Updated : 11/11/2021 20:54 IST

థైరాయిడ్‌ సమస్యా? అయితే ఈ సూపర్‌ ఫుడ్స్‌ మీకోసమే!

థైరాయిడ్‌.. చాలామంది మహిళల ఆరోగ్యకరమైన జీవనశైలిపై దెబ్బ కొడుతుందీ సమస్య. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం.. వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టి థైరాయిడ్‌ గ్రంథి పనితీరును మెరుగుపరచుకోవాలంటే అందుకు మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని సూపర్‌ఫుడ్స్‌ థైరాయిడ్‌ గ్రంథి పనితీరును చక్కదిద్దడంలో తోడ్పడతాయంటున్నారు పోషకాహార నిపుణులు.

ఇంతకీ ఏయే సమస్యలొస్తాయి ?

ప్రస్తుతం చాలామంది మహిళలు థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు, మెనోపాజ్‌ దశకు చేరువవుతోన్న వారిలో థైరాయిడ్‌ గ్రంథి పనితీరు దెబ్బతినడం మనం గమనించచ్చు. అయితే ఈ రోజుల్లో 8, 9 ఏళ్ల వయసున్న పిల్లల్లో కూడా హైపో థైరాయిడిజం లక్షణాలు కనిపిస్తున్నాయి. థైరాయిడ్‌ వల్ల మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడేది.. అధిక బరువు, నెలసరి సక్రమంగా రాకపోవడం, ఇంకా పిరియడ్స్‌ సమయంలో నొప్పి వేధించడం.. లాంటివి. కాబట్టి థైరాయిడ్‌తో బాధపడే వాళ్లు కొన్ని ఆహార పదార్థాలను తప్పనిసరిగా వారి మెనూలో చేర్చుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు.

ఎండు కొబ్బరి..

థైరాయిడ్‌ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఎంతగానో ఉపయోగపడే సూపర్‌ ఫుడ్‌.. ఎండు కొబ్బరి.. ఎందుకు ఎండు కొబ్బరి అంటే.. ఇందులో అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ముఖ్యంగా థైరాయిడ్‌ సమస్య వల్ల వెజైనా వద్ద ఫంగల్‌, బ్యాక్టీరియల్‌, ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎండు కొబ్బరిలో అత్యవసర ఫ్యాటీ ఆమ్లం లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్‌ గుణాలు ఈ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఎండు కొబ్బరి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బాగా ఉపకరిస్తుంది. అలాగే థైరాయిడ్‌ సమస్యతో బాధపడే వారు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటారు. వీటిని దూరం చేయడంలోనూ ఎండు కొబ్బరి చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఎండు కొబ్బరిని నేరుగా తినడం లేదంటే చట్నీ చేసుకొనైనా తినచ్చు. అంతేకాదు.. దీన్ని సాయంత్రం పూట స్నాక్‌గా, వ్యాయామం చేసే ముందు కూడా తీసుకోవచ్చు.

పోషకాల గని.. ఉలవలు..

ఇక మరో సూపర్‌ ఫుడ్‌ ఏంటంటే.. ఉలవలు.. ఇది పోషకాల గని. కానీ చాలామంది వీటిని చాలా తక్కువగా తీసుకుంటుంటారు. ఉలవలు కాకుండా ఉలవ పిండి కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్‌ వల్ల చాలామందిలో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టడంలో ఈ పిండి చక్కగా ఉపయోగపడుతుంది. చాలామంది ఉలవలతో చేసే వంటకాలంటేనే అబ్బో చాలా సమయం పడుతుంది అనుకుంటారు. కానీ ఈ పిండితో ఈజీగా జావ చేసుకొని తీసుకోవచ్చు.

ఉలవ జావ ఇలా..!

అందుకోసం ముందుగా ఓ పాత్రను స్టౌపై పెట్టి అందులో ఓ టీస్పూన్‌ నూనె (పల్లీ నూనె లేదా ఆవ నూనె లేదా కొబ్బరి నూనె) వేయాలి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, ఆవాలు, దంచిన వెల్లుల్లి, కొద్దిగా పసుపు, కట్‌ చేసిన ఒక పచ్చి మిరపకాయను వేసి బాగా వేయించాలి. ఆపై అందులో ఓ కప్పు నీటిని పోయాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ నీళ్లు మరగడం ప్రారంభమైన తర్వాత అందులో ఓ స్పూన్‌ ఉలవ పిండిని వేసి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఓ గ్లాస్‌లో పోసుకుని అందులో ఓ టీస్పూన్‌ నెయ్యి కలుపుకొని వేడివేడిగా తాగచ్చు.

ఈ సూప్‌ని సాయంత్రం 6 గంటలకు తీసుకోవచ్చు.. అలాగే రాత్రిపూట భోజనం తక్కువగా తినాలనుకునే వారు కూడా ఈ సూప్‌ని తాగచ్చు. దీనితో పాటు ఏదైనా తినాలనుకుంటే కొద్దిగా రైస్‌ని జత చేసుకోవచ్చు. థైరాయిడ్‌తో పాటు, పీసీఓఎస్‌, రక్తపోటు లాంటి.. సమస్యలున్న వారు వారంలో 2-3 సార్లు ఈ ఉలవ జావను తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. దీని ద్వారా శరీరానికి అమైనో అమ్లాలు, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

థైరాయిడ్‌ సమస్యతో బాధపడే మహిళల్లో విటమిన్‌ ‘డి’, విటమిన్‌ ‘బి12’ లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే పిరియడ్స్‌ సమయంలో నలుపు రంగు బ్లీడింగ్‌ అవడం.. వంటి నెలసరి సమస్యలకు కూడా ఈ సూపర్‌ ఫుడ్స్‌ చెక్‌ పెడతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని