను మార్చుకోవాలంటే కష్టమే. అందుకే.. ఇంట్లో ఆహ్లాదాన్ని పెంచేలా ఉన్న పెయింటింగ్‌ను గోడకు అమర్చడం మంచిది. పెయింటింగ్‌కు ఎక్కువ ఖర్చవుతుందని భావిస్తే.. చక్కగా ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో దొరికే వాల్‌స్టిక్కర్లను అతికించుకోవచ్చు. ఇవి కూడా అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చిరాకును తగ్గించడంలో తోడ్పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని