పిరియడ్ లీవ్.. మంచిదే కానీ..!

‘నీరసంగా ఉంది’, ‘కడుపునొప్పితో ఈ రోజు రాలేకపోతున్నా..’ అంటూ ఏవేవో సాకులు చెప్పి సెలవు పెడుతుంటారు చాలామంది మహిళలు. అంతేకానీ.. నెలసరి వల్ల రాలేకపోతున్నామని ధైర్యంగా చెప్పే వారు అరుదు! ఇలా మహిళల బాధను అర్థం చేసుకుని కొన్ని ప్రభుత్వాలు నెలసరి సెలవులు ఇస్తున్నాయి.

Published : 09 Jul 2024 15:45 IST

‘నీరసంగా ఉంది’, ‘కడుపునొప్పితో ఈ రోజు రాలేకపోతున్నా..’ అంటూ ఏవేవో సాకులు చెప్పి సెలవు పెడుతుంటారు చాలామంది మహిళలు. అంతేకానీ.. నెలసరి వల్ల రాలేకపోతున్నామని ధైర్యంగా చెప్పే వారు అరుదు! ఇలా మహిళల బాధను అర్థం చేసుకుని కొన్ని ప్రభుత్వాలు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. మన దేశంలో కూడా రెండు రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం.. నెలసరి సెలవుల వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చని అభిప్రాయపడింది. ఈ క్రమంలో నెలసరి సెలవుల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

ముప్పై ఏళ్లుగా...

గత దశాబ్ద కాలంగా మహిళలకు పిరియడ్‌ లీవ్స్‌ ఇవ్వాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే బిహార్‌ ప్రభుత్వం ముప్పై ఏళ్ల కిత్రమే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేసింది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచి ప్రభుత్వ ఉద్యోగినులకు శారీరక కారణాల దృష్ట్యా ప్రతినెలా రెండు రోజుల నెలసరి సెలవులను అందిస్తోంది. అయితే వీటిని ఇతర సెలవులకు అదనంగా అందించడం విశేషం. ఇలా ప్రభుత్వ ఉద్యోగినులకు ‘బయలాజికల్‌ రీజన్స్‌’ పేరిట నెలకు రెండు రోజులు సెలవులు అందిస్తోన్న ఏకైక రాష్ట్రం కూడా బిహారే!

కేరళలో..

కుసాట్‌ (కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్ అండ్‌ టెక్నాలజీ) విద్యార్థినులు నెలలో రెండు రోజులు నెలసరి సెలవులు కావాలని నమితాజార్జ్‌ ఆధ్వర్యంలో పోరాటం చేశారు. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయ యాజమాన్యం వారి పోరాటాన్ని అర్థం చేసుకుంది. అలా 2023లో యూనివర్సిటీలో చదివే విద్యార్థినులకు ప్రతి సెమిస్టర్‌లో 2 శాతం హాజరు మినహాయింపుని ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థినులకు ప్రతి నెల మూడు రోజులు నెలసరి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే 18 ఏళ్లు పైబడిన విద్యార్థినులకు గరిష్టంగా 60 రోజుల పాటు మాతృత్వ సెలవులు కూడా ఇస్తోంది. ఈ క్రమంలో పిరియడ్‌ లీవ్స్‌ లింగ సమానత్వాన్ని కాపాడతాయని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది.

దూరం పెట్టే అవకాశం..!

ఈ రెండు రాష్ట్రాలు ఇస్తోన్న నెలసరి సెలవులను ఆధారంగా చేసుకుని మిగతా రాష్ట్రాల్లోనూ ఈ పద్ధతిని అనుసరించాలని పిటిషన్‌ దాఖలైంది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులు కావని చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ‘ఉద్యోగినులకు నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల సంస్థలు వారిని దూరం పెట్టే అవకాశం ఉంది. మేము అది కోరుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో మహిళల రక్షణ కోసం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారొచ్చు’ అని అభిప్రాయపడింది. అలాగే ఒకవైపు పిటిషన్‌ను తిరస్కరిస్తూనే ఈ అంశాన్ని పరిశీలించమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది.

చర్చకు నోచుకోకుండానే..

ఒకవైపు మహిళలకు వేతనంతో కూడిన నెలసరి సెలవులు ఇవ్వాలని చర్చ జరుగుతోన్నా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించడం లేదు. ఈ క్రమంలోనే పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఇదే అంశంపై పార్లమెంట్‌లో చర్చను కోరారు. అలా గత ఏడేళ్లలో కనీసం మూడు సార్లు ప్రైవేటు బిల్లులు పెట్టగా ఒక్కసారి కూడా చర్చకు నోచుకోకపోవడం గమనార్హం. అయితే ఓ సందర్భంలో రాజ్యసభలో ఎంపీ మనోజ్‌ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు అప్పటి మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ ‘మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. ఆమె జీవితంలో అదొక సహజ ప్రక్రియ. ఈ నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షకు దారితీయొచ్చు’ అని చెప్పడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో ఆ అంశం అక్కడితో ఆగిపోయింది. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనతో మార్పులు వస్తాయేమో చూడాలి. అయితే ప్రభుత్వాలు నెలసరి సెలవులను తప్పనిసరి చేయకపోయినా.. పలు ప్రైవేటు సంస్థలు మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ‘పిరియడ్‌ లీవ్స్‌’ని మంజూరు చేస్తున్నాయి. ఇందులో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో ముందు వరుసలో ఉన్నాయి. అలాగే ‘గోజూప్‌’ వంటి సంస్థలు మహిళలకు నెలసరి సమయంలో వర్క్‌ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.


ఆ దేశాల్లో ఇలా..!

⚛ స్పెయిన్‌లో ఉద్యోగిని నెలసరి సమయంలో నెలకు మూడు రోజుల పాటు సెలవులు తీసుకోవచ్చు. అప్పటికీ ఆరోగ్యం సహకరించకపోయినా లేదంటే సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నా ఈ సెలవును మరో రెండు రోజులకు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంటుందట.

⚛ దక్షిణ కొరియాలో చట్ట ప్రకారం ఒక్క రోజు పిరియడ్‌ లీవ్‌ తీసుకోవచ్చు. అయితే ఒకవేళ ఈ సెలవును వినియోగించుకోకపోతే.. ఆ రోజు వేతనంతో పాటు అదనపు జీతం చెల్లిస్తారు.

⚛ ఇండోనేషియాలో అదనపు సెలవులు మినహాయించి.. నెలకు రెండు రోజుల నెలసరి సెలవును అమలు చేస్తున్నారు.

⚛ తైవాన్‌ తన మహిళా ఉద్యోగులకు ఏడాదికి మూడు రోజుల నెలసరి సెలవులిస్తోంది. సిక్‌ లీవ్స్‌తో వీటికి సంబంధం లేదు.

⚛ ‘మహిళలు నెలసరి సమయంలో సెలవు కోరినప్పుడు కంపెనీలు ఆ మహిళలకు తప్పకుండా సెలవు మంజూరు చేయాల్సిందే!’ జపాన్‌ కార్మిక ప్రమాణాల చట్టం చెబుతోన్న విషయమిది.

⚛ జాంబియాలో ఉద్యోగినులకు ఒక్క రోజు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్