Published : 02/01/2023 12:12 IST

ఆరోగ్యం కోసం.. ‘స్వీట్‌’ రిజల్యూషన్స్!

కొత్త ఏడాదిలోకి అడుగిడే క్రమంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్.. వంటి విషయాల్లో పలు తీర్మానాలు చేసుకోవడం పరిపాటే! ఈ క్రమంలోనే స్వీట్స్‌ తినే అలవాటును అదుపు చేసుకోవాలనుకునే వారూ లేకపోలేదు. అయితే అలా నోరు కట్టేసుకున్న వారు కూడా ‘రేపట్నుంచి మానేద్దాంలే!’ అని తమ లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు. నిజానికి ఇలా రోజూ రేపు అని వాయిదా వేస్తూ ఉంటే కొన్ని రోజులకు బీపీ, మధుమేహం, అధిక బరువు, గుండె సంబంధిత సమస్యలు.. వంటి దీర్ఘకాలిక వ్యాధులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, ఇలా జరగకూడదంటే కొత్త ఏడాదిలో ‘స్వీట్‌’ రిజల్యూషన్స్‌ ఎలా సెట్‌ చేసుకోవాలో తెలుసుకుందాం..!

 

ప్రత్యామ్నాయాలు

ఉదయాన్నే కప్పు కాఫీ/టీ/గ్లాసు పాలు.. ఇలా ఏది తీసుకున్నా అందులో సరిపడా చక్కెర వేసుకోవడం చాలామందికి అలవాటు. దీంతో పాటు వివిధ స్వీట్స్ తయారీలోనూ చక్కెర వాడే వారే ఎక్కువ. ఇక స్వీట్‌ షాపులో దొరికే స్వీట్స్‌లోనూ చక్కెరతో తయారైనవే ఎక్కువగా ఉంటాయి.

ఈక్రమంలో చక్కెరకు బదులుగా బెల్లం, తేనె, డేట్స్.. వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిది. అయితే వీటిని కూడా తగిన మోతాదులో తీసుకోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.

బ్రేక్‌ఫాస్ట్‌లో..

ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌గా బిస్కట్లు మొదలైన వాటికి బదులు ఓట్స్‌, చక్కెర వేయకుండా తయారుచేసిన పండ్ల రసాలు, మల్టీ గ్రెయిన్‌ బ్రెడ్‌, చిరుధాన్యాలు-తృణధాన్యాలతో చేసిన వంటకాలు.. మంచివి. ఈ పదార్థాల్లో చక్కెర స్థాయులు తక్కువగా ఉండడంతో పాటు వీటిలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

ప్రత్యేక సందర్భాల్లో..!

న్యూ ఇయర్‌, పుట్టిన రోజు, పెళ్లి రోజు.. ఇలా ప్రత్యేక సందర్భం ఏదైనా సరే.. కేక్‌, కూల్‌డ్రింక్స్‌తో సెలబ్రేట్‌ చేసుకోవడం మనకు అలవాటే. అయితే వీటిలో చక్కెర స్థాయులు మోతాదుకు మించి ఉంటాయి. సెలబ్రేషన్‌ పేరుతోనే కాదు.. బేకరీ కనిపిస్తే చాలు.. అందులోకెళ్లి కేక్స్‌, కూల్‌డ్రింక్స్‌ని విచ్చలవిడిగా లాగించేసే వారూ లేకపోలేదు. అలాంటి వారు తమ స్వీట్‌ క్రేవింగ్స్‌ని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది.

లేబుల్‌ చూశాకే కొనండి!

బయట దొరికే ప్యాక్డ్ ఫుడ్స్‌పై ఉన్న లేబుల్‌ని చదివేవారు ఎంతమంది ఉంటారంటే.. వేళ్ల మీద లెక్కపెట్టచ్చు..! కంటికి ఇంపుగా ఉందని ఆయా ఫుడ్‌ ప్యాకెట్స్‌ని ట్రాలీలో వేసుకుంటారే కానీ.. అందులో ఉన్న పోషక విలువలేంటి, వాడిన పదార్థాలేంటి.. అన్న విషయాలు అసలు పట్టించుకోరు. అయితే బయటి నుంచి ఏది తెచ్చుకున్నా సరే.. ముందుగా లేబుల్‌ని చదవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చక్కెర ఎక్కువగా వాడిన వాటిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేయమంటున్నారు. ఇలా కొనే ముందు ఆహార పదార్థాల లేబుల్‌ని చూడడం అలవాటు చేసుకుంటే వాటిలో మన శరీరానికి అనవసరం అనుకున్న వాటిని పక్కన పెట్టేసి అవసరమైనవే ఎంచుకునే వీలుంటుంది. తద్వారా ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి కూడా!

⚛ ఆకలేసినప్పుడల్లా, స్నాక్స్‌ పేరుతో బిస్కట్లు, వేఫర్స్‌.. వంటివి ఎక్కువగా లాగించేస్తుంటాం. వాటికి బదులుగా సీజనల్‌ పండ్లు, డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే అటు ఆరోగ్యంతో పాటు ఇటు తీపి తినాలన్న కోరికా తీరుతుంది.

⚛ కొంతమంది చక్కెరను ఫ్లేవర్‌గా కూడా వాడుతుంటారు. ఈ క్రమంలో పెరుగు.. వంటి పదార్థాలపై చక్కెరను చల్లుకొని తీసుకుంటారు. కానీ ఫ్లేవర్‌ కోసం చక్కెరకు బదులుగా దాల్చిన చెక్క పొడిని ఉపయోగించచ్చు. తద్వారా ఆయా పదార్థాలకు తియ్యదనం వస్తుంది.

⚛ బయట దొరికే గ్రానోలా బార్స్‌, చిక్కీలు.. వంటి వాటిలో బెల్లంతో పాటు చక్కెరను కూడా ఉపయోగిస్తుంటారు. కాబట్టి వీటిని బయటి నుంచి తెచ్చుకునే కంటే ఇంట్లోనే కేవలం బెల్లంతోనే తయారుచేసుకోవడం ఆరోగ్యకరం.

హ్యాపీ అండ్ హెల్దీ న్యూ ఇయర్!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని