Published : 21/09/2021 19:21 IST

టెన్షన్‌గా ఉందా? అయితే వెంటనే ఇలా రిలాక్సవ్వండి!

సుధ ప్రతి చిన్న విషయానికీ టెన్షన్‌ పడిపోతూ ఉంటుంది. వంట కాస్త ఆలస్యమైనా, ఇంటికెవరైనా బంధువులొచ్చినా, ఇంటి పని పూర్తి చేసే విషయంలో.. ఇలా చిన్న దానికే తెగ ఒత్తిడికి లోనవుతుంటుంది.

కరోనా వచ్చిన దగ్గర్నుంచి మృదుల ఇంటి పనులతో సతమతమైపోతోంది. దీనికి తోడు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఒక్కోసారి ఓపిక నశించి టెన్షన్‌తో తనను తానే అదుపు చేసుకోలేని స్థితికి చేరుకుంటోంది.

ఇలాంటి టెన్షన్‌, ఒత్తిడి మనలో చాలామందికి కామనే. అటు ఇంటి పని, ఇటు ఆఫీస్‌ పని బ్యాలన్స్‌ చేసుకోలేక.. మనకంటూ కాస్త సమయం కేటాయించుకోలేక.. కాసేపైనా విశ్రాంతి తీసుకునే సమయం దొరక్క.. తెగ టెన్షన్‌ పడిపోతుంటాం. అయితే ఇది ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు కానీ.. ప్రతి దానికీ ఇలా టెన్షన్‌ పడిపోతుంటే మాత్రం దాని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుందంటున్నారు నిపుణులు. అందుకే కాస్త టెన్షన్‌గా అనిపించినప్పుడల్లా దాన్నుంచి వెంటనే విముక్తి పొందడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించాలని సలహా ఇస్తున్నారు. ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందామా?!

మూడుసార్లు ఇలా మూడంకెలు లెక్కపెట్టండి!

టెన్షన్‌గా అనిపించినప్పుడల్లా దాన్నుంచి ఉపశమనం పొందడానికి గట్టిగా గాలి పీల్చి వదలడం మనలో చాలామంది చేసేదే! అయితే అలా చేసే క్రమంలో అంకెలు కూడా లెక్కపెట్టమని సలహా ఇస్తున్నారు నిపుణులు. అదెలాగంటే.. గట్టిగా గాలి పీల్చే క్రమంలో ముందుగా మూడంకెలు లెక్కపెట్టండి.. మరో మూడంకెలు లెక్కపెట్టే దాకా గాలిని అలాగే నిలిపి ఉంచండి.. ఆపై వదిలే క్రమంలో కూడా మరోసారి మూడంకెలు లెక్కపెట్టండి.. ఇలాగే మీరు కూర్చున్న చోటే ఓ పది సార్లు చేశారంటే ఎలాంటి టెన్షన్‌ అయినా హుష్‌కాకి అయిపోవాల్సిందే! ఇలా లెక్కించే క్రమంలో మన ఒత్తిడికి కారణమైన సమస్యను పక్కన పెట్టి సరిగ్గా లెక్కిస్తున్నామా లేదా అన్న దానిపైనే దృష్టిపెడతాం. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ఇక టెన్షన్‌ పడుతున్నప్పుడు గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది.. కాబట్టి గాలి పీల్చి వదిలే క్రమంలో ఈ వేగం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. తద్వారా టెన్షన్‌ తగ్గుతుంది.

లేత రంగులతో ఒత్తిడి మాయం!

కొన్ని రంగులు మన మనసుకు ప్రశాంతతను అందిస్తాయని సైన్స్‌ చెబుతోంది. ముఖ్యంగా ముదురు వర్ణాల కంటే లేత రంగులు ఇందుకు దోహదం చేస్తాయట! కాబట్టి ఒత్తిడిగా అనిపించినప్పుడు లేత రంగులు, వాటి షేడ్స్‌ని చూస్తే మానసికంగా, ఎమోషనల్‌గా, శారీరకంగా రిలాక్సవుతామంటున్నారు మానసిక నిపుణులు. అందుకే ఇంటి గోడలకు లేత వర్ణాలతో పెయింట్‌ చేసుకోవడం, మీరు ఇంటి నుంచే పనిచేస్తున్నట్లయితే ఆ గదిలో లేత రంగుల్లో చిత్రీకరించిన అందమైన పెయింటింగ్స్‌, బొమ్మలు వంటివి అమర్చుకోవడం వల్ల టెన్షన్‌గా అనిపించినప్పుడల్లా వాటిని చూడచ్చు.. తద్వారా వెంటనే టెన్షన్‌ తగ్గి మనసు రిలాక్సవుతుంది.

వాసన చూసెయ్‌.. ఒత్తిడి తరిమెయ్!

మనం బాగా టెన్షన్‌లో ఉన్నప్పుడు వంటింట్లో నుంచి సువాసనలు మన ముక్కును తాకాయనుకోండి.. వెంటనే మన మనసు దాని వైపు మళ్లుతుంది. అదేంటో తెలుసుకోవాలన్న ఆరాటంతో గబగబా వంటింట్లోకి పరిగెడతాం. అలా సువాసనలకు కూడా మనలోని ఒత్తిళ్లను దూరం చేసే శక్తి ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. దీన్నే అరోమా థెరపీగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మీరు ఎక్కడ పనిచేస్తున్నా మీ చుట్టూ మీకు నచ్చిన ఫ్లేవర్లతో తయారైన సెంటెడ్‌ క్యాండిల్స్‌, అత్యవసర నూనెలు, పూల మొక్కలు అందుబాటులో ఉంచుకోండి. ఒత్తిడిగా అనిపించినప్పుడల్లా వాటి వాసన చూస్తే మనసుకు ఎంతో రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది.. కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి.. తేడా మీకే తెలుస్తుంది!

టీ/కాఫీ వద్దు.. గ్రీన్‌ టీ ముద్దు!

టెన్షన్‌గా అనిపించినా, అలసిపోయినా తక్షణ శక్తి కోసం/రిలాక్స్‌ అవడం కోసం ఓ కప్పు టీ/కాఫీ తాగేద్దాం అనుకుంటుంటారు చాలామంది. ఆ అలవాటునే కాస్త ఆరోగ్యకరంగా మార్చుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. పదే పదే టీ/కాఫీలకు బదులుగా గ్రీన్‌ టీని ఎంచుకోమంటున్నారు. ఇందుకూ కారణం లేకపోలేదు. గ్రీన్‌ టీ మన శరీరంలో సెరటోనిన్‌ స్థాయుల్ని పెంచడంలో దోహదం చేస్తుంది. హ్యాపీ కెమికల్‌గా పిలిచే సెరటోనిన్‌తో మనకు ఆరోగ్యమే కాదు.. ఒత్తిడి సైతం తగ్గుతుందట! ఇలా రెండు రకాలుగా ఉపయోగపడే గ్రీన్‌ టీని టెన్షన్‌గా అనిపించినప్పుడు ఎంచుకుంటే మంచిదే కదా మరి!

పరిగెత్తితే పోయేదేముంది!

మనం టెన్షన్‌ పడడానికి మన శరీరంలో అధికంగా విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోనే కారణం. ఒత్తిడిని కలిగించే ఈ హార్మోన్‌తో పోరాడి మనల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అందుకు శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవ్వాలి. అలా జరగాలంటే ఉన్న చోటు నుంచి బయటికొచ్చి ఓ పదిహేను నిమిషాల పాటు పరిగెత్తాలంటున్నారు నిపుణులు. తద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్లు మనసులోని ఒత్తిడిని మాయం చేస్తాయి. దీంతో పాటు యోగా, కార్డియో వ్యాయామాలు, డ్యాన్సింగ్‌, ఈత.. వంటివి కూడా టెన్షన్‌ను దూరం చేసే సాధనాలే!

ఎందుకు రిలాక్సవ్వాలంటే..!

ప్రస్తుత లైఫ్‌స్టైల్లో ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఏ పనిలోనైనా టెన్షన్‌ పడకూడదు అని మనం అనుకున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో ఇది మనల్ని పలకరించకుండా ఊరుకోదు. అలాగని ప్రతిసారీ టెన్షన్‌లోనే ఉండిపోతే నిద్రలేమి, ఛాతీలో నొప్పి, గుండె సంబంధిత సమస్యలు, ఆందోళన, ఒంటరితనం, ఇతర చెడు అలవాట్లకు బానిసవడం, చేసే పనిలో నాణ్యత కొరవడడం.. ఇలా అన్ని రకాలుగా మన రోజువారీ జీవనవిధానంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకుండా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ దాన్నుంచి రిలాక్సవ్వాలి. తద్వారా ఆరోగ్యపరంగానే కాదు.. మానసిక సమస్యలకూ దూరంగా ఉండచ్చు.. పాజిటివిటీ పెరుగుతుంది.. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది.

సో.. టెన్షన్‌గా అనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి రిలాక్సవ్వండి.. అయినా సమస్య పరిష్కారం కాకపోతే మాత్రం వెంటనే మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం మర్చిపోవద్దు..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి