Published : 16/02/2022 20:25 IST

అందుకే నవ్వుతూనే ఉండాలట..!

నవ్వు నాలుగు విధాల మంచిది.. అని కొందరంటే, నవ్వు నాలుగు విధాల చేటు.. అని మరికొందరంటారు. ఏదేమైనా.. ఎవరెలా అన్నా.. 'అందమైన చిరునవ్వు ముందు అన్నీ తీసికట్టే..' అనడంలో ఆశ్చర్యం లేదు. గంటల తరబడి అద్దం ముందు నుంచుని అందంగా ఉన్నామా లేమా అని తెగ చెక్ చేసుకుంటాం. కానీ 'ఓ నవ్వు చాలు.. ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది' అన్నట్లు అందమైన చిరునవ్వు ఇచ్చే అనుభూతిని, ఆత్మవిశ్వాసాన్ని మరేదీ ఇవ్వలేదు. అందుకే- వార్డ్‌రోబ్‌ను ఎంత చక్కగా అలంకరించినా, అందులోని కొత్త కొత్త డ్రస్సులతో అందంగా సింగారించుకున్నా.. స్వచ్ఛమైన చిరునవ్వంత అందంగా మరేదీ కనిపించదని అనేక అధ్యయనాల్లో సైతం వెల్లడైంది.

ఆనందం.. ఆత్మవిశ్వాసం..

మీరు నిజంగా ఆనందంగా ఉన్న విషయం మీ ముఖకవళికలు, పెదాల ద్వారా తెలిసిపోతుంది. ఈ సమయంలో రక్తం మెదడుకి ప్రసరిస్తుంది. నవ్వు మెదడుకి ప్రశాంతతని, మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మనం ఇతరులను నవ్వుతూ పలకరిస్తే వారి నుంచి జవాబు మరింత పాజిటివ్‌గా వస్తుంది. దీంతో మనలో ఆత్మవిశ్వాసం, ఆనందం మరింత రెట్టింపవుతాయి. మీ నవ్వు ద్వారానే మీలో ఉన్న పాజిటివ్ గుణాలు బయటపడతాయి. దీంతో ఎదుటివారు కూడా మీకు నిజాయతీగా దగ్గరవుతారు.

చిరునవ్వుతో చిక్కులు దూరం!

నవ్వు అందంగా కనిపించడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యం, పనిలో చురుకుదనం, సామాజిక జీవితం మొదలైన వాటిలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. కళ్ల ద్వారా ఎదుటివారి భావాలను ఎలా తెలుసుకోవచ్చో అలాగే నవ్వుతో కూడా ఎదుటివారి భావాలు, ప్రవర్తనను కనిపెట్టేయచ్చు. దాని సంగతెలా ఉన్నా.. మీరు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటే చుట్టుపక్కల వారిని కూడా ఆనందంగా ఉంచవచ్చు.

ఏదైనా చిన్న సమస్యలో ఉన్నప్పుడు ఓ చిరునవ్వు నవ్వితే చాలు.. మీ సమస్యలన్నీ దూరమై మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. మీ నవ్వు ద్వారా చుట్టుపక్కల వారిని కూడా ఆనందంగా ఉంచవచ్చు. అందుకే ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండండి. దీనివల్ల ఎదుటివారికి మీపై పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది.

అందమైన చిరునవ్వు కోసం..

* లిప్‌స్టిక్ వేసుకోవడం వల్ల పెదాలు అందంగా కనిపిస్తాయి. నిజమే! కానీ పెదాల పైన స్వచ్ఛమైన చిరునవ్వును చిందించగలిగితే అవి మరింత అందంగా కనిపిస్తాయి.

* ప్రతిరోజూ ఒక యాపిల్ తీసుకోవడం మంచిది. దీనివల్ల లాలాజలం ఉత్తేజితమై పళ్ల మీద ఉన్న మరకల్ని తొలగిస్తుంది.

* తినే సోడాను టూత్‌బ్రష్‌పై కొద్దిగా వేసి బ్రష్ చేసుకుంటే.. పళ్లు తళతళా మెరిసిపోతాయి. ఈ ప్రక్రియను 2 నిమిషాలు మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువ సేపు చేస్తే పళ్లపై ఉన్న ఎనామిల్ తొలగిపోయే ప్రమాదం ఉంది.

* పళ్లకు హానిచేసే మద్యం, ఫుడ్‌కలర్ వేసిన ఆహార పదార్థాలను వీలైనంతగా తగ్గించడం మంచిది.

* పళ్లపై అరటిపండు గుజ్జుతో వృత్తాకారంగా రుద్దాలి. దీంతో పండులో ఉన్న మినరల్స్ పళ్లలోకి వెళ్లి వాటిని కాంతివంతంగా చేస్తాయి.

గుర్తుంచుకోండి!

* నవ్వు మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

* రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

* నవయవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

* కోపం, చికాకులను దూరంగా ఉంచుతుంది.

* ఎదుటివారిని సంతోషంగా ఉండేలా చేస్తుంది.

అందుకే.. సాధ్యమైనంతవరకు హాయిగా నవ్వుతూ ఉండండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని