భర్త మరణిస్తే మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అది తన ఇష్టం!

'నేను శక్తిమంతుణ్ని అని భావిస్తే.. శక్తిమంతులుగానే కొనసాగుతారు..నేను శక్తిహీనుణ్ని అనుకొంటే అలాగే శక్తిహీనులుగానే ఉంటారు..'

Updated : 12 Jan 2022 14:18 IST

'నేను శక్తిమంతుణ్ని అని భావిస్తే.. శక్తిమంతులుగానే కొనసాగుతారు..
నేను శక్తిహీనుణ్ని అనుకొంటే అలాగే శక్తిహీనులుగానే ఉంటారు..'
ప్రతి ఒక్కరూ తమలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే స్ఫూర్తినిస్తూ వివేకానందుడు పలికిన మాటలివి. మిగిలిన వారి విషయం పక్కన పెడితే.. మహిళలు తప్పకుండా ఆచరించాల్సిన సూత్రం ఇది. ఇదే కాదు.. వివేకానందుని నోటి నుంచి వెలువడిన ప్రతి మాటా అమృత వాక్కే. వాటిని ఆచరిస్తే విజయం మన సొంతం. 'బలమే జీవితం.. బలహీనతే మరణం' అంటూ మనలో ధైర్యాన్ని నూరిపోసిన మహానుభావుడు వివేకానందుడు. ఆయన మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని చూస్తే.. ఆయన హృదయ ఔన్నత్యం ఎంతటిదో అర్థమవుతుంది. సంప్రదాయాల పేరుతో మహిళలను ఆంక్షల చట్రంలో బంధించడాన్ని ఆనాడే ఆయన నిరసించారు. వారికి కావాల్సినంత స్వేచ్ఛ ఇస్తే ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వివిధ సందర్భాల్లో మహిళల గురించి, వారి ఔన్నత్యం గురించి ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలే మహిళల పట్ల ఆయన దృక్కోణానికి నిదర్శనం. అలాంటి కొన్ని ఆసక్తికర అంశాల గురించి స్వామి వివేకానంద జయంతి(జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా మీకోసం...

జగన్మాత ప్రతిరూపం..

వివేకానందుడు స్త్రీలను జగన్మాత రూపంగా భావించేవారు. ఎందుకంటే మనదేశంలో విద్య, ధనం, ధైర్యం, ఇలా అన్నింటికి అధిదేవత ఆ తల్లే. 'సమస్త లోకాల సృష్టికి మూలం ఆమే. స్త్రీలందరూ ఆవిడ ప్రతిరూపాలే' అని ఆయన చెప్పేవారట. దీన్ని మరింత వివరంగా చెప్పడానికి సప్తశతిలోని 'విద్యా సమస్తాస్తవ దేవి భేదాః స్త్రియః సమస్తా సకలా జగత్సు' అనే శ్లోకాన్ని ఆయన ఉదహరించేవారు. అంతేకాదు.. ఏ ప్రాంతానికి వెళ్లినా మహిళలను 'అమ్మా' అనే సంబోధించేవారు. అక్కడి వారికి మన సంస్కృతి గొప్పదనంతో పాటు.. మనదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం గురించి వివరించేవారు.

ఆ సహనానికి జోహార్లు..

స్వామి వివేకానంద మనదేశ మహిళలను చాలా ఉన్నతమైన వారిగా.. ప్రపంచానికే ఆదర్శప్రాయులుగా అభివర్ణించేవారు. వారిలో ఉన్న సహనం, కష్టాలను ఓర్చుకునే గుణం, భావితరాలకు వారందించే విలువలు ఇవన్నీ స్త్రీల ఔన్నత్యానికి దర్పణంగా ఆయన భావించేవారు. అంతేకాదు.. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడగలిగే లక్షణం స్త్రీలకు మాత్రమే ఉందని ఆయన నమ్మేవారు. దీనికి సీతాదేవినే ఉదాహరణగా చూపించేవారు. భర్త వెంట అడవులకేగినా.. రావణుడు చెరలో బంధించినా.. చివరికి రాముడు తనను త్యజించినా.. ఎక్కడా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ ధైర్యమే మన దేశ స్త్రీలకూ వచ్చిందట. అందుకే మనల్ని సీతాదేవి బిడ్డలుగా అభివర్ణించారాయన.

మాతృసమానులు..

వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లందరినీ మాతృసమానులుగానే వివేకానందుడు పరిగణించేవారు. ఇతర దేశాల్లో మన దేశ సంస్కృతి గురించి తెలిపే క్రమంలో హిందూ దేశ స్త్రీల గొప్పదనాన్ని కూడా వివరించేవారు. విదేశాల్లో ఉన్నప్పుడు వివేకానందుని బోధనలు వినడానికి మహిళలు సైతం వచ్చేవారు. ఆ సమయంలో ఒకరిని ఆయన 'అమ్మా' అని పిలిచారు. దీంతో ఆమె 'నేను అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా?' అని అడిగింది. దానికి సమాధానంగా 'మాదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్లను మాతృసమానురాలిగానే చూస్తారు. ఎంత చిన్నపిల్త్లెనా సరే వారిని ఆ ఆదిశక్తి స్వరూపంగానే భావిస్తాం. అందుకే వయసుతో సంబంధం లేకుండా అమ్మా అనే పలకరిస్తామ'ని ఆయన వివరించారు. మరొకసారి విదేశీ వనిత ఒకరు స్వామీజీ దగ్గరకు వచ్చి ఆయన్ను వివాహం చేసుకోవాలన్న కోరికను ఆయన ముందుంచింది. ఆయన్ను పెళ్లి చేసుకుంటే అంతే స్థాయిలో తెలివితేటలు కలిగిన పిల్లలు పుడతారనే ఆశను వ్యక్తం చేసింది. దీనికి వివేకానంద స్పందిస్తూ.. 'తెలివైన పిల్లలకు జన్మనివ్వాలన్న నీ తల్లి మనసును అర్థం చేసుకోగలను. అయితే దీనికి చాలా సమయం పడుతుంది. పైగా తెలివైనవారే పుడతారని కచ్చితంగా చెప్పలేం. దానికి బదులుగా నీ కోరిక వెనువెంటనే తీరే మార్గం నేను సూచించగలను. నన్నే నీ కొడుకుగా భావించు. నువ్వు నా కన్నతల్లిలాంటిదానివే..' అని సమాధానమిచ్చారు. మహిళలకు ఆయన ఎంత గౌరవం ఇచ్చేవారో తెలుసుకోవడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణగా నిలుస్తుంది.

నిర్ణయం వారిదే..

తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తామే తీసుకోగలిగిన స్వేచ్ఛ మహిళలకు ఉండాలని వివేకానంద కోరుకునేవారు. ఇందుకు ఓ ఉదాహరణను సైతం ఆయన అనుచరులు చెబుతారు. ఒకసారి ఒక వ్యక్తి వివేకానందుని దగ్గరికి వెళ్లి 'వితంతువులు తిరిగి పెళ్లి చేసుకోవచ్చా?' అని అడిగారట. దానికి స్వామీజీ 'ఆమె జీవితాన్ని నిర్ణయించడానికి మనం ఎవరం? తిరిగి వివాహం చేసుకోవాలా? వద్దా? అనే అంశంపైన నిర్ణయం ఆమెదే. మన దేశ మహిళలు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయం తీసుకోగల సమర్థులే. వారు చదువుకోవడానికి.. ఎదగడానికి మీరు సృష్టిస్తున్న అడ్డంకుల్ని తొలగించండి' అని సమాధానమిచ్చారట.

శాస్త్ర, సాంకేతికత అంటే ఏమిటో తెలియని ఆరోజుల్లోనే స్వామి వివేకానంద మహిళల అభ్యున్నతి కోసం పాటుపడాలని సూచించారు. దాన్ని సాధించినప్పుడే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఆధునిక సమాజంగా పేర్కొంటున్న నేటి కాలంలోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే చెప్పాలి. దీనికి తోడు వారిపై జరిగే అత్యాచారాలు రోజుకో రూపం మార్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చి.. మహిళ నిర్భయంగా జీవనం సాగించే రోజు రావాలంటే వివేకానందుడు చూపిన దారిలో నడవడమే ఏకైక మార్గం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్